logo

మోముల్లో నవ్వులు

ఏటికేడు పెరుగుతున్న పెట్టుబడులు రైతులకు భారంగా మారుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం 14 రకాల పంట ఉత్పత్తులకు మద్దతు ధర పెంచింది.

Updated : 25 Jun 2024 05:26 IST

పంటలకు మద్దతు ధర పెంపు
సాగు వ్యయం పెరిగిన వేళ రైతుకు వెసులుబాటు

2024-25 ఖరీఫ్‌లో మద్దతు ధరలు ఇలా (క్వింటాల్‌కు రూ.)...

ఏటికేడు పెరుగుతున్న పెట్టుబడులు రైతులకు భారంగా మారుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం 14 రకాల పంట ఉత్పత్తులకు మద్దతు ధర పెంచింది. దీంతో కర్షకులకు కొంత ఉపశమనం లభించినట్లవుతుంది. జిల్లాలో 4.95 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు  సాగు చేస్తున్నారు. అందులో వరి, పత్తి, మొక్కజొన్న, పెసర, మినుము, కంది, పొద్దుతిరుగుడు, సజ్జ తదితర పంటలు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు.

న్యూస్‌టుడే, త్రిపురాంతకం గ్రామీణం

వరికి ఇక సిరి...

జిల్లాలోని సాగర్‌ ఆయకట్టులో 2,54,992 ఎకరాల మాగాణి ఉండగా 2022లో 35,715 ఎకరాల్లో వరి సాగైంది. గతేడాది సాగర్‌ జలాలు విడుదల కానందున బోరు బావుల కింద 6.832 ఎకరాల్లో మాత్రమే పండించారు. ఎకరాకు సగటున 1,900 కిలోల దిగుబడి లభిస్తుంది. తాజాగా పెరిగిన క్వింటాకు రూ.117 అదనపు ధర లభించడం వల్ల జిల్లాలో రైతులకు రూ.95 కోట్లు అదనంగా సమకూరనుంది.

మొక్కజొన్నకు మేలు..

జిల్లాలో మొక్కజొన్న 20,806 ఎకరాల్లో సాగు చేశారు. క్వింటాకు రూ.135 పెంచడంతో ఈ ఏడాది సాగైన పంటతో అన్నదాతలకు ఎకరాకు రూ.3,750 అదనంగా ప్రయోజనం చేకూరనుంది. మార్క్‌ఫెడ్‌ ద్వారా మొక్కజొన్న పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి తక్షణమే చెల్లింపులు చేస్తే దళారుల బెదడ తప్పి రైతులకు మేలు చేకూరుతుంది.

పత్తికి చేయూత...

జిల్లాలో ఖరీఫ్‌లో పత్తి 28,956 ఎకరాల్లో  సాగవుతోంది. రెండేళ్ల నుంచి తెగుళ్ల దాడితో దిగుబడులు పూర్తిగా పడిపోవడంతో పెట్టుబడులు కూడా దక్కడం లేదు. దీంతో నెమ్మదిగా పత్తి సాగుకు రైతులు దూరం అవుతున్నారు. క్వింటాకు రూ.501 పెంచడంతో పత్తి రైతుకు కొంత ఊరట లభించినట్లయింది. ఎకరాకు పది క్వింటాళ్ల చొప్పున సరాసరి దిగుబడికి గాను రూ.5 వేలకు పైగా దక్కడం ద్వారా రైతులకు ఉపశమనం దక్కుతుంది.

అపరాలకు అదనం...

ఖరీఫ్‌లో వరి సాగుకు ముందు వరి సాగు తర్వాత పెసర, మినుము సాగు చేస్తుంటారు. జిల్లాలో ఖరీఫ్‌లో 22 వేల ఎకరాల్లో పెసర సాగు చేపడుతుంటారు. ఎకరాకు సరాసరిన అయిదు క్వింటాళ్ల చొప్పున లభించే దిగుబడికి గాను క్వింటాకు అదనంగా రూ.124 పెరిగింది. దీంతో క్వింటాకు రూ.620 చొప్పున 5 క్వింటాళ్లకు రూ.3,100 అదనంగా రైతుకు సమకూరనుంది. మొత్తంగా పరిశీలిస్తే అపరాల సాగు ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎక్కువ మంది రైతులు వరి సాగుకు వినియోగించుకుంటుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని