logo

ధైర్యంగా వెళ్లొచ్చు.. ఇసుక తెచ్చుకోవచ్చు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే మరో ఎన్నికల హామీని నిలబెట్టుకుంది.

Published : 05 Jul 2024 02:51 IST

ప్రభుత్వ నిర్ణయంపై  ఆనందం

ఈమె పేరు టేకుమల్లి విజయలక్ష్మి. చీపురుపల్లి మండలం ముల్లుపేట. గత ప్రభుత్వ హయాంలో ఇల్లు మంజూరైంది. సొంత స్థలంలో కేంద్ర ప్రభుత్వ సాయం రూ.1.80 లక్షలతో నిర్మాణం చేపట్టారు. ఇసుక అందుబాటులో లేక సుమారు రూ.30 వేలు వెచ్చించి దళారుల వద్ద కొనుగోలు చేశారు. ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకొస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించడంతో మిగిలిన పనులు పూర్తి చేస్తానంటూ ఆనందంగా చెబుతున్నారు.

‘మేం అధికారంలోకి వస్తే.. ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెస్తాం. ఉపాధి లేక నష్టపోయిన భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటాం. వారి ఆకలి తీర్చేలా ఊతమందిస్తాం. ఎవరూ అధైర్యపడొద్దు.. వైకాపా ప్రభుత్వం ఇసుక పాలసీతో అన్ని వర్గాలను కుదేలు చేసింది.’

మే నెలలో చీపురుపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు

చీపురుపల్లి మండలం నాగంపేట వద్ద నిల్వ కేంద్రం

ఈనాడు- విజయనగరం - న్యూస్‌టుడే, చీపురుపల్లి గ్రామీణం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే మరో ఎన్నికల హామీని నిలబెట్టుకుంది. ఉచిత ఇసుక విధానాన్ని ఈ నెల 8 నుంచి అమలు చేయనుంది. దీని వల్ల విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని భవన నిర్మాణ కార్మికులకు చేతినిండా పని, గృహ నిర్మాణ లబ్ధిదారులకు సొంతింటి కల నెరవేరనుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైకాపా అయిదేళ్ల పాలనలో ఇసుక కోసం అన్ని వర్గాల ప్రజలూ తీవ్ర అవస్థలు పడ్డారు. భవన నిర్మాణ రంగం కుదేలైంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందజేస్తామని చెప్పినప్పటికీ అది ప్రకటనలకే పరిమితమైంది.

పడకేసిన నిర్మాణ రంగం..

గత ప్రభుత్వం అమలు చేసిన ఇసుక విధానంతో గృహ నిర్మాణ రంగం పడకేసింది. విజయనగరం, మన్యం జిల్లాల్లో సుమారు 1.05 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టగా ఇప్పటి వరకు 55 శాతం గృహాల పనులు మాత్రమే పూర్తయ్యాయి. లబ్ధిదారులకు ఉచితంగా సరఫరా చేస్తామని ప్రకటించినా ఇవ్వలేకపోయారు. దీంతో ట్రాక్టరు లోడు రూ.5 వేల నుంచి రూ.6 వేలు పెట్టి కొన్నారు. కొత్త విధానంతో ఈ రంగానికి ఊపిరిలూదినట్లయింది.

ఫోన్‌పే ద్వారా చెల్లింపు..

వినియోగదారులు రవాణా ఛార్జీలు చెల్లించి తీసుకెళ్లే వెసులుబాటు కల్పించారు. ఫోన్‌పే ద్వారా నగదు కట్టి.. ఆ వివరాలు చూపిస్తే సరఫరా చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై విజయనగరం కలెక్టర్‌ అంబేడ్కర్, గనుల శాఖాధికారి సూర్యచంద్ర చర్చించినట్లు తెలిసింది.  ప్రభుత్వ మార్గదర్శకాలు రావాల్సి ఉందని ఉభయ జిల్లా గనుల శాఖ సహాయ సంచాలకులు సూర్యచంద్రరావు, శ్రీనివాసరావు ‘ఈనాడు’కు తెలిపారు.

నిల్వ కేంద్రాల నుంచి..

కొత్త విధానంలో భాగంగా తొలుత నిల్వ కేంద్రాల ద్వారా మూడు నెలల పాటు ఉచితంగా సరఫరా చేయనున్నారు. రాజాం, చీపురుపల్లి, బొబ్బిలి, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం, ఎస్‌.కోట, పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరులో ఇసుక డిపోలున్నాయి. ముందుగా రీచ్‌ నుంచి నిల్వ కేంద్రానికి తరలిస్తారు. ఈమేరకు రవాణా ఖర్చుల కింద వసూలు చేసిన రూ.88 స్థానిక సంస్థలకే దక్కనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని