logo

కదులుతున్న సి‘ఫార్సుల’ డొంక

డీఈవో కార్యాలయంలోని మధ్యాహ్న భోజన పథకం కింద గత ఏడాది చేపట్టిన నియామకాలపై ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి విచారణ చేపట్టారు.

Published : 26 Jun 2024 01:41 IST

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: డీఈవో కార్యాలయంలోని మధ్యాహ్న భోజన పథకం కింద గత ఏడాది చేపట్టిన నియామకాలపై ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి విచారణ చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకం సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయడానికి, మండల విద్యాశాఖ కార్యాలయాలు, పాఠశాలల నుంచి సమాచారం సేకరించడానికి ముగ్గురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను కాంట్రాక్టు పద్ధతిపై వైకాపా ప్రభుత్వ హయాంలో నియమించారు. ఈ నియామకాల్లో నిబంధనలు పాటించలేదని.. నాటి ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సిఫార్సుల మేరకు వార్డు వాలంటీర్లుగా పనిచేస్తున్న వారికి పోస్టులు కట్టబెట్టారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అటు వాలంటీర్లుగా వేతనం పొందుతూనే ఈ పోస్టుల్లో కొనసాగుతున్నట్లు అందులో పేర్కొన్నారు.వైకాపా ప్రభుత్వం వీటిపై ఎలాంటి విచారణ చేపట్టలేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఈ విషయంపై ఉన్నతాధికారులకు మరోసారి ఫిర్యాదు అందింది. దీంతో ఆర్జేడీని విచారణాధికారిగా నియమించారు. ఒంగోలు డీఈవో కార్యాలయానికి మంగళవారం వచ్చిన ఆయన సంబంధిత దస్త్రాలు పరిశీలించారు. ఆయా విభాగాల అధికారుల నుంచి సమాచారం సేకరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు కేటాయించిన సైకిళ్లు పంపిణీ చేయలేదనే ఫిర్యాదులపై ఆరా తీశారు. కోర్టు వివాదం కారణంగా కొమరోలు ఎయిడెడ్‌ పాఠశాల యాజమాన్యం 218 సైకిళ్లు పంపిణీ చేయలేదని తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని