logo

Rammohan Naidu: భోగాపురం ఇక ‘భాగ్యరేఖ’.. రామ్మోహన్‌నాయుడు ప్రత్యేక దృష్టి

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు జెట్‌ స్పీడ్‌తో పూర్తి చేయిస్తా. పక్కా ప్రణాళికతో నిర్ణీత గడువులోగా ప్రారంభోత్సవానికి కృషి చేస్తా.

Updated : 12 Jun 2024 07:26 IST

 ఉత్తరాంధ్ర ప్రజల్లో కొత్త ఆశలు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు జెట్‌ స్పీడ్‌తో పూర్తి చేయిస్తా. పక్కా ప్రణాళికతో నిర్ణీత గడువులోగా ప్రారంభోత్సవానికి కృషి చేస్తా. రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ శాఖ చేపట్టిన అప్పటి మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, అశోక్‌గజపతిరాజు వంటి సీనియర్లతో చర్చిస్తా. భోగాపురం సహా రాష్ట్రంలోని ఇతర విమానాశ్రయాల అభివృద్ధిలో నా మార్కు ఉండేలా చిత్తశుద్ధితో పనిచేస్తా.

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కింజరాపు రామ్మోహన్‌నాయుడు

ఈనాడు-విజయనగరం, న్యూస్‌టుడే, భోగాపురం: భోగాపురం విమానాశ్రయం పనులు ఇక విమానం కన్నా వేగంగా పరుగులు తీయనున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత విమానాశ్రయానికి అవసరమైన 2700 ఎకరాల సేకరణకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఉత్తరాంధ్ర ప్రగతికి మణిహారంగా ఉండేలా ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. 2019 ఫిబ్రవరి 14న శంకుస్థాపన చేశారు.

మౌలిక వసతులు కరవు

ఏడాది క్రితం విమానాశ్రయం నిర్మాణానికి శంకుస్థాపన జరిగినా మౌలిక వసతులు లేక, పూర్తిగా భూములు అప్పగించక సుమారు ఆరు నెలల పనుల్లో ఎలాంటి కదలిక కనిపించలేదు. ప్రస్తుతం 3.8 కి.మీ. పొడవు గల  రన్‌వే పనులు 10 శాతం అయ్యాయి. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రామ్మోహన్‌నాయుడు విమానాశ్రయ పనులపై దిల్లీలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలించి జీఎంఆర్‌ సంస్థకు అన్ని విధాలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరంగా సహకరించాలని నిర్ణయించారు.

ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌

గత ఎన్నికల్లో అధికారం చేపట్టిన వైకాపా నాలుగేళ్ల పాటు అటువైపు చూడలేదు. ఎన్నికలు ఏడాది ఉండగా గతేడాది మే 3న అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారు. ఇది పూర్తయితే ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు, వేలాది మందికి ఉపాధి దొరుకుతుందన్న ఈ ప్రాంత ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు.

చంద్రబాబు ప్రత్యేక దృష్టి

శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో అందరిలో కొత్త ఆశలు చిగురించాయి. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం, విజన్‌ గల చంద్రబాబు దృష్టి పెట్టడంతో వేగంగా పూర్తి కానుంది.  తెదేపా హయాంలో 2,700 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించాలని నిర్ణయించగా, వైకాపా ప్రభుత్వం అందులో 500 ఎకరాలను పక్కన పెట్టింది.

సాగుతున్న విమానాశ్రయ పనులు

ఇకపై ముమ్మరం

సుమారు రూ.5 వేల కోట్ల వ్యయంతో జీఎంఆర్‌ సంస్థ అభివృద్ధి పనులు చేపట్టింది. ప్రభుత్వం కేటాయించిన 2200 ఎకరాల్లోనే రన్‌వేతో పాటు, టెర్మినల్, సిగ్నలింగ్‌ పాయింట్, కార్గో విభాగాల భవనాల పనులు ప్రారంభించింది. ఈ పనులు ప్రస్తుతం సాగుతున్నాయి. 2025 డిసెంబరు నాటికి దీన్ని పూర్తి చేయాలని జీఎంఆర్‌ సంస్థ సంకల్పించింది. దీనికి ఎదురైన అడ్డంకులు తొలగించి, మౌలిక వసతుల పరంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే గడువుకు రెండు, మూడు నెలల ముందే పూర్తవుతుందని జీఎంఆర్‌ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

ఏటా 60 లక్షల మంది విమానయానం చేసే సామర్థ్యంతో తొలిదశ పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు కొనసాగిస్తున్నారు.ప్రభుత్వాల చొరవతో మరిన్ని సౌకర్యాలు సమకూరనున్నాయి.

టెర్మినల్‌ నిర్మాణం 

ముందుకెళ్లని ట్రంపెట్‌ 

విశాఖ - శ్రీకాకుళం మార్గంలో జాతీయ రహదారిపై ట్రంపెట్‌ ఆకారంలో పై వంతెన నిర్మాణానికి తెదేపా హయాంలోనే స్థల సేకరణ చేపట్టారు. ఈ పనులు ఇప్పటికీ
ముందుకెళ్లలేదు. ఇది పూర్తయితే గానీ టెర్మినల్‌కు వెళ్లే మార్గం ఉండదు. ఇప్పుడు పనులు వేగవంతమయ్యేలా దృష్టి సారించనున్నారు. విమానాశ్రయానికి సంబంధించి ప్రత్యేక విద్యుత్తు సబ్‌స్టేషన్‌ నిర్మాణంలో పురోగతి లేదు. దీని కోసం ముక్కాం గ్రామ సమీపంలో సుమారు ఆరు ఎకరాల స్థలం కేటాయించారు. దీనిపై త్వరలో సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. విమానాశ్రయంలో వివిధ హోదాల్లో పనిచేసే ఉద్యోగులకు, సిబ్బందికి ప్రత్యేకంగా నివాస గృహ సముదాయాల నిర్మాణానికి తూడెం గ్రామ రెవెన్యూ పరిధిలో 25 ఎకరాల భూమి కేటాయించారు. ఇందులో సుమారు 20 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. వీటి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. తారకరామ తీర్థసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి విమానాశ్రయానికి నీటి సరఫరా పనులకు రూ.198 కోట్లతో శంకుస్థాపన జరిగి ఏడాది గడిచినా ఏ మాత్రం కదలిక లేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని