logo

బడులకు అనుమతులెక్కడ

‘విజయనగరంలోని ఓ పాఠశాల యాజమాన్యం భవనాలు నిర్మించకుండానే విద్యార్థుల నుంచి ఫీజులు కట్టించుకుని ప్రవేశాలు కల్పించింది.

Published : 01 Jul 2024 05:05 IST

గత ఐదేళ్లు ఇష్టారాజ్యం
విద్యాశాఖ తనిఖీలపై అనుమానాలు

విజయనగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలపై విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేస్తున్న పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు 

న్యూస్‌టుడే, విద్యావిభాగం: ‘విజయనగరంలోని ఓ పాఠశాల యాజమాన్యం భవనాలు నిర్మించకుండానే విద్యార్థుల నుంచి ఫీజులు కట్టించుకుని ప్రవేశాలు కల్పించింది. అయితే ఇంకా తరగతులు ప్రారంభించలేదు. తొలుత ఈనెల 26 నుంచి తరగతులని చెప్పారు. భవనాలు లేకపోవడంతో జులై ఒకటో తేదీ నుంచి రమ్మని చెప్పారు. ఆ విద్యాలయానికి అనుమతి లేదని ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ధ్రువీకరించారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ గురువారం అధికారులకు ఫిర్యాదు చేశారు’
జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభమై 14 రోజులు కావస్తోంది. నేటికీ అనుమతులు లేకుండా కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాలయాలు యథేచ్ఛగా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ అధికారులు నామమాత్రంగా తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకొన్నారన్న ప్రచారం జరుగుతోంది. విద్యాశాఖలో కొందరు సిబ్బంది వసూళ్లకు పాల్పడి, ఆయా పాఠశాలలకు అను   కూలంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని యాజమాన్యాలు ప్రవేశాలు నిర్వహించడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తొలుత 15.. ఇప్పుడు 08

మే నెలలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. తొలుత 15 పాఠశాలలకు గుర్తింపు లేదని తేల్చారు. 2024- 25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు, తరగతులు నిర్వహించొద్దని నోటీసులు సైతం జారీ చేశారు. అనంతరం ఆర్జేడీకి నివేదించారు. దీంతో అందులో ఏడు విద్యాలయాలకు చెందిన యాజమాన్యాలు రెన్యువల్‌కు ముందుకొచ్చినట్లు చెబుతున్నారు. దత్తిరాజేరు, రాజాం మండలాల్లో ఒక్కొక్కటి, విజయనగరంలో ఆరు ఇంకా స్పందించలేదని విద్యాశాఖ ప్రకటించింది.

ఇలాగేనా కమిటీలు ..?

త్రీమెన్‌ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా ఉన్న ఎంఈవో, సీనియర్‌ ప్రధానోపాధ్యాయులే కమిటీలో ఉన్నారు. వీరి ద్వారా తనిఖీలు ఎంతవరకు సమంజసమని కొందరు ప్రశ్నిస్తున్నారు. గతంలో పక్క మండలాలకు చెందిన అధికారులను రప్పించేవారు. ఇక్కడి వారు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేవారు. దీంతో ఎక్కువ సంఖ్యలో అనుమతులు లేని పాఠశాలలు కనిపించేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో ఇప్పటికే చాలామంది విద్యార్థులు ఫీజులు చెల్లించినట్లు తెలుస్తోంది.

లోపాలెన్నో..

  • ఓపెనింగ్‌ పర్మిషన్‌ పత్రం అందించి, ప్రవేశాలు నిర్వహించుకోవచ్చు. అలాంటి యాజమాన్యాలు నెల రోజుల అనంతరం గుర్తింపునకు దరఖాస్తు చేయాలి. అయినా ఒక్కరూ ముందుకు రాలేదు. అసలు ఓపెనింగ్‌ పర్మిషన్‌ పత్రాలు కూడా ఇవ్వని పాఠశాలలున్నాయి.
  • ఒక విద్యాలయానికి గరిష్ఠంగా మూడేళ్ల పాటు గుర్తింపు కల్పిస్తారు. దీనిని 2024- 25 విద్యా సంవత్సరం నుంచి అయిదేళ్లకు పెంచినట్లు గత ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈక్రమంలో 2023-24 విద్యాసంవత్సరంలో రెన్యువల్స్‌ పూర్తయినా కొందరు పునరుద్ధరణ చేసుకోలేదు. అయినప్పటికీ ప్రవేశాలు కల్పిస్తున్నారు.
  • ఇటీవల జరిగిన తనిఖీల్లో యథేచ్ఛగా అదనపు సెక్షన్ల పెంపు, రికార్డుల నిర్వహణలో లోపాలు తదితరాలను గుర్తించారు.
  • కొన్ని విద్యాలయాలు ఒకే అనుమతి పత్రంతో రెండు, మూడు చోట్ల బ్రాంచులు నిర్వహిస్తున్నాయి. విజయనగరంలో ఇలాంటి పాఠశాలపై ఇప్పటికే విద్యాశాఖకు ఫిర్యాదు వెళ్లింది. అయినప్పటికీ ఆ దిశగా అధికారులు దృష్టిసారించకపోవడం గమనార్హం.
  • కొన్నింటికి ప్రాథమిక తరగతులకే గుర్తింపు ఉంటున్నా, ఉన్నత తరగతులు నిర్వహిస్తున్నాయి.

మరోసారి తనిఖీలు

‘విజయనగరంలోని ఓ పాఠశాలకు అనుమతి లేదు. అయినప్పటికీ ప్రవేశాలు కల్పించారు. దీనిపై ఫిర్యాదు అందింది. విచారణ చేయాలని ఉప విద్యాశాఖాధికారిని ఇప్పటికే ఆదేశించాం. ఒకే అనుమతితో రెండు బ్రాంచులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. తనిఖీల్లో గుర్తించిన లోపాలపై నోటీసులు జారీ చేశాం. కొన్ని పునరుద్ధరణకు ముందుకొచ్చాయి. మరోసారి పక్కాగా తనిఖీలు నిర్వహిస్తాం.

ఎన్‌.ప్రేమకుమార్, డీఈవో, విజయనగరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని