logo

సొసైటీలనూ ముంచేశారు

గత ప్రభుత్వ హయాంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్‌) నిస్తేజంగా మారాయి. కనీస నిధులు ఇవ్వకపోవడం, బకాయిల చెల్లింపుల్లో జాప్యం తదితర కారణాలతో రైతులకు సేవలు అందలేదు.

Published : 05 Jul 2024 02:35 IST

అయిదేళ్లలో రూ.36 కోట్లకు పైనే బకాయిలు 
ధాన్యం కొనుగోళ్లపై నిలిచిన చెల్లింపులు

కమీషన్‌ నిధులు ఇవ్వాలని జిల్లా అధికారికి వినతిపత్రం ఇస్తున్న సొసైటీ సభ్యులు(పాతచిత్రం)

గత ప్రభుత్వ హయాంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్‌) నిస్తేజంగా మారాయి. కనీస నిధులు ఇవ్వకపోవడం, బకాయిల చెల్లింపుల్లో జాప్యం తదితర కారణాలతో రైతులకు సేవలు అందలేదు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి 2019- 20 ఆర్థిక ఏడాది నుంచి ఇప్పటి  వరకు ఏకంగా రూ.36.64 కోట్ల మేర కమిషన్‌ చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో సంఘాల్లో ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నాయి.

న్యూస్‌టుడే, విజయనగరం అర్బన్‌

హమాలీ ఛార్జీలకూ డబ్బుల్లేవ్‌..

ఉమ్మడి జిల్లాలో 105 సొసైటీలు(విజయనగరం- 64, పార్వతీపురం మన్యం- 41) ఉన్నాయి. రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో ఇవి కీలకంగా వ్యవహరిస్తాయి. ఆర్‌బీకేల్లో (రైతు సేవా కేంద్రాలుగా ఇటీవల పేరు మార్చారు) సిబ్బందిని నియమించి కొనుగోలు చేసేందుకు ఒక టన్నుకు రూ.312.50 చొప్పున పౌర సరఫరాల సంస్థ చెల్లించాలి. ఇలా వచ్చిన మొత్తంతోనే హమాలీ ఛార్జీలు, యంత్ర పరికరాల కొనుగోలు, టెక్నికల్‌ సహాయకులు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, సహాయకులకు జీతాలు.. తదితర వాటికి ఖర్చు చేయాలి. అయితే గత ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో హమాలీ ఛార్జీలు ఇవ్వలేదు. సిబ్బంది జీతాలకు సైతం ఇబ్బందులు తలెత్తినట్లు కొన్ని సొసైటీలు పలుమార్లు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి.

ఇదీ పరిస్థితి..

2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో ఉమ్మడి జిల్లాకు రూ.20.46 కోట్ల కమీషన్‌ అందాలి. బీ జిల్లాల పునర్విభజన తర్వాత 2022- 23, 2023- 24 ఏడాదిల్లో ఉభయ జిల్లాలకు రూ.16.18 కోట్ల వరకు బకాయిలుఅందాలి బీ 2022-23లో రెండు జిల్లాల్లో 5.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అందులో భాగంగా రూ.10.50 కోట్లు రావాలి. కానీ రూ.2.50 కోట్ల చెల్లింపులు మాత్రమే జరిగాయి బీ 2023-24లో విజయనగరంలో 3.40 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. రూ.1.32 కోట్లు మాత్రమే జమైనట్లు జిల్లా సహకార అధికారి రమేష్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని