logo

ఈఎస్‌ఐ సేవలు అందేదెప్పుడో?

గత ప్రభుత్వం నిస్తేజంగా మార్చిన వ్యవస్థల్లో ఈఎస్‌ఐ విభాగం ఒకటి. ఈఎస్‌ఐ కార్డుదారులకు వైద్యం అందించేందుకు ఇది పనిచేస్తోంది

Updated : 03 Jul 2024 04:41 IST

రోజూ ఇలా ఖాళీగానే ఈఎస్‌ఐ కేంద్రం 

న్యూస్‌టుడే, వైద్యవిభాగం: గత ప్రభుత్వం నిస్తేజంగా మార్చిన వ్యవస్థల్లో ఈఎస్‌ఐ విభాగం ఒకటి. ఈఎస్‌ఐ కార్డుదారులకు వైద్యం అందించేందుకు ఇది పనిచేస్తోంది. అయితే వైకాపా హయాంలో మూలకు చేరింది. కార్పొరేట్‌ స్థాయిలో నిపుణులున్నా సేవలు కానరావడం లేదు. దీంతో రోగులు, క్షతగాత్రులంతా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి విజయనగరం జిల్లా కేంద్రంలోని కంటోన్మెంట్‌ ప్రాంతంలో డయాగ్నోస్టిక్‌ కేంద్రం ఉంది. ప్రస్తుతం దీని పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

సమస్యలివీ..  

  • ఈ కేంద్రంలో ల్యాబ్‌తో పాటు ఇద్దరు టెక్నీషియన్లు ఉన్నారు. కానీ రక్త పరీక్షలు చేసేందుకు అవసరమైన కిట్లు లేక.. ఇద్దరూ ఖాళీగానే ఉంటున్నారు. వచ్చే రోగులకు కనీసం రక్తపోటు, యూరిన్‌ టెస్టులు కూడా చేయలేకపోతున్నారు. థైరాయిడ్‌ రోగులైతే ఇతర ఆసుపత్రులకు వెళ్లాల్సిందే.
  • ఎక్స్‌రే యూనిట్‌లో టెక్నీషియన్‌ లేరు. ఇప్పటికే సంబంధిత యంత్రం మూలకు చేరింది. ఎవరైనా వస్తే బయటే ఎక్స్‌రే తీయించుకోవాలి
  • జనరల్‌ మెడిసన్, గైనిక్, ఆర్థోపెడిక్, దంత, జనరల్‌ సర్జికల్, చిన్న పిల్లల వైద్య నిపుణులున్నారు. ఈఎన్‌టీ, రేడియాలజీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈసీజీ, ఆల్ట్రాసౌండ్‌ స్కాన్‌ సేవలు అప్పుడప్పుడూ అందుతున్నాయి. ఫార్మాసిస్టు, స్టాఫ్‌నర్సులు, ఎఫ్‌ఎన్‌వో, ఎంఎన్‌వో, నాల్గో తరగతి ఉద్యోగులు అందుబాటులో ఉన్నారు. కానీ సేవలు దూరమయ్యాయి.

డిస్పెన్షరీలు ఉన్నా తప్పని రిఫరల్స్‌..

నెల్లిమర్ల, గరివిడి, బొబ్బిలి, కొత్తవలస, పైడిభీమవరంలో డిస్పెన్షరీలు సాగుతున్నాయి. అక్కడ సెలవులు, మందులు.. తదితర సేవలు అందుతాయి. వాటికంటే ఇక్కడ పరిస్థితి అధ్వానం. సాధారణంగా వీటి నిర్వహణకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులివ్వాలి. అయితే గత అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. పోస్టులను భర్తీ చేయలేదు. మందులు, కిట్ల సరఫరా కూడా ఆగిపోయింది. దీంతో వైద్యులు ఓపీకి మాత్రమే పరిమితమయ్యారు. స్కానింగ్‌లు, ఎక్స్‌రేలు, రక్త పరీక్షలు అవసరమైతే బయటే చేయించుకొని రమ్మంటున్నారు. కొన్నిసార్లు విశాఖకు రిఫర్‌ చేస్తున్నారు.

అధ్వానంగా కేంద్రం

కేంద్రం నిర్వహణను సైతం గాలికొదిలేశారు. ఆవరణలో పెద్దఎత్తున మొక్కలు పెరిగాయి. కంటోన్మెంట్‌లోని భవనం శిథిలస్థితికి చేరడంతో ఇప్పటికే పెచ్చులూడుతోంది. దీంతో రోగులు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. సేవలు కూడా మందగించడంతో చాలామంది విశాఖలోని ప్రధాన కేంద్రానికే వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితిపై ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ కృష్ణకిశోర్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. సేవల పరంగా ఇబ్బందులు లేవని, అత్యవసరమైతేనే మెరుగైన వైద్యం కోసం రిఫర్‌ చేస్తున్నామన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వైద్యులంతా అందుబాటులో ఉంటారని చెప్పారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, దశలవారీగా వాటిని పరిష్కరిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని