logo

తొమ్మిదేళ్లుగా బాలారిష్టాలు

కొత్తవలసలో తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) కల్యాణ మండపానికి బాలారిష్టాలు వెంటాడుతున్నాయి.

Published : 05 Jul 2024 02:11 IST

అడుగులు పడని తితిదే కల్యాణ మండపం నిర్మాణం

నిర్మాణంలో ఉన్న కల్యాణ మండపం

కొత్తవలస, న్యూస్‌టుడే: కొత్తవలసలో తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) కల్యాణ మండపానికి బాలారిష్టాలు వెంటాడుతున్నాయి. ఈ కల్యాణ మండపం మంజూరై దాదాపు తొమిదేళ్లు అయినా ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే, తితిదే బోర్డు సభ్యురాలుగా పనిచేసిన కోళ్ల లలితకుమారి.. కల్యాణ మండపం నిర్మాణానికి అనుమతులు సాధించారు. కొత్తవలస నుంచి అప్పన్నదొరపాలెం వెళ్లే మార్గంలో డ్రైవర్ల కాలనీకి ఎదురుగా దీనికి సర్వే నంబరు 165/2లో 1.53 సెంట్ల ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఇక్కడ  నిర్మాణానికి తితిదే అప్పట్లో రూ.1.25 కోట్లు మంజూరు చేసింది. రూ.40 లక్షలు ప్రజల నుంచి విరాళాలు అందాయి. నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. 2019 ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వచ్చాక దీన్ని పూర్తిగా పట్టించుకోలేదు. ఎట్టకేలకు గతేడాది పనులు ప్రారంభించినా, కాలవ్యవధి ముగిసింది. నిర్మాణ వ్యయం పెరగడంతో సవరించిన అంచనాలతో తిరిగి రూ.1.75 కోట్లను తితిదే కేటాయించింది. ఆమేరకు పనులు చేస్తున్నా నెమ్మదిగా జరుగుతున్నాయి. కల్యాణ మండపం, దీనికి ఆనుకుని డైనింగ్‌ హాలు నిర్మిస్తున్నారు. లింటల్‌ స్థాయి వరకు ఈ పనులు వచ్చాయి.  

ప్రహరీ, అంతర్గత రోడ్లకు నిధులేవీ

కల్యాణ మండపం రహదారికి ఆనుకుని కొండవాలు భూమిని కేటాయించడం వల్ల దీని చుట్టూ ప్రహరీ నిర్మించాల్సి ఉంది. ప్రధాన రోడ్డు నుంచి లోపలకు వెళ్లడానికి అంతర్గత రోడ్లు, భూమి చదును పనులకు అదనపు నిధులు అవసరం. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎమ్మెల్యేగా లలితకుమారి ఎన్నికవ్వడంతో  పనులు పరుగులెట్టిస్తారని ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ప్రహరీ, అంతర్గత రహదారుల నిర్మాణాలకు నిధులు కేటాయించాలని కోరుతున్నారు. లింటల్‌ స్థాయి వరకు  పనులు జరిగాయని, ఈ రెండు పనులు గుత్తేదారుతో త్వరితగతిన పూర్తి చేయిస్తామని తితిదే అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని