logo

లాజిస్టిక్స్‌ ఆదాయంలో ముందంజ

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కేవలం ప్రయాణికులను గమ్యస్థానానికి తరలించడమే కాకుండా, లాజిస్టిక్స్‌ సేవలనూ అందిస్తోంది.

Published : 03 Jul 2024 04:40 IST

ద్వితీయస్థానంలో విజయనగరం రీజియన్‌

విజయనగరంలోని సరకు రవాణా కేంద్రం 

విజయనగరం కోట, న్యూస్‌టుడే: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కేవలం ప్రయాణికులను గమ్యస్థానానికి తరలించడమే కాకుండా, లాజిస్టిక్స్‌ సేవలనూ అందిస్తోంది. ఈమేరకు ఏటా ఆదాయాన్ని పెంచుకుంటూ పురోగతి దిశలో పయణిస్తోంది. గత ఆర్థిక ఏడాదిలో రూ.9.88 కోట్ల ఆదాయంతో విజయనగరం రీజియన్‌ రాష్ట్రంలో ద్వితీయస్థానంలో నిలిచింది. గడిచిన నాలుగేళ్లుగా ఈ రికార్డును నిలుపుకొంటోంది. ప్రస్తుతం 23 వాహనాలను వినియోగిస్తోంది. విజయనగరం జిల్లాలో 6, శ్రీకాకుళం- 13, పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో 4 బస్సులు తిరుగుతున్నాయి.

సేవలు ఇలా..

ఈ విధానంలో భాగంగా సరకులను ఇతర ప్రాంతాలకు సులువుగా తరలించవచ్చు.  నిత్యం తరలించేవారు నెలవారీ బుకింగ్‌కు ముందుగానే రవాణా ఛార్జీలు చెల్లిస్తే రాయితీ అందించనున్నారు. సరకు వెళ్లే గమ్యస్థానం ఆధారంగా కిలోమీటర్లను పరిగణనలోకి తీసుకుని ధర నిర్ణయిస్తారు. 10 టన్నుల వరకు తరలిస్తారు. అంతకుమించి ఉంటే ముందుగానే లాజిస్టిక్స్‌ కేంద్రాన్ని సంప్రదించాలి. 2021లో 1.78 లక్షలు, 2022లో 2.46 లక్షలు, 2023లో 3 లక్షలు, 2024 మార్చి నాటికి 3.05 లక్షలు పార్శిల్స్‌ బుకింగ్‌ అయ్యాయి. ప్రస్తుతం వ్యాపారస్థులు, కార్యాలయాలు, విద్యాసంస్థలు పెద్దఎత్తున వినియోగించుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ధి సంస్థ సైతం ముందుకొచ్చింది.

ఏజెంట్ల నియామకం..

సేవల పెంపులో భాగంగా ఇప్పటికే మండలాల వారీగా ఏజెంట్లను నియమించారు. విజయనగరం జిల్లాలో 42 మంది ఉన్నారు. అయితే నేరుగా వ్యక్తుల వద్దకు వెళ్లి సరకులు ఇచ్చే అవకాశం లేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ఆ విధానాన్ని సైతం అందుబాటులోకి తెస్తామని లాజిస్టిక్స్‌ విభాగం అధికారిణి దివ్య తెలిపారు. జిల్లాలో ఏమూల నుంచైనా సరకులు రవాణా చేసే విధంగా ఏజెంట్లను నియమించామన్నారు. ఈ ఏడాది 16 లక్షల పాఠ్యపుస్తకాలు, మండల కేంద్రాలకు పెద్దఎత్తున విత్తనాలను తీసుకెళ్లామని చెప్పారు. సేవలు పెరుగుతుండడంతో ప్రస్తుతం విజయనగరంలో ఉన్న గోదాము సరిపోవడం లేదని, దీంతో లాజిస్టిక్స్‌ కార్యాలయం పక్కనే విస్తరణ పనులు చేపట్టామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని