logo

వసతి కేంద్రాలను వదిలేశారు

వసతి కేంద్రాల్లో ఉండి ఉన్నత విద్యను పొందాలని ఎంతో ఆశగా చేరిన విద్యార్థులకు గత ప్రభుత్వం చుక్కలు చూపించింది. అయిదేళ్లలో వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు.

Published : 01 Jul 2024 05:13 IST

అయిదేళ్లూ విద్యార్థులకు అవస్థలే

విజయనగరంలోని బాబామెట్టలో అధ్వానంగా బాలుర వసతి కేంద్రం

విజయనగరం మయూరి కూడలి, న్యూస్‌టుడే: వసతి కేంద్రాల్లో ఉండి ఉన్నత విద్యను పొందాలని ఎంతో ఆశగా చేరిన విద్యార్థులకు గత ప్రభుత్వం చుక్కలు చూపించింది. అయిదేళ్లలో వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. మౌలిక వసతుల కల్పనలో జగన్‌ ఘోరంగా విఫలమయ్యారు. కనీసం తాగునీరు కూడా అందించలేకపోయారు. దీంతో కొందరు ఇళ్ల నుంచి పాఠశాలలు, కళాశాలలకు రాకపోకలు సాగించేవారు. ఈక్రమంలో ప్రవేశాలు సైతం తగ్గిపోయాయి. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సౌకర్యాలు మెరుగుపడనున్నాయని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గిరిజన కేంద్రాలకు ఏఎన్‌ఎంలను నియమించాలని ఆదేశాలొచ్చాయి. అంతేకాకుండా శతశాతం ప్రవేశాలు, సమస్యలు, మెనూ బకాయిల వివరాలు పంపించాలని ఉన్నతాధికారులు కోరారు. ఈమేరకు స్థానిక అధికారులు సిద్ధమయ్యారు.

ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇదీ..

విజయనగరం జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కేంద్రాలు 89 వరకు ఉన్నాయి. వీటిల్లో 9,400 మంది విద్యార్థులు ఉండాలి. అయితే సగం మంది కూడా లేరు. అరకొర వసతుల నడుమే వీరు ఇన్నేళ్లు చదువులు సాగించారు. పది, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఇతర కోర్సులు పూర్తయిన వారిలో కొందరు ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో ఈ ఏడాది పునరుద్ధరణకు 4,562 మంది మాత్రమే ముందుకొచ్చారు. ఈమేరకు మిగులు సీట్ల భర్తీకి చర్యలు చేపడుతున్నారు. మన్యం జిల్లాలోని 38 కేంద్రాల్లో 4,100 మంది ఉండగా.. ఈ విద్యా సంవత్సరంలో పునరుద్ధరణకు 1,652 మంది ముందుకొచ్చారు.

దాసన్నపేటలోని కేంద్రంలో దెబ్బతిన్న తలుపు 

పెద్దఎత్తున బకాయిలు..

కేంద్రాల నిర్వహణ, మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పనకు రెండు జిల్లాల్లో నాడు- నేడు పథకం కింద 47 కేంద్రాల వివరాలను ఉన్నతాధికారులకు పంపించారు. అయితే ఒక్కదానికీ ఆమోదం తెలపలేదు. దీంతో శిథిలగదుల్లోనే విద్యార్థులు ఉంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 26 కేంద్రాలు అద్దె గదుల్లో నడుస్తున్నాయి. సంబంధిత యజమానులకు ఆయా శాఖల వారు నెలకు రూ.వేలల్లో అద్దె చెల్లిస్తున్నారు. అయినప్పటికీ సౌకర్యాలు కలగానే మిగిలిపోయాయి. వైకాపా హయాంలో కనీసం మెనూ ప్రకారం భోజనం కూడా అందలేదు. సక్రమంగా నిధులు రాకపోవడంతో అమలు కాలేదు. కాస్మొటిక్‌ ఛార్జీల చెల్లింపులూ నిలిచిపోయాయి. ఇప్పటివరకు రూ.4.25 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది.

అధ్వాన స్థితిలో...

అయిదేళ్లలో విద్యార్థులకు ఒక్క పుస్తకం కూడా ఇవ్వలేదు. నోట్‌ పుస్తకాల పంపిణీ సైతం ఆగిపోయింది. ఆ సొమ్మంతా ప్రభుత్వం వద్దే ఉండిపోయింది. దోమ తెరలు, కిటికీల మెస్‌లు, దుప్పట్లు, పరుగులు, మంచాలు ఇవ్వలేదు. కేంద్రాలకు సంబంధించి చిన్నపాటి మరమ్మతులు కూడా చేయలేదు. ప్రస్తుతం భవనాలన్నీ అధ్వాన స్థితిలో దర్శనమిస్తున్నాయి. కొన్ని కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. తరలించాల్సి ఉన్నా ఆర్థికభారంతో అధికారులు ముందడుగు వేయడం లేదు.

మరమ్మతు పనులు ప్రారంభం..

గతంలో నిధుల సమస్య వెంటాడేది. ప్రస్తుతం స్థానికంగా నెలకొన్న సమస్యలు, వసతుల కల్పనకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాం. ఇప్పటికే కేంద్రాల్లో చిన్నపాటి మరమ్మతు పనులు ప్రారంభించాం. ఈ ఏడాది శతశాతం ప్రవేశాలు జరిగేలా చూస్తాం. ఆధార్, తెల్లరేషన్‌ కార్డుతో నచ్చిన వసతిగృహానికి వెళ్లి చేరవచ్చు. ఈమేరకు సంక్షేమాధికారులకు ఆదేశాలు జారీ చేశాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం.

రామానందం, సందీఫ్, శేఖర్, బీసీ, ఎస్టీ, ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని