logo

అతిసారం.. అప్రమత్తత అవసరం

వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్లో అతిసారం ఒకటి. దీన్ని డయేరియా అని కూడా అంటారు. పిల్లల్లో మరణాలకు ఇది ప్రధాన కారణం.

Published : 05 Jul 2024 02:16 IST

గుమ్మలక్ష్మీపురం : తాడికొండలో అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే జగదీశ్వరి

వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్లో అతిసారం ఒకటి. దీన్ని డయేరియా అని కూడా అంటారు. పిల్లల్లో మరణాలకు ఇది ప్రధాన కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మూడు లేక అంతకంటే ఎక్కువసార్లు విరేచనాలు వస్తే అతిసారంగా భావిస్తారు. అయిదేళ్ల లోపువారు దీని బారిన పడుతున్నారు. ఏటా ఈ వ్యాధి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 7 లక్షల మంది మరణిస్తున్నారని వైద్య వర్గాలు చెబుతున్నాయి.  ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది దాదాపు  1.7 బిలియన్ల కేసులు నమోదవుతున్నాయి. దేశంలోనూ ముప్పు పొంచి ఉంది. దీంతో యంత్రాంగం నివారణపై చర్యలకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్టాప్‌ డయేరియా కార్యక్రమాన్ని ప్రారంభించింది.

న్యూస్‌టుడే, విజయనగరం వైద్య విభాగం, పార్వతీపురం పట్టణం

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో తాగునీటి సౌకర్యం అంతంతే. దీంతో ఇప్పటికీ కొన్ని ఏజెన్సీ గ్రామాల్లో చెలమలను ఆశ్రయిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లాలో ఏటా 500లకు పైగా మాతృ, శిశు మరణాలు కేసులు నమోదవుతున్నాయి. పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, పౌష్టికాహార లోపం, రక్తహీనత తదితర కారణాలతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి ప్రాంతాల్లో అతిసారం ప్రబలుతోంది.

ప్రధాన లక్షణాలివీ..

  • వాంతులు, విరేచనాలు ఎక్కువ కావడం
  • స్పృహ తప్పినట్లు అనిపించడం
  • విరేచనాలలో రక్తం, చీము పడడం
  • తరచూ నీరసించిపోవడం
  • జ్వరం రావడం, కడుపు పొంగడం

వైద్యుల సూచనలివీ..

  • శిశువులకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలి
  • మిగిలిన వారితో ఓఆర్‌ఎస్‌ తాగించాలి 
  • విరేచనాలు తగ్గడానికి జింక్‌ మాత్రలివ్వాలి 
  • తగ్గిన తరువాత కూడా రెండు వారాల వరకు రెట్టింపు ఆహారం అందించాలి 
  • ప్రమాద స్థితిలో వైద్యుడిని గానీ, ఆరోగ్య కార్యకర్తను గానీ సంప్రదించాలి 
  • యాంటి బయోటిక్‌ ఔషధాలను వాడకూడదు 
  • ఐదేళ్లలోపు చిన్నారులకు బలవర్థకమైన ఆహారం తప్పనిసరి 
  • ఇడ్లీ, కిచిడీ, పప్పన్నం, మజ్జిగన్నం, జావ, అరటిపండ్లు, ఆపిల్, దానిమ్మ ఇవ్వవచ్చు
  • పంచదార నీళ్లు, కొబ్బరి నీళ్లు, గంజి, సగ్గుబియ్యం, మజ్జిగ, నిమ్మకాయ రసం తీసుకోవచ్చు 
  • గోరువెచ్చని నీరు తాగించాలి 
  • పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి 
  • గ్లూకోజ్, పండ్ల రసాలు, ఇతర శీతలపానీయాలకు దూరంగా ఉండాలి.

ప్రత్యేక అవగాహన.. ఈనెల 1 నుంచి ఆగస్టు 31 వరకు స్టాప్‌ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 5 ఏళ్ల లోపున్న సుమారు 2.70 లక్షల మంది పిల్లలకు ఉచితంగా రెండు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, 14 జింకు మాత్రలు పంపిణీ చేస్తాం. ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంల ద్వారా అందజేస్తాం. పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నాం. ఏమాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఎస్‌.భాస్కరరావు, విజయపార్వతి, డీఎంహెచ్‌వోలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని