logo

దిగుబడులు తగ్గాయి.. ధరలు పెరిగాయి

అకాల వర్షాలు, వాతావరణంలో మార్పులు కూరగాయల దిగుబడులపై ప్రభావం చూపాయి.

Published : 05 Jul 2024 02:14 IST

న్యూస్‌టుడే, బొబ్బిలి, రామభద్రపురం: అకాల వర్షాలు, వాతావరణంలో మార్పులు కూరగాయల దిగుబడులపై ప్రభావం చూపాయి. ఉమ్మడి జిల్లాలో జూన్, జులై నెలల్లో  ధరలు సాధారణ స్థితిలోనే ఉంటాయి. ఈ ఏడాది పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

దళారుల ప్రవేశంతో..

పచ్చిమిర్చి, అల్లం, టమాటా ధరలు భారీగా పెరిగాయి. అల్లం కిలో రూ.150 పైచిలుకు పలుకుతోంది. సామాన్యుడు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. వ్యాపారులు, దళారులు సిండికేట్‌గా మారి భారీగా పెంచేస్తున్నారు. ఉల్లి, క్యారెట్, బీట్రూట్‌ సైతం సామాన్యుడికి అందడం లేదు. కొందరు వ్యాపారులు నేరుగా పొలాల్లోకి వెళ్లి గుత్తగా కొనుగోలు చేసి మార్కెట్లో నచ్చిన ధరకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో అన్నదాతలు నష్టపోతున్నారు.

నిలిచిన ఎగుమతులు

రామభద్రపురం కూరగాయల మార్కెట్ నుంచి నిత్యం 30 నుంచి 40 టన్నుల వరకు ఎగుమతులు జరుగుతాయి. ఒడిశా, విశాఖ, కాకినాడ, రాజమహేంద్రవరంతో పాటు పలు ప్రధాన పట్టణాలకు ఇక్కడి నుంచి వెళ్తుంటాయి. దిగుబడులు లేక ఎండిపోయాయి. దీంతో విజయనగరం, బొబ్బిలి, సాలూరు, రాజాం, పార్వతీపురం వంటి పట్టణాల్లో ఇటీవల అమాంతంగా ధరలు పెరిగాయి. గతంలో ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడి ఉంటే ఇప్పుడు మూడు టన్నుల్లోపే ఉంది.

అధిక ఉష్ణోగ్రతలతోనే..

అధిక ఉష్ణోగ్రతల కారణంగా కూరగాయల పంటలు పాడయ్యాయి. కొన్ని రకాల పంటలు ఎండిపోయాయి. నీటి సౌకర్యం పుష్కలంగా ఉన్న పరిస్థితి బాగానే ఉంది. మిగిలిన చోట్ల తెగుళ్లు సోకి దెబ్బతిన్నాయి. పడాల్సిన సమయంలో వర్షాలు లేవు. దీనివల్ల 50 శాతానికి పైగా దిగుబడి తగ్గింది. పెంచేందుకు కృషి చేస్తున్నాం. ఈమేరకు రైతులకు సూచనలు చేస్తున్నాం.

మోహనకృష్ణ, ఉద్యానశాఖాధికారి, రామభద్రపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని