logo

జేఎన్‌టీయూ పరిధిలో 20,310 ఇంజినీరింగ్‌ సీట్లు

ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. ముందుగా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

Published : 03 Jul 2024 04:26 IST

ప్రారంభమైన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌

4 నుంచి ధ్రువపత్రాల పరిశీలన

విజయనగరంలోని జేఎన్‌టీయూ విద్యాలయం
విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. ముందుగా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఈనెల ఒకటో తేదీ నుంచి రిజిప్రక్రియ ప్రారంభమైంది. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి విజయనగరం జిల్లా కేంద్రంలోని జేఎన్‌టీయూ గురజాడ విద్యాలయం పరిధిలోని కళాశాలల్లో 20,310 సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాదితో పోల్చితే ఈసారి భారీగా పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. జేఎన్‌టీయూ పరిధిలో పూర్వ ఉత్తరాంధ్ర జిల్లాల్లో 25 ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. ఈమేరకు వీటిలో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఇందులో ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించినవి తొమ్మిది ఉన్నాయి. ఏఐటీటీఈ అనుమతి పొందిన సీట్లకు మాత్రమే అవకాశం ఇస్తారు. గత విద్యా సంవత్సరంలో 17వేల సీట్లకే ప్రవేశాలు కల్పించారు.

కంప్యూటర్‌ కోర్సులకే మొగ్గు..

ఇంజినీరింగ్‌లో కంప్యూటర్‌ కోర్సులకే ఎక్కువగా డిమాండ్‌ నెలకొంది. ప్రస్తుతమున్న కళాశాలల్లో 70 శాతం సీట్లు సీఎస్‌ఈ, వాటి అనుబంధ కోర్సులవే ఉంటున్నాయి. తర్వాత డిమాండు మేరకు ఐటీ, ఏఐ, ఏఐఎంఎల్, డేటా సైన్స్‌ వంటివాటిపై విద్యార్థులు దృష్టి సారిస్తున్నారు. ఒక్కో కళాశాలలో 3- 6 సెక్షన్ల వరకు ఈ కోర్సులే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.  జేఎన్‌టీయూ పరిధిలోని కళాశాలలు ఈ ఏడాది ఆయా కోర్సుల్లో సీట్ల పెంపునకు అనుమతి పొందాయి.  సీఎస్‌ఈ రానివారు సమానమైన ఇతరత్రా కోర్సుల్లో చేరుతున్నారు. ఇంజినీరింగ్‌లో ర్యాంకు రానివారు, సీటు రాదని తెలుసుకున్న వారు యాజమాన్యకోటాలో ప్రవేశాలు పొందుతున్నారు. ఈ సీట్లలో ఒక్కో కళాశాల ఒక్కో విధంగా రేట్లను నిర్దేశిస్తున్నాయి. 

 08 నుంచి ఐచ్ఛికాల నమోదు

ఈనెల ఏడో తేదీలోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన అనంతరం వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ఏపీఈఏపీసెట్‌లో సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. 4 నుంచి పదో తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. అనంతరం వెబ్‌ఆప్షన్ల నమోదు, ఐచ్ఛికాల్లో మార్పులు, సీట్ల కేటాయింపు, తరగతుల నిర్వహణ ఉండనున్నాయి. ఈమేరకు షెడ్యూల్‌ విడుదల చేసినట్లు అధికారులు ప్రకటించారు.

2 సహాయక కేంద్రాలు..

ఉమ్మడి జిల్లాలో విజయనగరం మహారాజా ఆనంద గజపతిరాజు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, పార్వతీపురం ప్రభుత్వ పాలిటెక్నికల్‌ కళాశాలలను సహాయ కేంద్రాలుగా కేటాయించారు. ఇక్కడ నాలుగోతేదీ నుంచి ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. పరిశీలన మేరకు అభ్యర్థులకు సందేహాలు, లేదా ధ్రువపత్రాల సమస్యలుంటే సంప్రదించవచ్చని కేంద్రాల సమన్వయాధికారులు ఆశారమణి, విలియం కేరీ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

వెసులుబాటుతో..

గతంలో అదనపు సెక్షన్లు, సీట్ల పెంపు కోసం ఎన్‌బీఏ(నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడేషన్‌) వంటి నిబంధనలు ఉండేవి. ఇప్పుడు కళాశాల స్థాపించి పదేళ్లు పూర్తి చేసుకుంటే చాలు. వసతి, ఫ్యాకల్టీ సౌకర్యాలు చూపితే సీట్లు పెంచుకునేందుకు ఏఐసీటీఈ వెసులుబాటు కల్పించింది. అభ్యర్థుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కళాశాలలు సీఎస్‌ఈ, అనుబంధ కోర్సుల్లో సీట్లు పెంచుకున్నాయి.
- రాజేశ్వరరావు, ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్,  జేఎన్‌టీయూ గురజాడ విద్యాలయం


సీట్లు ఇలా.. బీ జేఎన్‌టీయూ పరిధిలో కళాశాలలు - 25 బీ సీట్లు - 20,310 బీ ఉమ్మడి జిల్లాలో కళాశాలలు - 09 బీ సీట్ల సంఖ్య - 6,270 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని