logo

మన బడులకు మహర్దశ

విద్యా వ్యవస్థలో ప్రాథమిక స్థాయి నుంచి పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకాన్ని అమలు చేస్తోంది.

Published : 03 Jul 2024 05:23 IST

పీఎంశ్రీలో అభివృద్ధి 

నర్సిపురం పాఠశాలలో క్రీడా ప్రాంగణం అభివృద్ధి  

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యా వ్యవస్థలో ప్రాథమిక స్థాయి నుంచి పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకాన్ని అమలు చేస్తోంది. మండలానికి ఒకటి చొప్పున తొలి విడతలో జిల్లాలోని 19 పాఠశాలలను ఎంపిక చేశారు. ఒక్కో బడిలో సౌకర్యాల కల్పనకు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నిధులు మంజూరు చేస్తారు. తరగతి గదుల నిర్మాణం, మరమ్మతులు, తాగునీటి సౌకర్యం, ప్రయోగశాల, డిజిటల్‌ గ్రంథాలయం, సౌర విద్యుత్తు, అంతర్జాల సౌకర్యం, క్రీడా ప్రాంగణం నిర్మించనున్నారు. ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో పనులు చేపడుతున్నారు. 
పీఎంశ్రీ పథకానికి అర్హత ఉన్న పాఠశాలల వివరాలు యాజమాన్యాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశాయి. వీటిని మండల, జిల్లా స్థాయిల్లో వడపోసిన తర్వాత రాష్ట్రస్థాయికి నివేదిస్తారు. అక్కడ నుంచి ఎంపికైన పాఠశాలల పేర్లు కేంద్రానికి పంపిస్తారు. చివరగా జాతీయ స్థాయిలో తుది జాబితాను ప్రకటిస్తారు. పాఠశాలల ఉనికి, అవసరాలు, స్థలం, హాజరు, ఉత్తీర్ణతల మేరకు ప్రాధాన్యమిస్తారు. 

జిల్లాలో వీటికి అవకాశం 

జిల్లా నుంచి మొత్తం 19 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో భామిని- ఆదర్శ, రేగిడి- జీటీడబ్ల్యూఏ ఉన్నత, కొమరాడ- ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్, కురుపాం- జీటీడబ్ల్యూఏహెచ్‌ఎస్, మక్కువ (ములక్కాయవలస)- ఏపీఎంఎస్, అన్నవరం- ఎంపీపీఎస్, నర్సిపురం- ఎంపీపీఎస్‌ (ఆర్‌), పార్వతీపురం (బెలగాం)- జీహెచ్‌ఎస్, పురోహితునివలస- ఏపీఎంఎస్, సాలూరు- ఎంపీఎల్‌ ఉన్నత, హడ్డుబంగి- ఎస్టీడబ్ల్యూఏహెచ్‌ఎస్, బలిజిపేట, గరుగుబిల్లి, చినమేరంగి మక్కువ, పాంచాలి, పాలకొండ, వీరఘట్టం, గాదెలవలస జడ్పీ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.  

 వేగంగా పనులు 

ఈ పథకంలో మంజూరైన పనులను సమగ్ర శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) నేతృత్వంలో జిల్లా అధికారులు పర్యవేక్షిస్తారు. పార్వతీపురం మండలంలోని నర్సిపురం ప్రాథమిక (ఆర్‌) పాఠశాలకు తొలి విడతగా రూ.లక్ష ఇచ్చారు. ఇక్కడ విశాలమైన స్థలం ఉండటంతో క్రీడా ప్రాంగణం పనులు ప్రారంభించారు. కబడ్డీ, ఖోఖో, షటిల్‌ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు హెచ్‌ఎం శారద తెలిపారు. పనులను డీఈఈ నారాయణస్వామి, ఏఈ శ్రీకర్‌ పర్యవేక్షిస్తున్నారు. జిల్లాల్లో ఎంపిక చేసిన అన్ని పాఠశాలల్లో అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు డీఈవో పగడాలమ్మ తెలిపారు. వేగంగా పూర్తి చేసేలా ఇంజినీరింగ్‌ అధికారులకు ఆదేశాలు ఇస్తామని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని