logo

అవమానించాడని.. గొంతు కోసి చంపేశాడు

నలుగురిలో అవమానించాడని రగిలిపోయిన ఆ మేస్త్రీ..పక్కా ప్రణాళికతో తన వద్ద పనిచేసే యువకుడ్ని హతమార్చాడు. సంచలనం రేపిన పేర్నమిట్ట హత్యకేసును పోలీసులు ఛేదించారు.

Published : 26 Jun 2024 01:40 IST

పేర్నమిట్ట హత్యకేసులో వీడిన మిస్టరీ

హత్యకు ఉపయోగించిన కత్తిని పరిశీలిస్తున్న అదనపు ఎస్పీ(క్రైమ్స్‌) శ్రీధర్‌రావు, ఒంగోలు డీఎస్పీ కిషోర్‌బాబు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: నలుగురిలో అవమానించాడని రగిలిపోయిన ఆ మేస్త్రీ..పక్కా ప్రణాళికతో తన వద్ద పనిచేసే యువకుడ్ని హతమార్చాడు. సంచలనం రేపిన పేర్నమిట్ట హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మృతుడు, నిందితులు ఉత్తర్‌ప్రదేశ్‌ వాసులుగా గుర్తించారు. ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ(క్రైమ్స్‌) ఎస్‌.వి.శ్రీధర్‌రావు, ఒంగోలు డీఎస్పీ ఎం.కిషోర్‌బాబుతో కలిసి వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ధ్రువ్‌చంద్ర వర్మ గత కొన్నేళ్లుగా ఒంగోలు సుజాతానగర్‌లో ఉంటూ పీఓపీ (ఇంటి సీలింగ్‌) మేస్త్రిగా పనిచేస్తున్నాడు. యూపీ నుంచి కూలీలను తీసుకొచ్చి పనిచేయించేడు. తాను కుటుంబంతో సహా ఉండే భవనంలోనే కింది పోర్షన్‌లో వారికి వసతి కల్పించేవాడు. ఇటీవల అదే రాష్ట్రానికి చెందిన వినీత్‌ శ్రీవాస్తవ అనే యువకుడు ధ్రువ్‌చంద్రవర్మ వద్ద పనికి కుదిరాడు. ఈ నెల 23వ రూ.పదివేలు నగదు కావాలని ధ్రువ్‌ను అడగ్గా ఆయన సాధ్యంకాదని చెప్పాడు. దీంతో శ్రీవాస్తవ తీవ్ర ఆగ్రహానికి గురై ధ్రువ్‌ను నెట్టేసి చంపేస్తానని హెచ్చరించాడు. కూలీల ముందు మేస్త్రిగా తనకు జరిగిన అవమానంతో ధ్రువ్‌ చంద్ర వర్మ రగిలిపోయాడు. తనవద్ద పనిచేసే యూపీ వాసి రాంచరణ్‌తో కుట్ర పన్నాడు. ఒంగోలు శివార్లలో అమ్మాయిలుంటారని చెప్పి ఆదివారం అర్థరాత్రి తన ఎఫ్‌జెడ్‌ బైకుపై రాంచరణ్‌తో కలిసి శ్రీవాస్తవ్‌ను ఎక్కించుకుని పెళ్లూరు మేజర్‌ వైపు తీసుకెళ్లాడు. అక్కడకు వెళ్లాక..నన్నే చంపేస్తానని బెదిరించావు కదా..ఇప్పుడు నిన్ను హతమారుస్తానంటూ కత్తితో ధ్రువ్‌చంద్ర వర్మ, శ్రీవాస్తవపై దాడి చేశాడు. రాంచరణ్‌ శ్రీవాస్తవను గట్టిగా పట్టుకోగా ధ్రువ్‌ అతని గొంతుకోసేశాడు. సోమవారం ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ ఆదేశాలతో అదనపు ఎస్పీ శ్రీధర్‌రావు పర్యవేక్షణలో, ఒంగోలు డీఎస్పీ కిషోర్‌బాబు, రెండో పట్టణ సీఐ జగదీష్, తాలూకా ఎస్సై విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి నిందితుల్ని అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని