logo

78 వేల ఎకరాలకు తోటపల్లి జలాలు

తోటపల్లి జలాశయం నుంచి 78 వేల ఎకరాలకు చేరేలా నీరు విడుదల చేశామని మహిళా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు.

Published : 29 Jun 2024 03:34 IST

గంగమ్మకు పూజలు చేస్తున్న మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు

గరుగుబిల్లి, న్యూస్‌టుడే: తోటపల్లి జలాశయం నుంచి 78 వేల ఎకరాలకు చేరేలా నీరు విడుదల చేశామని మహిళా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. శుక్రవారం తోటపల్లి జలాశయం కుడి ప్రధాన కాలువ నుంచి జలాలు విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని మంత్రి మాట్లాడారు. అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికొదిలేసిందని, కాలువల్లో కనీసం పూడిక కూడా తీయలేదన్నారు. గరుగుబిల్లి, కురుపాం మండలాలకు నీరందేలా చూడాలని సూచించారు. మన్యంలోని సాగునీటి ప్రాజెక్టుల సమస్యలపై ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రికి వివరిస్తామన్నారు. జిల్లాలోని రోడ్లు, పంచాయతీల అభివృద్ధికి తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. ఐటీడీఏని గత ప్రభుత్వం పూర్తిగా వదిలేసిందని, గిరిజనుల అభ్యున్నతి దృష్ట్యా ఇక నుంచి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. కొమరాడ మండలంలోని పూర్ణపాడు- లాబేసు వంతెన నిర్మాణంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇరిగేషన్‌ ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. ఎడమ కాలువ నుంచి శివారు భూములకు సాగునీరు అందేలా పూడిక తీత చేపట్టి పిల్ల కాలువలను వెడల్పు చేయాలని కోరారు.  

118 కిలోమీటర్ల వరకు నీరు

ప్రస్తుతం కుడి కాలువ నుంచి 118 కిలోమీటర్ల పొడవున పూసపాటిరేగ వరకు సాగు నీరు అందిస్తామని ఇరిగేషన్‌ సీఈ ఎస్‌.సుగుణాకరరావు పేర్కొన్నారు. కాలువలో 1700 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందన్నారు. పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర, గరుగుబిల్లి తెదేపా, జనసేన మండలాధ్యక్షులు ఎ.మధుసూదనరావు, శంకరరావు, నాయకులు ఎం.పురుషోత్తంనాయుడు, ఎం.బి.విజయాంకుశం పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని