logo

నాడు గొప్పలు.. నేడు తిప్పలు

నాడు- నేడు పథకం ద్వారా బడుల రూపురేఖలు మారుస్తామని గొప్పలు చెప్పిన గత ప్రభుత్వం.. విద్యార్థులకు కష్టాలనే మిగిల్చింది. పాఠశాలల్లో అరకొర పనులతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Published : 05 Jul 2024 02:45 IST

భోగాపురం మండలం ముక్కాం ఉన్నత పాఠశాలలో భవనాల నిర్మాణానికి రూ.48 లక్షలు మంజూరవగా రూ.15 లక్షలతో ఆరు గదులు చేపట్టారు. సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో పిల్లర్ల స్థాయిలో నిలిచిపోయాయి. దీంతో సదుపాయాలు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. కొన్నిసార్లు చెట్ల నీడలో బోధన సాగుతోంది. పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని ప్రధానోపాధ్యాయుడు నర్సింగరావు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

న్యూస్‌టుడే, భోగాపురం

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: నాడు- నేడు పథకం ద్వారా బడుల రూపురేఖలు మారుస్తామని గొప్పలు చెప్పిన గత ప్రభుత్వం.. విద్యార్థులకు కష్టాలనే మిగిల్చింది. పాఠశాలల్లో అరకొర పనులతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2019-20 విద్యా సంవత్సరంలో ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. మూడు విడతల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని లక్ష్యం విధించారు. అయితే ఉమ్మడి జిల్లాకు సంబంధించి నిధుల్లేక తీవ్ర జాప్యం జరిగింది. గత అయిదేళ్లలో 40 శాతం పాఠశాలల్లోనే పనులు జరిగాయి. ఒక విడత ప్రక్రియ పూర్తికాగా.. రెండో విడతలో సిమెంటు, ఇసుక లేక నిలిచిపోయాయి.

అసంపూర్తిగానే..

రెండోవిడత పనులు నిధుల కొరతతో అసంపూర్తిగా ఉండిపోయాయి. గతేడాది ఏప్రిల్‌ నెలలో కొంతమేర విడుదలైనా సిమెంటు, ఇసుక తదితర నిర్మాణ సామగ్రి అందుబాటులో లేకపోవడంతో ముందుకు సాగలేదు. జనవరి తర్వాత 480 టన్నుల సిమెంటు రావడంతో 14 మండలాల్లో పునఃప్రారంభించారు. ప్రస్తుతం అక్కడా నిలిచిపోయాయి. రెండు జిల్లాల్లో 6,479 పనులు చేపట్టేందుకు రూ.376.20 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఇప్పటివరకు రూ.196.95 కోట్లు విడుదల కాగా, రూ.203.20 కోట్లు ఖర్చు చేసినట్లు గణాంకాలు బట్టి తెలుస్తోంది. ఈమేరకు అదనపు బిల్లులు విడుదల కావాల్సి ఉంది.

తొలివిడత నామమాత్రమే..

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 3,386 పాఠశాలలున్నాయి. తొలివిడతలో 1,327 విద్యాలయాల్లో పనులు ప్రారంభించారు. దాదాపు అన్నిచోట్లా మొదలు పెట్టారు. అయితే ప్రహరీలు, వంటగదులు, అదనపు తరగతి గదులకు ఇందులో అవకాశం కల్పించలేదు. 15- 20 శాతం బడులకు డ్యూయల్‌ డెస్కులు సైతం రాలేదు. మిగతా చిన్నపాటి మరమ్మతులు చేపట్టారు. ప్రధానమైన పనులు జరగకపోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్ప లేదు. రెండోవిడత కింద 2021-22లో 1359 విద్యాలయాలను ఎంపిక చేశారు. ఇందులో జూనియర్‌ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను చేర్చారు. అదనపు తరగతి గదుల నిర్మాణానికి అవకాశం ఇచ్చారు. అయితే 83 చోట్ల ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. మిగిలిన ప్రాంతాల్లో ప్రగతిలో ఉన్నట్లు పేర్కొంటున్నారు. గత విద్యా సంవత్సరంలో చాలాచోట్ల ప్రవేశాలు తగ్గుముఖం పట్టడంతో కొన్ని గదులను రద్దు చేశారు. ప్రహరీల పనులను చివరి సమయంలో నిలిపివేశారు.


నెల్లిమర్ల మండలంలోని సతివాడ గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలలో అదనపు భవనాల నిర్మాణాల కోసం రెండో విడతలో నిధులు మంజూరు చేశారు. రెండేళ్లయినా పూర్తిస్థాయిలో విడుదల రాకపోవడంతో పనులు మధ్యలో నిలిచిపోయాయి. అరకొర వసతులతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పైఅంతస్తులో ఇలా మొండిగోడలే దర్శనమిస్తున్నాయి.

న్యూస్‌టుడే, నెల్లిమర్ల


తెర్లాం మండలంలోని లోచర్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో 84 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలకు రెండో విడతలో రూ.1.22 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇంత వరకు కేవలం రూ.72 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. ఇక్కడ అదనపు గదులు నిర్మించాల్సి ఉంది. కొన్ని గదులు స్లాబ్‌ దశ వరకు పూర్తయ్యాయి. ఈ మండలంలో మొత్తం 26 పనులను రూ.8.48 కోట్లతో తలపెట్టగా రూ.3.63 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

న్యూస్‌టుడే, తెర్లాం


ఎస్‌.కోట మండలం ఆలుగుబిల్లి గ్రామంలోని పాఠశాల శిథిలావస్థకు చేరడంతో కొత్త భవనం నిర్మాణానికి రూ.24.54 లక్షలు మంజూరయ్యాయి. దీంతో పాత భవనాలు తొలగించారు. పూర్తిస్థాయిలో నిధులు రాక పనులు పూర్తికాలేదు. దీంతో విద్యార్థులకు పాత పంచాయతీ భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారు. అక్కడ కనీస సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారు. త్వరలో పనులు పూర్తిచేస్తామని ఎంఈవో-2 గణపతి లక్ష్మి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

న్యూస్‌టుడే, శృంగవరపుకోట


సీతంపేట మండలం కిరప ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి అయిదో తరగతి వరకు 54 మంది విద్యార్థులున్నారు. వీరందరికీ ఒకే గది అందుబాటులో ఉంది. దీంతో కొందరికి బయట, మరికొందరికి వరండాలో బోధన సాగుతోంది. ఈ విద్యాలయం తొలి విడతలో ఎంపికైనా విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం ఇలా అటు, ఇటు కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. 

న్యూస్‌టుడే, సీతంపేట


బలిజిపేట మండలంలోని నారాయణపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో 162 మంది చదువుతున్నారు. వీరందరికీ మూడు గదుల్లోనే బోధన సాగిస్తున్నారు. రెండో విడతలో అదనపు భవనాలకు రూ.70 లక్షలు మంజూరైనా పూర్తి స్థాయిలో నిధులు రాలేదు. దీంతో నిర్మాణాలు సగంలోనే నిలిచిపోవడంతో చిన్నారులకు అవస్థలు తప్పడం లేదు. 

న్యూస్‌టుడే, బలిజిపేట


సాలూరు పట్టణంలోని మూడో వార్డులో ఉన్న గుమడాం పాఠశాల భవనమిది. నాడు నేడులో భాగంగా రూ.42 లక్షలు మంజూరు చేశారు. రెండేళ్లలో కేవలం రూ.10 లక్షలు మాత్రమే విడుదల కావడంతో భవనం పూర్తి చేయలేకపోయారు. దీంతో ఇక్కడ నుంచి విద్యార్థులను ఎస్సీ కాలనీలోని విద్యాలయానికి తరలించారు. అక్కడ ఒకే గది ఉండటంతో 5 తరగతుల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పురపాలికలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయలేదు.

న్యూస్‌టుడే, సాలూరు


గుమ్మలక్ష్మీపురం మండలం తోలుఖర్జ పాఠశాలలో 12 మంది చదువుతున్నారు. ఇక్కడ పాఠశాల భవనం లేక రేకుల షెడ్డులో బోధిస్తున్నారు. నాడు- నేడులో భవన నిర్మాణానికి సుమారు రూ.25 లక్షలు మంజూరవగా పూర్తి స్థాయిలో విడుదల కాలేదు. దీంతో ఏడాదిగా భవనం అసంపూర్తిగా దర్శనమిస్తోంది. నిధులు వచ్చిన మేరకు పనులు చేసినట్లు ఏఈ అప్పారావు తెలిపారు. 

న్యూస్‌టుడే, గుమ్మలక్ష్మీపురం


అనుమతులు కోరాం..

ప్రస్తుతం సిమెంటు కొరత ఉంది. జిల్లాలోనే కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని అడిగాం. ఇసుక స్థానికంగా కొనుగోలు చేసుకోమని సంబంధిత అధికారులకు సూచించాం. నెల రోజులుగా పనులు నిలిచిపోయాయి. నిధుల సమస్య లేదు. అవసరం మేరకు, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఇతర పనులు చేపట్టాలని ఆదేశించాం.

ఎన్‌.ప్రేమకుమార్, జిల్లా విద్యాశాఖాధికారి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని