logo

కొట్టుకుపోయిన కాలువ గట్టు

తోటపల్లి కుడి ప్రధాన కాలువకు అల్లు పాల్తేరు వద్ద పడిన గండి పరిమాణం రోజురోజుకూ పెరుగుతోంది.

Published : 05 Jul 2024 02:33 IST

పెరుగుతున్న గండి పరిమాణం

రింగుబండ్‌ వేసినా ఆగని నీరు

న్యూస్‌టుడే, బొబ్బిలి, బాడంగి: తోటపల్లి కుడి ప్రధాన కాలువకు అల్లు పాల్తేరు వద్ద పడిన గండి పరిమాణం రోజురోజుకూ పెరుగుతోంది. కాలువలో వరద ప్రవాహం తగ్గకపోవడంతో గట్టు కోతకు గురై, పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ నీరంతా సమీపంలో ఉన్న వేగావతి నదిలోకి పారుతోంది. అక్విడక్టు ముందు గండి పడడంతో నీరంతా నదిలోకి వెళ్లిపోతోంది. గట్టుకు ఇరువైపులా పెళ్లలు విరిగిపడుతున్నాయి. కాలువకు 37.889 కి.మీ వద్ద ఈ పరిస్థితి ఏర్పడడంతో ఎగువ నుంచి ప్రవాహం దిగువకు పోటెత్తుతోంది. ఆ ప్రవాహం తగ్గడానికి కనీసం రెండు రోజులైనా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాత్కాలికంగా చుట్టూ ఇసుక బస్తాలతో రింగ్‌బండ్‌ వేసినా.. ఆగడం లేదు. మట్టి, కంకరను బయట నుంచి తెచ్చి వేయాలి. రెండు రోజులుగా కూలీలతో కేవలం రింగ్‌బండ్‌ మాత్రమే వేశారు. ఆ ప్రాంతం వైపు వాహనాలు వెళ్లకుండా అధికారులు రాకపోకలను నియంత్రించారు.

కుడి కాలువ పరిధిలో సుమారు 120 కి.మీ తవ్వకానికి 2012లో గుత్తేదారు పనులు దక్కించుకుని, 2015 నాటికి పూర్తి చేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు నిర్వహణ లేదు. జలవనరులశాఖ అధికారులు ప్రత్యేక నిధులను రప్పించి పనులు చేపట్టాలి. అయితే ఇంకా అంచనాల తయారీలోనే ఉన్నారు. ఎంత ఖర్చవుతుంది? ఎక్కడ నుంచి నిధులు సమకూర్చుకోవాలో తెలియక కలెక్టర్‌కు దస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందిస్తే తప్ప పనులు చేపట్టేందుకు అవకాశం లేదు.

కలెక్టర్‌కు నివేదిక

కాలువకు పడిన గండిని పూడ్చేందుకు ఎంత నిధులు అవసరమో అంచనాలు తయారు చేస్తున్నాం. వీటిని కలెక్టర్‌ అంబేడ్కర్‌కు నివేదిస్తాం. నిధులు మంజూరయ్యాక పనులు ప్రారంభిస్తాం. తాత్కాలికంగా లైనింగ్‌ పాడవకుండా గొయ్యి చుట్టూ ఇసుక బస్తాలను వేశాం.

కుమార్, తోటపల్లి డీఈ  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని