logo

my queen: ‘మై క్వీన్‌’ విష కౌగిలి.. అడుగడుగునా బాధితులే..

కష్టపడకుండా కాసులు కళ్లజూడొచ్చంటూ కేటుగాళ్లు విసిరిన వలతో అమాయకులు సర్వం కోల్పోయారు.

Updated : 02 Jul 2024 07:59 IST

న్యూస్‌టుడే, మార్కాపురం, అర్థవీడు: కష్టపడకుండా కాసులు కళ్లజూడొచ్చంటూ కేటుగాళ్లు విసిరిన వలతో అమాయకులు సర్వం కోల్పోయారు. మై క్వీన్‌ యాప్‌ విష కౌగిలిలో చిక్కి కేవలం అర్థవీడు చుట్టుపక్కల వారు రూ.లక్షల్లో నష్టపోయారని అంచనా వేస్తుండగా..ఇప్పుడు మార్కాపురంలో అంతకు పదిరెట్లు దోచుకున్నారన్న విషయం బయటకు పొక్కడం కలకలం రేపుతోంది.

బాధితులు ఉపయోగించిన మై క్వీన్‌ యాప్‌

మార్కాపురం ప్రాంతంలో మై క్వీన్‌ యాప్‌ లింక్‌ను పంపి కేవలం పది రోజుల్లోనే దాదాపు రూ.పది కోట్లు దోచేశారు. హైదరాబాద్, చెన్నై కేంద్రంగా నడుస్తున్న ఈ యాప్‌ లింక్‌ను ఇక్కడి వారికి వాట్సాప్‌ ద్వారా పంపారు. అందులోకి చరవాణి నెంబర్‌ ద్వారా లాగిన్‌ అయితే వివరాలు కన్పించడంతో తమ వద్ద ఉన్న నగదు మొత్తం డిపాజిట్‌ చేసి మోసపోయామని బాధితులు వాపోతున్నారు. కేవలం ఒక్క రూపాయి పెట్టుబడి పెడితే ఏడు రెట్లు అందిస్తామంటూ నిర్వాహకులు వారిని రొచ్చులోకి దింపారు.  మొదట్లో రూ.750, రూ.860, రూ.1250, రూ.1650, రూ.2500 వంటి చిన్న మొత్తాలను చెల్లించి వారికి నమ్మకం కుదిరేలా చేశారు. డిపాజిట్‌ చేసిన నగదుకు ఆరేడు రెట్లు చెల్లిస్తుండటంతో స్థానికులు ఎగబడి రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టగా..ఆ తర్వాత మై క్వీన్‌ నిర్వాహకులు పత్తాలేకుండాపోయారు.

ముందుకు రాని పోలీసులు

  • మార్కాపురంలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు మై క్వీన్‌ యాప్‌లో డబ్బులు జమచేసి నష్టపోయినట్లు సమాచారం. ఒకరి నుంచి మరొకరిని చైన్‌ లింకు ద్వారా ఈ యాప్‌ పరిచయం చేశారు. దీంతో ఖర్చుల కోసం తెచ్చుకున్న, దాచుకున్న నగదును యాప్‌లో పెట్టి వారు నిండా మునిగారు. ఇలా ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు దోచుకున్నారు.
  • కంభంలోని ఓ బంగారు దుకాణ వ్యాపారి రూ.లక్షల్లో నగదు జమచేయగా, ఆ తర్వాత నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. ః అర్థవీడు మండలంలోని ఓ గిరిజన తండాలో మైక్వీన్‌ యాప్‌ ద్వారా ఒకే రోజు 30 కుటుంబాల వారు ఒక్కొక్కరు రూ.లక్ష చొప్పున పెట్టి రోడ్డున పడ్డారు.

మై క్వీన్‌ ద్వారా నష్టపోయామంటూ బాధితులెవరూ ముందుకు రాలేదని పశ్చిమ ప్రాంతంలోని దాదాపు దాదాపు 15 మండలాల్లోని పోలీసులు చెబుతున్నారు. ఒక్కరైనా   నష్టపోయినట్లు తమను సంప్రదిస్తే కేసు నమోదు చేస్తామని వారంటున్నారు తప్ప దీనిపై పూర్తిస్థాయి విచారణ మాత్రం చేపట్టడం లేదు. కనీసం సుమోటోగా అయినా కేసు నమోదు చేయాలని బాధితులు కోరుతున్నారు. ఇలా నిర్లిప్తంగా ఉండటం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని