logo

వైకాపా ఓడింది.. ఒంగోలు బతికి పోయింది!

వైకాపా ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన తాత రాజారెడ్డి హయాం నుంచీ ఆ తర్వాత రాజశేఖర్‌ రెడ్డి జమానాలోనూ ఆ కుటుంబానికి తలలో నాలుకలా మెలిగారు.

Updated : 25 Jun 2024 05:27 IST

జిల్లా వనరులపై పుష్ప కన్ను
దోపిడీ చేసేందుకు ముందుగానే కుట్రలు
ఇప్పటికే చెవిరెడ్డి చేతుల్లోకి ఆర్టీసీ ఆస్తులు
కీలెరిగి వాత పెట్టిన ఓటర్లు

వైకాపా ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన తాత రాజారెడ్డి హయాం నుంచీ ఆ తర్వాత రాజశేఖర్‌ రెడ్డి జమానాలోనూ ఆ కుటుంబానికి తలలో నాలుకలా మెలిగారు. భూములు, గనులు, ఎర్రచందనం అక్రమ రవాణాలో ఆరితేరారని విమర్శలు ఎదుర్కొంటున్న నాయకుడు. గత సీఎంతో సాన్నిహిత్యం నేపథ్యంలో తనకు ఎదురే లేదన్నట్లు వ్యవహరించారు. తన అక్రమాలతో తిరుపతి జిల్లా వాసులను బెంబేలెత్తించారు. అవినీతి సొమ్ము, అక్రమాలతో ఓటర్లను ప్రలోభ పెట్టడంలో దిట్టగా పేరొందారు. అటువంటి వ్యక్తిని గత ఎన్నికల్లో వైకాపా తన పార్లమెంట్‌ అభ్యర్థిగా ఒంగోలులో బరిలోకి అనూహ్యంగా దించింది. ఇక్కడి సహజ వనరులను దోచుకునేందుకే అనే విమర్శలు అప్పట్లోనే వెల్లువెత్తాయి. ప్రభుత్వ భూములు, గ్రానైట్‌ గనులపై కళ్లు పడ్డాయని.. వాటి దోపిడీకి ముందుగానే కుట్రలు పన్నారని.. అధిష్ఠానం అండతో అందుకే ఆయన బరిలోకి దిగారనే ఆరోపణలు అప్పట్లో హల్‌చల్‌ చేశాయి. ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే అవే నిజమనిపిస్తున్నాయి.

న్యూస్‌టుడే, ఒంగోలు

సొంత పార్టీలోనే  తీవ్ర వ్యతిరేకత...

చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని వైకాపా అధిష్ఠానం గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒంగోలు పార్లమెంట్, సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. ఆ పేరును ప్రతిపాదించడంతోనే జిల్లాలోని ఆ పార్టీ నాయకులు ఉలిక్కి పడ్డారు. ఆ వెంటనే ఎంపీ అభ్యర్థిగానూ ఆయన పేరును ప్రకటించారు. దీంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తిరుపతి జిల్లాలో ఎర్రచందనం, భూ ఆక్రమణలు, ఇసుక, మట్టి అక్రమ రవాణా, ప్రైవేట్‌ పంచాయితీలు చేయడంలో ఆయన దిట్ట అనే పేరుంది. ఈ కారణంగా చెవిరెడ్డి అభ్యర్థిత్వాన్ని సొంత పార్టీ నేతలే తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన నియోజకవర్గంలోకి అడుగు పెట్టక ముందే ఎర్రచందనం స్మగ్లర్‌ అంటూ కరపత్రాలు వెలువడటం కలకలం సృష్టించింది. అయినప్పటికీ పార్టీ అధిష్ఠానం ఖాతరు చేయకుండా ఏకపక్షంగా వ్యవహరించింది.

టంగుటూరు ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంగణంలోని స్థలంలో నేల కూల్చిన భారీ చెట్లు

అధిష్ఠానం..  దుష్ట రాజకీయ చాణక్యం

వైకాపా ప్రభ వెలుగొందిన సమయంలో కోట్లాది రూపాయల విలువైన భూములపై చెవిరెడ్డి కన్నేశారు. ప్రభుత్వ పెద్దల వద్ద తనకున్న పరపతిని చూపి అధికారులను బెదిరించి, ప్రలోభాలకు గురిచేశారు. విలువైన ఆస్తులను నామమాత్రకు ధరకు లీజుకు తీసుకున్నారు. ఒంగోలు డిపో 40 సెంట్ల స్థలాన్ని నెలకు రూ.2.40 లక్షలకు పొందారు. మరికొన్ని చోట్లా అడ్డగోలు వ్యవహారాలకు తెర లేపారు. తనకంటే ఎక్కువకు కోట్‌ చేసిన వారిని బెదిరించి తన కుమారుడు మోహిత్‌రెడ్డి పేరిట ఆ స్థలాన్ని దక్కించుకున్నారు. ఈ వ్యవహారాన్ని తెదేపా మిత్రపక్షం జనసేన ఆధారాలతో సహా బయట పెట్టింది. కేవలం ఒంగోలులోనే కాదు, రాష్ట్రంలోని పలు డిపోల పరిధిలో చెవిరెడ్డి ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టిన వైనాన్ని వారు వెలికితీశారు. జిల్లాలో అడుగు పెట్టక ముందే చెవిరెడ్డి దుష్ట రాజకీయ చాణిక్యాన్ని చూసినవారు ఔరా.! అంటూ ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు. ప్రస్తుత పరిణామాలను పరిశీలించి వైకాపా ఓడి.. ఒంగోలు బతికిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు.

గ్రానైట్‌పై గుత్తాధిపత్యానికి తహతహ...

చెవిరెడ్డిని జిల్లాకు బదలాయించడంలో, ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా, సంతనూతలపాడు అసెంబ్లీ సమన్వయకర్తగా నియమించడానికి వైకాపా ముందస్తు కుట్రలే కారణమనే విమర్శలు వినిపించాయి. చీమకుర్తి ప్రాంతంలోని గ్రానైట్‌ గనులపై కన్నేసిన అధికార పార్టీ.. అక్కడ పైచేయి సాధించి మొత్తం సామ్రాజ్యాన్ని తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు వీలుగా పథక రచన చేసి మరీ చెవిరెడ్డిని రంగంలోకి దింపిందని అధికార పార్టీలోనే అంతర్గత చర్చ నడిచింది. అందులో భాగంగానే అప్పటి వరకు సంతనూతలపాడు ఎమ్మెల్యేగా వ్యవహరించి, తీవ్ర అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్న సుధాకర్‌బాబును ఆయన సహాయకుడి హోదాలో డిప్యూటీ సమన్వయకర్తగా నియమించారు. సుధాకర్‌బాబును ఎన్నికల ప్రక్రియ ఆసాంతం చెవిరెడ్డి తన వెంట తిప్పుకొన్నారు కూడాను. గ్రానైట్‌ గనులపై కన్నేసే.. మాజీ మంత్రి, జిల్లా గ్రానైట్‌ వ్యాపారంలో ప్రముఖుడు శిద్దా రాఘవరావును కూడా ఇబ్బంది పెట్టేలా వ్యూహాత్మకంగా వ్యవహరించిందనే విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే ఆయన రాజకీయ నిర్ణయం తీసుకోకుండా సీఎంవోకు పిలిపించి మరీ బెదిరించారనే ఆరోపణలు వినిపించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు