logo

జగనన్న.. భూభాగోతం

పేదలకు ఇళ్ల స్థలాల పేరిట గత  ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో భారీగా అవినీతి జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి.

Published : 05 Jul 2024 02:39 IST

లేని ధర సృష్టించి కొనుగోలు

పాలకొండ అర్బన్‌ లేఅవుట్‌

పేదలకు ఇళ్ల స్థలాల పేరిట గత  ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో భారీగా అవినీతి జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. భూమి ధరలు ఎక్కువగా సృష్టించి అధికారులు, నాయకులు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. కాలనీలు కాదు.. ఊర్లే నిర్మిస్తున్నామంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించిన హామీ అక్రమాలకు పుట్టగా మారింది. ఇటీవల పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మండలాల వారీగా నిర్వహిస్తున్న సమీక్షల్లో జగనన్న కాలనీల్లో జరిగిన అవినీతిని వెలుగులోకి తెచ్చారు.

న్యూస్‌టుడే, పాలకొండ/గ్రామీణం, వీరఘట్టం

అప్పట్లో ప్రభుత్వ అధికారుల మెడపై కత్తి పెట్టి జగనన్న కాలనీలకు భూసేకరణ చేయాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చారు. ఇదే అదనుగా నాయకులు దందాకు తెరలేపారు. ఎందుకూ పనికిరాని భూములను అధిక ధరలకు కొనుగోలు చేసి సొమ్ము చేసుకున్నారు. గ్రామాలకు, పట్టణాలకు దూరంగా సేకరించిన స్థలాలు నివాసయోగ్యంగా లేవు. దీంతో లబ్ధిదారులు నిర్మాణాలకు వెనుకంజ వేస్తున్నారు.

పాలకొండ నగర పంచాయతీ పరిధిలో రైతుల నుంచి 33.36 ఎకరాలను సేకరించారు. ఇందులో పట్టణ పరిధిలో 8.71 ఎకరాలు, లుంబూరు పంచాయతీ గరుగుబిల్లి గ్రామ పరిధిలో 24.65 ఎకరాలు తీసుకున్నారు. ఈమేరకు రూ.3.48 కోట్లు, రూ.8.62 కోట్లు చొప్పున చెల్లించారు. వాస్తవానికి ఆయా భూములకు నీటి సదుపాయం అందుబాటులో లేక అన్నదాతలు సాగుకు దూరంగా ఉంచారు. ఇక్కడ ఎకరా 2019లో గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు ఉండగా, అధికారులు మాత్రం రైతులకు రూ.40 లక్షల వరకు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.  

  • పాలకొండ మండలంలోని చినమంగళాపురంలో 65 సెంట్ల భూమికి రూ.5.36 లక్షలిచ్చారు.
  • సింగన్నవలస పంచాయతీ పరిధిలో రెండు చోట్ల 3.14 ఎకరాల డీపట్టా భూములను రూ.35.06 లక్షలకు తీసుకున్నారు. ఇవి కూడా గ్రామానికి దూరంగా నివాసయోగ్యంగా లేని కొండల సమీపంలో ఉన్నాయి. ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు.
  • వీరఘట్టం పరిధిలోని పేదలకు మండలంలోని అచ్చెపువలస వద్ద వ్యవసాయయోగ్యంగా లేని వాటిని ఎకరా రూ.15 లక్షలకు కొనుగోలు చేశారు. ఇక్కడ అయిదు ఎకరాల భూమిని తీసుకున్నారు. వాస్తవానికి ఇక్కడ ఆ స్థాయిలో ధరలు లేవని స్థానికుల మాట. కానీ అధికారులు, వైకాపా నాయకులు కలిసి లేని ధర సృష్టించి ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించారు.

మొగ్గు చూపని లబ్ధిదారులు

గ్రామాలకు దూరంగా జగనన్న లేఅవుట్లు ఏర్పాటు చేయడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావడం లేదు. పట్టణాలకు సరాసరి మూడు కి.మీ దూరంలో కాలనీలున్నాయి. దీంతో నిర్మాణాలు సైతం ముందుకు సాగని పరిస్థితి. ప్రభుత్వం నిర్మాణాలకు నిధులు ఇస్తున్నామని గొప్పలు చెప్పినా ప్రగతి కానరాలేదు.

సింగన్నవలస పంచాయతీ పరిధిలో కొనుగోలు చేసిన భూములు

రూ.80 లక్షలు వృథా..

లుంబూరు కాలనీలో 1,514 మంది లబ్ధిదారులకు పట్టాలిచ్చారు. నీటి సదుపాయం లేకపోవడంతో రెండేళ్ల కిందట నగర పంచాయతీ నిధుల నుంచి రూ.80 లక్షలు ఖర్చు చేశారు. స్థానికంగా ప్రవహిస్తున్న గెడ్డనుంచి ప్రత్యేక పైపులైను వేశారు. నీటికుండీలు నిర్మించారు. అయితే వేసవిలో గెడ్డ ఎండిపోతుండడంతో నీరందని పరిస్థితి. 288 ఇళ్లు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నా.. చాలా కుటుంబాలు నివాసం ఉండడం లేదు. వాస్తవానికి ఇక్కడ 300 అడుగులకు పైగా బోర్లు వేస్తేగానీ నీరు పడదు. గెడ్డ నీరు సైతం సక్రమంగా అందదు. అలాంటి చోట పట్టాలిచ్చారు. తక్కువ ధరకు భూములు దొరుకుతాయన్న కారణంగా ఇక్కడ ఎంపిక చేసి, పెద్దఎత్తున దోచుకున్నారు.

సమగ్ర విచారణ

కాలనీల్లో అవినీతి జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. తక్కువ ధరలకు లభించే భూములను అధిక మొత్తాలకు కొనుగోలు చేశారు. దీంతో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేందుకు, నివాసం ఉండేందుకు ఆమోదయోగ్యంగా లేవు. దీనిపై సమగ్ర విచారణ చేపడతాం. వాస్తవాలు ప్రజల ముందు ఉంచుతాం.

జయకృష్ణ, ఎమ్మెల్యే, పాలకొండ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని