logo

జగన్నాథ నీ ఆస్తులేవి

ఆస్తులున్నా పాలకొండలో జగన్నాథస్వామికి పస్తులు తప్పడం లేదు. వందల ఎకరాల్లో ఉన్న పంట భూములు కాలక్రమేణా కరిగిపోయాయి.

Published : 29 Jun 2024 03:59 IST

పాలకొండ, గ్రామీణం, న్యూస్‌టుడే: ఆస్తులున్నా పాలకొండలో జగన్నాథస్వామికి పస్తులు తప్పడం లేదు. వందల ఎకరాల్లో ఉన్న పంట భూములు కాలక్రమేణా కరిగిపోయాయి. మిగిలిన భూమి నుంచి ఆదాయం రాకపోవడం, మరికొన్ని వివాదాల్లో ఉండటంతో ఆలయ నిర్వహణ కష్టతరంగా మారింది. పాలకొండలోని ఆలయం పూరీ తరహాలో ఉంటుంది. కానీ ఇక్కడ ఏటా రథయాత్ర సమయంలో ఆలయానికి రంగులు కూడా వేయలేని దుస్థితి. రథం శిథిలమైనా కొత్తది తయారు చేయలేని పరిస్థితి ఉంది.

గతంలో జగన్నాథస్వామి ఆలయానికి 122.41 ఎకరాల భూమి ఉండేది. కాలక్రమేణా ఇవి ప్రస్తుతం చాలా ఎకరాలు తరిగిపోయాయి. పాలకొండ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం మొదలు సబ్‌స్టేషన్, ఎంపీడీవో కార్యాలయం, ఇందిరానగర్‌ కాలనీ వరకు ఉన్న భూములన్నీ ఆలయానివే. ఇక్కడ ప్రభుత్వం 37 ఎకరాలు మూడు దశాబ్దాల క్రితం సేకరించింది. ఆర్డీవో కార్యాలయం పక్కన రెండు ఎకరాలు పోలీసు శాఖకు కేటాయించింది. ఇలా భూములన్నీ కరిగి ప్రస్తుతం కొండాపురం, అరదలి, వెలగవాడ ప్రాంతాల్లో మాత్రమే మిగిలాయి. వీటి ద్వారా ఏటా రూ.1.80 లక్షల ఆదాయం మాత్రమే సమకూరుతోంది.

స్వామికి చెందిన విలువైన భూములు

ఆదాయం అంతంత మాత్రమే..

ఈ ఆలయానికి రథయాత్ర 9 రోజులు మినహా భక్తులు వెళ్లడం అరుదే. దీంతో హుండీల నుంచి చాలా తక్కువగా ఆదాయం సమకూరుతోంది. గతేడాది రూ.31 వేలు మాత్రమే వచ్చింది. దీనిలోనూ యాత్ర సమయంలో వచ్చిందే ఎక్కువ. ఇది కాకుండా రథయాత్ర సమయంలో వినోద కార్యక్రమాల నిర్వహణకు బహిరంగ వేలం ఉంటుంది. దీంతో రూ.4 లక్షల మేర వస్తుంది. ఆలయానికి ఉన్న రూ.10.64 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల ద్వారా రూ.22 వేలు చేకూరుతుంది. కొండాపురం వద్దనున్న 23 ఎకరాలకు అధికారులు నిర్దేశించిన మొత్తంలో కౌలు ఇవ్వలేమని రైతులు చెప్పడంతో మూడేళ్లుగా భూములు ఖాళీగానే ఉన్నాయి.

వివాదంలో 62.10 ఎకరాలు

శ్రీకాకుళం జిల్లా పెద్దపేట, జగన్నాథపురం గ్రామాల వద్ద పాలకొండ జగన్నాథునికి 62.10 ఎకరాల భూములు ఉన్నాయి. వీటిని రైతులు కౌలుకు సాగు చేసేవారు. ఈ భూములకు సంబంధించి రెవెన్యూ అధికారులు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చేశారు. దీంతో రైతులు కౌలు చెల్లించడం మానేశారు. దీనిపై దేవదాయ శాఖ అధికారులు రెవెన్యూ అధికారులకు వారి వద్దనున్న ఆధారాలను సమర్పించారు. గతంలో శ్రీకాకుళం ఆర్డీవో సైతం ఈ భూములపై విచారణ చేపట్టినా ఇప్పటికీ వివాదం పరిష్కారం కాలేదు.  ఈ భూముల నుంచి ఆదాయమూ రావడం లేదు. 

నిర్వహణ వ్యయం రూ.4.88 లక్షలు

ఏటా ఆలయ నిర్వహణకు రూ.4.88 లక్షలు వ్యయం అవుతోంది. ముగ్గురు సిబ్బందికి రూ.3.98 లక్షలు వేతనాల రూపంలో చెల్లిస్తున్నారు. దీపదూప నేవైద్యాలకు మరో రూ.90 వేలు అవుతోంది. దీంతో అభివృద్ధికి నోచుకోవడం లేదు. తెదేపా అరకు పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు పల్లా కొండలరావు సహకారంతో భక్తులు రూ.పది లక్షల మేర వ్యయం చేసి రథం ఏర్పాటు చేశారు. ఆలయ పరిధిలో ఉన్న ఉపాలయాలు శిథిలమవుతున్నా మరమ్మతులు చేయలేని పరిస్థితి నెలకొంది.

అభివృద్ధికి చర్యలు

పాలకొండ జగన్నాథస్వామి ఆలయం అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. ఖాళీగా ఉన్న భూములు వాణిజ్య అవసరాలకు వినియోగించేలా ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తాం. వివాదంలో ఉన్న భూములకు సంబంధించి రెవెన్యూ అధికారులతో చర్చిస్తాం.  

కె.సర్వేశ్వరరావు, ఆలయ ఈవో 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని