logo

సంక్షేమ చేవ్రాలుకు ఆమోదం

కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా సోమవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటైంది. ఇందులో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అయిదు అంశాలపై చేసిన సంతకాలకు ఆమోదం లభించింది.

Updated : 25 Jun 2024 05:25 IST

పింఛన్‌ పెంపు సహా అయిదింటికి పచ్చజెండా
జిల్లా వాసులకు ‘పాంచ్‌’ పటాకా ప్రయోజనాలు

కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా సోమవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటైంది. ఇందులో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అయిదు అంశాలపై చేసిన సంతకాలకు ఆమోదం లభించింది. ఇందులో మెగా డీఎస్సీతో పాటు, పింఛన్లు రూ.3 వేలు నుంచి రూ.4 వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు అంశాలున్నాయి. దీంతో జిల్లా వాసుల్లో ఆనందం నెలకొంది. వైకాపా గతంలో పింఛన్‌ రూ.3 వేలు ఇస్తామని చెప్పి ఆధికారంలోకి వస్తానే నాలుక మడతేసింది. ఏడాదికి రూ.250 చొప్పున మాత్రమే పెంచుతూ అయిదేళ్లకు రూ.3 వేలు చేసింది. సాకులు చూపుతూ లబ్ధిదారుల సంఖ్యను ఏటా గణనీయంగా తగ్గించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే నెల నుంచే సంక్షేమాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకోవడంపై జిల్లా వాసుల్లో సంతోషం నెలకొంది.

ఈనాడు, ఒంగోలు


రోజూ 10,000 మందికి  అన్నం...

అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఒంగోలులో అయిదు, మార్కాపురంలో ఒకటి, కనిగిరిలో మరొకటి నిర్వహించారు. రూ.5కే రుచికరమైన భోజనం అందించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక వీటిని మూసివేయించారు. ఆ భవనాలను వార్డు సచివాలయాలు, ఇతర అవసరాలకు వినియోగించారు. తాజాగా మంత్రివర్గం ఆమోదంతో ఆగస్టు నెల నుంచి అన్న క్యాంటీన్ల ద్వారా తిరిగి తెదేపా ప్రభుత్వం రుచికరమైన భోజనం అందించనుంది. తద్వారా రోజుకు పది వేల మందికి ప్రయోజనం చేకూరనుంది.

2,91,968 మందికి  ఒకటినే లబ్ధి..

పింఛన్ల పెంపులో తెదేపా రికార్డు సృష్టించింది. 2014లో రూ.200గా ఉన్న మొత్తాన్ని రూ.వెయ్యికి పెంచింది. 2019 ఎన్నికలకు ముందు ఏకంగా రూ.2 వేలు చేసింది. దీంతో అప్పటి ప్రతిపక్షం వైకాపా తాము అధికారంలోకి వస్తే రూ.3 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. తీరా గద్దెనెక్కాక రూ.3 వేలు ఇవ్వకుండా ఏటా రూ.250 మాత్రమే పెంచింది. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగానే పింఛన్ల పెంపుపై సంతకం చేశారు. మంత్రివర్గ సమావేశంలో ఇప్పుడు ఆమోదం లభించడంతో జులై 1న ఇంటి వద్దే లబ్ధిదారులకు అందజేయనున్నారు. జిల్లాలో 2,91,968 మంది లబ్ధిదారులకు పెంపుతో ప్రయోజనం చేకూరుతుంది.

20,000 మందికి  ఉద్యోగ భరోసా...

అధికారంలోకి వస్తే మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే చేస్తానన్న మాటను చంద్రబాబు నిలుపుకొన్నారు. మంత్రివర్గ ఆమోదంతో జిల్లాలోని నిరుద్యోగులు, యువతలో ఉత్సాహం నెలకొంది. వైకాపా పాలనలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకపోవడం, టెట్‌ పరీక్షను కూడా క్రమంగా నిర్వహించకపోవడంతో అభ్యర్థులు నష్టపోయారు. తెదేపా అధికారంలోకి వస్తానే ఇచ్చిన హామీ మేరకు ఖాళీగా ఉన్న 16,347 పోస్టులు భర్తీచేయనుండగా అందులో జిల్లాకు దాదాపు వెయ్యి పోస్టులుంటాయని అంచనా. వీటి భర్తీ ఈ ఏడాది డిసెంబరులోపే ఉంటుందన్న సంకేతాలతో జిల్లాలోని ఇరవై వేల మంది అభ్యర్థులు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు.

చట్టం రద్దుతో  భూములకు రక్షణ...

2023 అక్టోబరులో వైకాపా ప్రభుత్వం ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అమల్లోకి తెస్తూ హడావిడిగా జీవో తెచ్చింది. దీంతో భూయజమానుల్లో కలకలం నెలకొంది. కేంద్రంలో నీతి ఆయోగ్‌ చేసిన సూచనలకు.. రాష్ట్రంలో వైకాపా అమలు చేసిన చట్టానికి పొంతనే లేదు. దీంతో ప్రజల భూములకు రక్షణ లేకుండా పోయింది. ఈ విషయమై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సార్వత్రిక ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు ఈ చట్టం రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైతుల్లో భయాందోళనలు తగ్గించేలా ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రద్దు చేసి అసలు పత్రాలు యజమానులకు తిరిగిచ్చేస్తామనే హామీతో అంతటా ఆనందం కనిపిస్తోంది.

70 వేల మంది  యువతలో ఆశలు...

ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సంతకాల్లో నైపుణ్య గణన ఒకటి. మంత్రివర్గం ఈ అంశానికి ఆమోదం తెలిపింది. దీంతో జిల్లాలో ఉన్నత విద్యను అభ్యసించి సరైన నైపుణ్యం లేక అవస్థలు పడుతున్న విద్యార్థులు, యువతకు మేలు చేకూరనుంది. గతంలో కూడా తెదేపా నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటుచేసి, 38 డిగ్రీ కళాశాల్లో ఎంప్లాయిబిలిటీ నైపుణË్య కేంద్రాలు ఏర్పాటు చేసి ఒక్కో కేంద్రానికి ఆరు వరకు ట్యాబు, ల్యాప్‌టాప్‌లు అందజేసి శిక్షణ ఇప్పించింది. క్యాంపస్‌ ఇంటర్య్వూల ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పించింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొక్కుబడి నిర్వహణతో యుతకు ఉపయోగం లేకుండా పోయింది. తెదేపా ప్రభుత్వం నైపుణ్య గణనకు ప్రాధాన్యం ఇవ్వడం, దానికి క్యాబినెట్‌ ఆమోదం లభించడంతో జిల్లాలోని 70 వేల మందికి పైగా నిరుద్యోగ యువతలో ఆశలు చిగురించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని