logo

కిట్టు కనిపిస్తే ఒట్టు!

శిశుమరణాలు ఎక్కువగా ఇన్‌ఫెక్షన్‌తో జరుగుతున్నాయని, పాత పద్ధతులు, శుభ్రమైన వస్త్రాలు వాడకపోవడమే ఇందుకు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.

Published : 01 Jul 2024 05:46 IST

వైకాపా ప్రభుత్వంలో నిలిచిన పంపిణీ
పేదలకు పెరిగిన ఆర్థికభారం

ప్రసూతి వార్డులో బాలింతలు 

న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం: శిశుమరణాలు ఎక్కువగా ఇన్‌ఫెక్షన్‌తో జరుగుతున్నాయని, పాత పద్ధతులు, శుభ్రమైన వస్త్రాలు వాడకపోవడమే ఇందుకు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించాలని, పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో గతంలో తెదేపా ప్రభుత్వం ఎన్టీఆర్‌ బేబీ కిట్లు ఉచితంగా అందించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వాటి పంపిణీ నిలిపివేసింది. దీంతో పేదలకు భారంగా మారింది.

కిట్లలో ఏముంటాయ్‌ 

సొంతంగా కొనుక్కున్న బేబీ బెడ్‌లో చిన్నారి  

పుట్టిన పిల్లలు తల్లి పక్కనే సుఖంగా నిద్రపోయేందుకు బెడ్, దోమ తెర, తల్లులు చేతులు శుభ్రం చేసుకొనే ద్రావణం(శానిటైజర్‌), బేబీ సబ్బు, పౌడర్, న్యాప్‌కిన్‌ ఉండేవి. వాటిని బయట కొనాలంటే రూ.వేయి నుంచి రూ.1500 వరకు ఉంటుంది. కిట్టులోని సామగ్రితో పిల్లలకు ఆరోగ్య భద్రత ఉండేది. ప్రస్తుతం పరుపు ఒక్కటే బయట రూ.400 నుంచి రూ.500లు పలుకుతోంది. అవీ నాసిరకంగా ఉంటున్నాయని కొనుగోలుదారులు వాపోతున్నారు. 

సొంతంగా కొనుగోలు

జిల్లాలో కేంద్ర, ప్రాంతీయాసుపత్రుల్లోనే ఎక్కువగా ప్రసవాలు జరుగుతున్నాయి. వారిలో పేదలే అధికం. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే రూ.30 వేల నుంచి రూ.50వేల వరకు వెచ్చించాల్సి రావడంతో సామన్య, మధ్యతరగతి, పేదలు ప్రభుత్వ ఆసుపత్రులనే ఆశ్రయిస్తున్నారు. వారికి బేబీ కిట్లు ఉపయుక్తంగా ఉండేవి. నాలుగేళ్లుగా వాటి పంపిణీ నిలిచిపోవడంతో సొంతంగా కొనుగోలు చేసుకుంటున్నారు. ఇందుకు రూ.1200 నుంచి రూ.1500 వరకు పేదలపై ఆర్థిక భారం పడుతోంది.

బయట కొన్నాం..

గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో బేబీ కిట్టు ఇచ్చేవారు. ప్రస్తుతం రావడం లేదని చెబుతున్నారు. బయట ఒక్క బెడ్‌ మాత్రమే కొన్నాం. రూ.400 తీసుకున్నారు. అది కూడా నాణ్యత లేక వారం రోజులకే పాడైంది. ప్రభుత్వం అందిస్తే బాగుండేది. 

సుభద్ర, బాలింత   

ఉన్నతాధికారులకు విన్నవిస్తాం..

ఆసుపత్రుల్లో ప్రసవాల పెంపునకు ప్రభుత్వ పరంగా అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. మెరుగైన సేవలకు చర్యలు తీసుకున్నాం. కొన్నాళ్లు బేబీ కిట్లు కూడా అందించాం. ప్రస్తుతం పంపిణీ నిలిచిపోయింది. జిల్లా ఆసుపత్రిలో నెలకు 300 లకు పైగా ప్రసవాలు చేస్తున్నాం. కిట్ల పంపిణీ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

 వాగ్దేవి, డీసీహెచ్‌ఎస్, పార్వతీపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు