logo

బస్సును ఢీకొన్న లారీ: అయిదుగురికి గాయాలు

సీతానగరం మండలంలోని కాశాపేట సమీపంలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో అయిదుగురికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు..

Published : 01 Jul 2024 05:07 IST

దెబ్బతిన్న బస్సు వెనుకభాగం 

సీతానగరం, న్యూస్‌టుడే: సీతానగరం మండలంలోని కాశాపేట సమీపంలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో అయిదుగురికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. సాలూరు నుంచి పార్వతీపురం వస్తున్న ఆర్టీసీ బస్సును పనుకుపేట కూడలి వద్ద వెనుక నుంచి లారీ బలంగా ఢీకొంది. బస్సు వెనుక అద్దం విరిగిపోయింది. చోదకుడు కె.దండాసి, సాలూరుకు చెందిన ప్రయాణికులు ఎం.భవాని, విజయకుమార్, సాయిగణేష్, పెదపెంకి వాసి ఎం.పైడితల్లి గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో బలిజిపేట నుంచి పార్వతీపురం వెళ్తున్న ఎమ్మెల్యే విజయచంద్ర వాహనం ఆపి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసినట్లు సీతానగరం పోలీసులు తెలిపారు.


రోడ్డు ప్రమాదంలో వలస కూలీ దుర్మరణం

సంతకవిటి, ఆదిలాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లా వాసి దుర్మరణం చెందాడు. ఈ విషాదకర ఘటన ఆదివారం చోటుచేసుకుంది. గ్రామీణ ఎస్సై ముజాహిద్‌ వివరాల ప్రకారం.. సంతకవిటి మండలం శ్రీహరినాయుడుపేట గ్రామానికి చెందిన బి.బాలకృష్ణ(36) ఉపాధి కోసం కొన్నేళ్ల కిందట మహారాష్ట్రకు వెళ్లాడు. అక్కడ బొంతలను తయారీ చేసి వివిధ ప్రాంతాలకు వెళుతూ విక్రయించేవాడు. శనివారం సాయంత్రం ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం చాంద(టి)లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆదివారం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యలో బెల్లూరి మూలమలుపు సమీపంలోని డ్రైవర్స్‌ కాలనీ వద్దగల సైన్‌బోర్డును బలంగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. బాలకృష్ణ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


నదిలో మునిగి వృద్ధుడి మృత్యువాత

కొమరాడ, న్యూస్‌టుడే: స్నానానికి వెళ్లి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన కొమరాడ మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. బొండపల్లి మండలంలోని గరుడబిల్లి గ్రామానికి చెందిన డి.కాలియ(68) జంఝావతి డ్యాం సమీపంలోని బంజకుప్ప రాతి క్వారీలో డ్రిల్లింగ్‌ పని నిమిత్తం వచ్చాడు. ఆదివారం ఉదయం ఆయన జంఝావతి నదిలో స్నానానికి వెళ్లాడు. వర్షాలు కురుస్తుండటంతో నీటి ప్రవాహం పెరిగింది. అంచనా వేయలేక లోతు ఎక్కువ ఉన్న ప్రదేశంలో స్నానానికి దిగి మునిగిపోయి మృతి చెందాడు. ఎప్పటికీ రాకపోవడంతో తోటి కార్మికులు వెళ్లి పరిశీలించగా మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నీలకంఠం చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని