logo

గ‘లీజు’ జగన్‌ కోట

అధికారం చేతిలో ఉంది కదా అని వైకాపా నేతలు అడ్డగోలుగా వ్యవహరించారు. తామేమి చేసినా చెల్లుబాటవుతుందని భావించారు.

Updated : 25 Jun 2024 05:28 IST

అడ్డగోలుగా అనుమతులిచ్చేసిన ఓఎంసీ
పన్ను మినహాయింపులోనూ కక్కుర్తి

ఒంగోలు ఎన్నెస్పీ కాలనీలో ఎకరా రూ. వెయ్యికే పొంది ప్యాలెస్‌ను తలపించేలా నిర్మించిన వైకాపా కార్యాలయ భవనం

అధికారం చేతిలో ఉంది కదా అని వైకాపా నేతలు అడ్డగోలుగా వ్యవహరించారు. తామేమి చేసినా చెల్లుబాటవుతుందని భావించారు. ఆ మేరకు నిబంధనలకు నిలువునా పాతరేశారు. అప్పటి అధికారులు కూడా అదేమని అడగలేదు. ఇష్టారీతిన సాగుతున్న వ్యవహారాన్ని ప్రశ్నించిందీ లేదు. అధికారం ఆజ్ఞాపించిందని తొత్తులుగా మారి శిరసావహించారు. గ‘లీజు’ వ్యవహారానికి తమవంతు సహకారం అందించారు. సామాన్యులు ఇల్లు కట్టాలంటే ఒంగోలు నగరపాలక సంస్థ సిబ్బంది చుక్కలు చూపుతుంటారు. సవాలక్ష నిబంధనలు చూపుతూ బేరసారాలు సాగిస్తారు. చివరికి ఎవరితోనైనా సిఫార్సులు చేయిస్తేనో., అడిగిన మేరకు ముట్టజెపితోనే దస్త్రానికి నడక తెప్పిస్తారు. అదే వైకాపా జిల్లా కార్యాలయ భవనం నిర్మాణానికి మాత్రం ఏ నిబంధన వర్తించదు. ఆ పార్టీ నేతల మెప్పు కోసం కార్పొరేషన్‌ ఖజానాకు గండి కొట్టి మరీ అనుమతులు అప్పనంగా కట్టబెటేశారు. 

ఈనాడు, ఒంగోలు; ఒంగోలు నగరం, న్యూస్‌టుడే

తెదేపాకు తప్పు.. వైకాపాకైతే ఒప్పు...: ఒంగోలు మండలం పెల్లూరు సర్వే నంబరు 68/1 నుంచి 9 వరకు మొత్తం 12.2 ఎకరాల భూమి ఉంది. జల వనరుల శాఖ కార్యాలయాలు, ఉద్యోగుల క్వార్టర్స్‌ కోసం ఈ భూములు కేటాయించారు. 2016లో ఎన్నెస్పీ కాలనీలోని సర్వే నంబరు 68/8లో 1.96 ఎకరాలు ఇరిగేషన్‌ నుంచి రెవెన్యూకు మార్పు చేసి తెదేపా కార్యాలయం నిర్మాణానికి కేటాయించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రద్దు చేయడంతో తెదేపా కోర్టును ఆశ్రయించింది. అనంతరం తెదేపాకు కేటాయించిన స్థలం పక్కన సర్వే నంబరు 68/9లో 1.64 సెంట్లను వైకాపా కార్యాలయం కోసం భూమి కేటాయిస్తూ 2022 మే 18న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. జీవో నంబరు 340 ప్రకారం ఎకరాకు ఏడాదికి రూ.1,000తో 33 ఏళ్లకు స్థలాన్ని లీజుకు కట్టబెట్టారు. ఆ స్థలంలో నిర్మాణాలకు 2023 మార్చి 6న దరఖాస్తు చేసుకోగా.. ఒంగోలు కార్పొరేషన్‌ నుంచి 2023 జులై 21న అనుమతులు లభించాయి.

ఒక్క వాయిదా చెల్లింపుతోనే సరి...

అప్పనంగా దండుకున్న స్థలంలో పార్టీ కార్యాలయ నిర్మాణం చేపట్టారు. ఎన్నికలకు ముందే తొంభై శాతం పనులు పూర్తి చేసి అనధికారికంగా ప్రారంభించేశారు. ఈ స్థలాన్ని మొత్తం ముప్ఫై మూడు సంవత్సరాలు లీజు ప్రాతిపదికన ఎన్నెస్పీ నుంచి తీసుకున్నారు. నిర్మాణానికి సంబంధించి నిబంధనలు పాటించకుండా కార్పొరేషన్‌ ఆదాయానికి గండి కొట్టారు. ఖాళీ స్థలంలో నిర్మాణం చేయాలంటే వేకెంట్‌ ల్యాండ్‌ టాక్స్‌ ప్రతి అయిదు నెలలకు ఒక వాయిదా చొప్పున గడిచిపోయిన నెలలకు ఆరు వాయిదాలు చెల్లించాలి. అధికార పార్టీ వారు కేవలం ఒక్క వాయిదా అంటే రూ.3,49,700 చెల్లించారు. నిర్మాణం తర్వాత నాలుగు వాయిదాలు బకాయిలున్నాయి. అయినా ఒక్క వాయిదాతోనే సరిపెట్టారు. కుళాయి కనెక్షన్‌ నిర్మాణం పూర్తయ్యాక ఇస్తారు. అలాంటిది అధికారులు అత్యుత్సాహం చూపి నిర్మాణ దశలోనే ఇక్కడ ఇచ్చేశారు. పార్టీ కార్యాలయం వాణిజ్య కేటగిరీలోకి వస్తుంది. రెసిడెన్షియల్‌ కేటగిరీ కింద రిజస్ట్రేషన్‌ చేశారు. అదే వాణిజ్య కేటగిరీలో బుక్‌ చేస్తే నెలకు సుమారు రూ.1,500 నీటి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. గృహ అవసరం అయితే నెలకు రూ.60 చెల్లిస్తే సరిపోతుంది. ఈ విధంగా నాటి అధికార పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావించి అడ్డగోలుగా వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని