logo

ఉద్యోగోన్నతులు వచ్చినా పోస్టింగులు లేవు

జిల్లాలో తొమ్మిది మంది గ్రేడ్‌-2 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్‌-1 కింద ఉద్యోగోన్నతులు లభించి మూడు నెలలైనా ఇప్పటికీ పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంపై ఎదురు చూపులు చూస్తున్నారు.

Published : 05 Jul 2024 02:07 IST

కొత్తవలస, న్యూస్‌టుడే: జిల్లాలో తొమ్మిది మంది గ్రేడ్‌-2 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్‌-1 కింద ఉద్యోగోన్నతులు లభించి మూడు నెలలైనా ఇప్పటికీ పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంపై ఎదురు చూపులు చూస్తున్నారు. జోన్‌-1 పరిధిలోని విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో మొత్తం 43 మంది గ్రేడ్‌-2 కార్యదర్శులకు ఉద్యోగోన్నతి కల్పిస్తూ ఈ ఏడాది మార్చి 14న రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కె.కన్నబాబు ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు.   జిల్లాలో గ్రేడ్‌-2 కార్యదర్శులుగా పనిచేస్తున్న జి.అప్పయ్య, ఆర్‌.ఎన్‌.ఎల్‌.తులసి, సీహెచ్‌.కన్నబాబు, వి.వి.అనురాధ, ఎం.వాసుదేవరావు, ఎస్‌.నాగమణి, బి.శైలజ, ఎ.రామకృష్ణ నాయుడు, జి.జనార్దనరావు, ఎస్‌.కె.ఎస్‌.ప్రసాద్‌ మొత్తం పది మందికి గ్రేడ్‌-1 కార్యదర్శులుగా ప్రమోషన్‌ లభించింది. వీరిలో రామకృష్ణ నాయుడుకు విశాఖపట్నం జిల్లా, మిగిలిన తొమ్మిది మందికి విజయనగరం జిల్లా కేటాయించారు. మార్చి 16 నుంచి జూన్‌ 6వ తేదీ వరకు సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటం వల్ల నిబంధనల మేరకు, ఆ వ్యవధిలో పోస్టింగ్‌లు ఇవ్వడానికి అవకాశం లేదు. ఎన్నికల కోడ్‌ ఎత్తివేసి నెలరోజులు కావస్తున్నా ఇంతవరకు వీరికి పోస్టింగ్‌లు ఇవ్వలేదు. ఉద్యోగోన్నతి మేరకు గత కలెక్టర్‌ అప్రూవల్‌ ఇచ్చినా, కొత్త కలెక్టర్‌ రావడంతో అనుమతి పొంది పోస్టింగ్‌లు ఇచ్చే ప్రయత్నంలో జిల్లా పంచాయతీ అధికారి ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని