logo

నిధులు ఆరగింపు.. వైద్య కళాశాలకు గ్రహణం

వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామని గొప్పలు చెప్పుకొన్న వైకాపా ప్రభుత్వం వైద్య కళాశాలల నిర్మాణానికి నాబార్డు (నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌) మంజూరు చేసిన నిధులను మళ్లించింది.

Updated : 03 Jul 2024 05:29 IST

రూ.164 కోట్లకు  రూ.109 కోట్లు చెల్లింపు 

ఈ భవనం ఎప్పటికి పూర్తవుతుందో.. 

వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామని గొప్పలు చెప్పుకొన్న వైకాపా ప్రభుత్వం వైద్య కళాశాలల నిర్మాణానికి నాబార్డు (నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌) మంజూరు చేసిన నిధులను మళ్లించింది. విజయనగరంలో రూ.500 కోట్ల నాబార్డు ఆర్థిక సాయంతో చేపట్టిన వైద్య కళాశాలను గతేడాది సెప్టెంబరు 15న అప్పటి సీఎం జగన్‌ ప్రారంభించారు. ఏడాదిలోగా పనులన్నీ పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు చూస్తే.. ఆశించిన ప్రగతి లేదు.  

ఈనాడు, విజయనగరం:  నగరం శివారులోని గాజులరేగ వద్ద వైద్య కళాశాల భవనాల నిర్మాణానికి నాగార్జున నిర్మాణ సంస్థ (ఎన్‌సీసీ) ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటి వరకు ఈ సంస్థ రూ.164 కోట్ల విలువైన పనులు చేయగా అప్పటి ప్రభుత్వం రూ.109 కోట్లు చెల్లించింది. ఇంకా రూ.37.5 కోట్లు ఇవ్వాలి. మరో రూ.17.5 కోట్ల బిల్లులు ఆన్‌లైన్‌లో సీఎఫ్‌ఎంఎస్‌ (సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ)కు అప్‌లోడ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అక్కడ రూ.వేల కోట్ల చెల్లింపులకు సంబంధించి బిల్లులు పేరుకుపోవడంతో కొత్తవి అప్‌లోడ్‌ కావడం లేదని తెలిసింది. ఎప్పటికప్పుడు జరుగుతున్న పనుల మేరకు నాబార్డు అంచెలంచెలుగా నిధులు విడుదల చేస్తోంది. వాటిని వైకాపా ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడంతో బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగింది. దీంతో నిర్మాణ సంస్థ దాదాపు పనులన్నీ నిలిపివేసింది. ప్రస్తుతం అన్ని విధాలా సహకరిస్తామని అధికారులు చెప్పడంతో కొనసాగిస్తున్నారు. ఒప్పందం ప్రకారం   కళాశాల భవనాలు ఈ డిసెంబరు 31 నాటికి పూర్తి చేయాలి. ప్రభుత్వం సకాలంలో నిధులివ్వకపోవడంతో మరో రెండేళ్లు పట్టేలా కనిపిస్తోంది. కళాశాల ప్రారంభోత్సవం వరకు కలెక్టర్‌ నుంచి రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల వరకు నిర్మాణ సంస్థపై బాగా ఒత్తిడి చేశారు. అప్పటి వరకు చేసిన పనులకు రూ.83 కోట్లు చెల్లించగా, ఆ తర్వాత రూ.26 కోట్లు మాత్రమే ఇవ్వడం గమనార్హం.

పార్వతీపురంలో అతీగతీ లేదు

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రానికి వైద్య కళాశాల మంజూరు చేశారు. దాన్ని త్వరగా పూర్తి చేస్తామని ఏడాది క్రితం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించినా ఇంతవరకు దానికి అతీగతీ లేదు. రాష్ట్రంలో తొలుత 16 వైద్య కళాశాలలు మంజూరు చేసిన తర్వాత చివరలో 17వ కళాశాలగా రూ.600 కోట్ల వ్యయంతో పార్వతీపురానికి కేటాయించారు. దీని నిర్మాణానికి ఉల్లిభద్ర వద్ద 19 ఎకరాల స్థలం గుర్తించినా అప్పటి ప్రభుత్వం టెండరు ఖరారు చేయలేదు. 

వసతులు ఎక్కడ? 

గతేడాది ప్రథమ సంవత్సరం విద్యార్థుల ప్రవేశాలు జరిగాయి. సుమారు 150 మంది ఈ ఏడాది ద్వితీయ సంవత్సరంలోకి వెళ్తారు. నూతనంగా ప్రథమ సంవత్సరం విద్యార్థులు కూడా వస్తారు. రెండో ఏడాది విద్యార్థుల బోధనకు అవసరమైన తరగతి గదులు, వసతి గృహాల పనులు ఇంకా పూర్తి కాలేదు. వచ్చే సెప్టెంబరులో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సంబంధించి మరో రెండు వసతి గృహాలు, మూడు తరగతి గదులతో పాటు ఆరు బ్లాక్‌లతో అనుబంధ ఆసుపత్రి భవనం పూర్తి చేయాలి. ప్రస్తుతం నాలుగు బ్లాక్‌ల భవనాల పనులు జరుగుతున్నాయి. మరో రెండు బ్లాక్‌ల నిర్మాణాలు ప్రారంభించాల్సి ఉంది.  

సంస్థ ప్రతినిధులతో చర్చిస్తా 

బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ విష్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి విడుదలకు ప్రయత్నిస్తా. నిర్మాణ సంస్థ ప్రతినిధులను పిలిపించి మాట్లాడతా. అకడమిక్‌ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా పనులు వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తా. 
- కొండపల్లి శ్రీనివాస్, మంత్రి


జాప్యానికి కారణం తెలుసుకుంటా 

పార్వతీపురం వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు జాప్యానికి గల కారణాలు తెలుసుకుంటా. జగన్‌ ప్రభుత్వం రాష్ట్ర ఖజానా ఖాళీ చేసింది. బడ్జెట్‌ సమావేశాల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లి నిధుల విడుదలకు నా వంతు కృషి చేస్తా.
- గుమ్మిడి సంధ్యారాణి, మంత్రి  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని