logo

నదులన్నీ తవ్వేశారు.. ఇసుకంతా బొక్కేశారు

జగన్‌ అధికారంలోకి వచ్చి రావడమే తరువాయి ఇసుక విధానాన్ని సవరించి, స్టాక్‌ పాయింట్లను ప్రభుత్వమే నిర్వహించి తక్కువ ధరకే ప్రజలకు అందజేస్తామని నమ్మించారు.

Published : 03 Jul 2024 05:28 IST

ఏటా ఐదు లక్షల టన్నులకు పైగా దోపిడీ

అంతా వైకాపా అనుచరులే 

నదిలో తవ్వకాలతో ఏర్పడిన గోతుల్లో నీరు 

జగన్‌ అధికారంలోకి వచ్చి రావడమే తరువాయి ఇసుక విధానాన్ని సవరించి, స్టాక్‌ పాయింట్లను ప్రభుత్వమే నిర్వహించి తక్కువ ధరకే ప్రజలకు అందజేస్తామని నమ్మించారు. తర్వాత అస్మదీయులకు తాయిలం ఇచ్చినట్లు ఇసుక రేవులను ధారదత్తం చేశారు. ఇక అంతే.. నదుల్లో ఎక్కడ ఇసుక దొరికితే అక్కడ కొల్లగొట్టేయడమే పనిగా పెట్టుకుని తమకు నచ్చిన చోటుకు  తరలించారు. అడిగే వారు లేరు. అడ్డేవారు ఉండరు అన్న రీతిలో సాగింది. ఇప్పుడు ప్రభుత్వం మారి చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఇసుక ముఠాలు ఎక్కడి వారక్కడ కుక్కిన పేనుల్లా ఉండిపోయారు. వీరిని వైకాపా ప్రభుత్వం ఉన్నంత కాలం అధికారులు కానీ, అనధికారులు కానీ ఏమీ అనలేకపోయారు. గనుల శాఖ యంత్రాంగం అసలు ఉందో లేదో తెలియని స్థితికి చేరిపోయింది. ఎపుడైనా అడ్డగించి నిబంధనలు వల్లె వేస్తే, జిల్లాను నడిపించే సారథులే నేరుగా రంగంలోకి దిగే పరిస్థితులు ఉండేవి.

న్యూస్‌టుడే, పార్వతీపురం: జిల్లాలో నాగావళి, వంశధార నదుల్లో ఇసుక లభిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం ఏటా జిల్లాలో 3.75 లక్షల టన్నులు నదుల్లో లభిస్తుందని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో అండదండలు పుష్కలంగా ఉండడంతో జిల్లా నుంచి ఐదు లక్షల టన్నుల వరకు ఏటా తరలించుకొని కొందరు సొమ్ము చేసుకున్నారు. ఈ లెక్కన కొన్ని వందల కోట్ల రూపాయలు జిల్లా నుంచి అస్మదీయుల జేబుల్లోకి వెళ్లిపోయాయి. జిల్లాకు ఏం ఇచ్చారు? ఇసుక తవ్వకాలతో వచ్చిన లాభమేమిటి? అనే అంశాలు ఇప్పుడు అధికారులు వెతుక్కుంటున్నారు. 

అంతా ఖజానాకే..

తెదేపా పాలనలో స్థానిక సంస్థలకు ఇసుక సేకరణ ద్వారా వచ్చిన ఆదాయంలో వాటాను  అందించేవారు. ఆ మొత్తాన్ని ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి వినియోగించుకొనే వారు. వైకాపా ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు. ఇసుక రేవుల నిర్వహణ అంతా ఒక సంస్థకే అప్పగించారు. ఆదాయం నేరుగా ప్రభుత్వ ఖజానాకే జమైంది. దాని వల్ల స్థానిక సంస్థలకు ఏమొచ్చింది? ఎంతొచ్చింది అనేది తెలియదు. 

రేవులు ఎక్కడ?

  • ప్రస్తుతం కొన్ని రేవులను అధికారులు గుర్తించారు.
  • భామిని మండలంలో నేరడి, పసుకుడి, నులకజోడు, లివిరి రేవులున్నాయి. వీటిలో నేరడి, పసుకుడిలోనే ఇసుక సేకరణకు అనువైన పరిస్థితులు ఉన్నాయి.  
  • కొమరాడ మండలం కొరిశిల రేవులో నాగావళి నుంచి ఇసుకను సేకరించేందుకు ప్రతిపాదనలు పరిశీలించారు. 

సీనరేజ్‌ ఎక్కడికెళ్లిందో..  

జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద వేలాదిగా భవన నిర్మాణాలు చేపట్టారు. వీటికి ఇసుక అవసరం. గుత్తేదారుల వద్ద ఇసుక వినియోగానికి సంబంధించి సీనరేజ్‌  ఛార్జీలు వసూలు చేశారు. జిల్లాలో దాదాపు రూ.50 లక్షల వరకు వసూలైంది. ఈ మొత్తం గనుల శాఖ ఖాతాలోకి జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విషయం ఆ శాఖ అధికారులకు కూడా తెలియదు.

అనుమతులు రాలేదు 

రాష్ట్రంలో ఇసుకపై కొత్త విధానాన్ని తీసుకువచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో నాగావళి, వంశధార నదుల్లో ఇసుక తవ్వకాలకు రేవులను గుర్తించి ప్రతిపాదించారు. కానీ వీటికి అనుమతులు రాలేదు. ఇసుక విధానంలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నందున, మారిన నిబంధనల మేరకు మళ్లీ గుర్తింపునకు చర్యలు చేపడతామని అధికారులు చెబుతున్నారు. 

  •  రేవుల గుర్తింపులో ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. భౌగోళిక అంశాలు అనువుగా ఉండాలి.
  • నాగావళి, వంశధార నదులు ఆంధ్ర, ఒడిశా తీరాలను తాకుతూ ప్రవహిస్తాయి. సరిహద్దులకు పరిమిత దూరంలో రేవు ఉంటే అక్కడ  తవ్వకానికి అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదు. జిల్లాలో అలాంటివి కొమరాడ మండలం కొరిశిల, భామిని మండలం నేరడి, పసుకుడి ఉన్నాయి. 
  • అలాగే నది గట్టు కూడా ప్రతిపాదిత దూరం దాటి ఉండాలి. ఈ రెండు అంశాలు పరిగణనలోకి తీసుకుంటే   ఆరేడు రేవుల్లో కేవలం మూడు మాత్రమే ప్రమాణాలకు నిలుస్తున్నాయి.

    నిబంధనలు కోసం ఎదురుచూస్తున్నాం

జిల్లాలో ఏటా 3.75 లక్షల మెట్రిక్‌ టన్నులు లభిస్తుందనేది ఒక అంచనా ఉంది. కొత్త ఇసుక విధానం కోసం ఎదురుచూస్తున్నాం. ప్రభుత్వం దీనిపై కసరత్తు చేస్తోంది. గతంలో ప్రతిపాదించిన రేవులకు ఎటువంటి అనుమతులు రాలేదు. అందువల్ల జిల్లాలో ఎక్కడా ఇసుక తవ్వకాలు జరగడం లేదు.                      
 - శ్రీనివాసరావు, ఏడీ, గనుల శాఖ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని