logo

వైకాపా కార్యాలయంలపై శ్రద్ధ.. ప్రజా భవనాలపై అశ్రద్ధ?

గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ప్రజాసేవను వదిలి సొంత కార్యక్రమాలపై దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాల భవన నిర్మాణాలను ప్రారంభించింది.

Published : 29 Jun 2024 03:20 IST

విజయనగరంలో ఆగిపోయిన బోస్టన్‌ స్కూల్‌ పనులు
తెదేపా హయాంలో ప్రారంభించారని కక్ష కట్టి నిలుపుదల
 న్యూస్‌టుడే, విజయనగరం నేరవార్తా విభాగం, నెల్లిమర్ల

అందమైన భవనం.. ఇలా నిరుపయోగంగా.. ముందుభాగంలో పెరిగిన మొక్కలు

గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ప్రజాసేవను వదిలి సొంత కార్యక్రమాలపై దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాల భవన నిర్మాణాలను ప్రారంభించింది. ఇప్పటికే కొన్నిచోట్ల పూర్తయ్యాయి. మరికొన్ని చివరి దశలో ఉన్నాయి. కొత్త ప్రభుత్వం రాకతో వారి బండారం బయటపడింది. విశాఖలోని రుషికొండపై నిర్మించిన అధునాతన ప్యాలెస్‌లు వీటికి అదనం. ఇలా ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చుపెట్టిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు ఉపయోగపడే ఒక్క పనీ చేయలేదు. వారికి ముందు పాలన సాగించిన తెదేపా ప్రభుత్వం విజయనగరంలో ప్రారంభించిన బోస్టన్‌ స్కూల్‌ నిర్మాణమే దీనికి నిదర్శనం. వారు పనులు చేపట్టారన్న కక్షతో జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆపేశారు.

రాష్ట్ర విభజన అనంతరం బోస్టన్‌ స్కూల్‌ ఏర్పాటుకు తెదేపా ప్రభుత్వం 2017-18లో శ్రీకారం చుట్టింది. విజయనగరం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న కొండవెలగాడలో 25 ఎకరాలను కేటాయించారు. అప్పట్లో రూ.20 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. ప్రధాన భవనం ప్రారంభానికి సిద్ధం కాగా.. అడ్మినిస్ట్రేషన్‌ బ్లాక్, ఖైదీలను ఉంచే భవన నిర్మాణాలను 60 శాతం పూర్తిచేశారు. ప్రహరీ నిర్మించారు. భోజనశాల, సిబ్బంది క్వార్టర్స్‌ కోసం కొన్ని గదుల నిర్మాణాలు మొదలు పెట్టారు. ఈలోపు వైకాపా రావడంతో పనులన్నీ ఆపేశారు.

అధ్వానంగా లోపలి గదులు

అధ్వాన స్థితిలో..

ప్రస్తుతం ఆ భవనాలన్నింటినీ అందుబాటులోకి తీసుకురావాలంటే రూ.50 కోట్ల వరకు అవసరమని సంబంధిత  అధికారులు చెబుతున్నారు. గత అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం కనీసం రూపాయి కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా దీన్ని జిల్లా జైలుగా మార్చుతామని చెప్పారు. అది కూడా జరగలేదు. ప్రస్తుతం అక్కడ పెద్దఎత్తున మొక్కలు పెరిగాయి. గదులన్నీ అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. విలువైన ఇనుము, ఇతర వస్తువులు చోరీకి గురవుతున్నాయి.

విశాఖకు తీసుకెళ్లాల్సిందే..

ఉమ్మడి జిల్లాలో గంజాయి, మద్యం, కొట్లాటతో పాటు హత్యలు, దొంగతనాలు, మోసాలకు పాల్పడిన ఖైదీలను ఉంచేందుకు విజయనగరంలోని సబ్‌ జైళ్లలో వసతి సమస్య ఎదురవుతోంది.  

  • విజయనగరం సబ్‌ జైల్‌లో 30 నుంచి 40 మందిని మాత్రమే ఉంచగలరు. ఒక్కోసారి 60 నుంచి 70 మందికిపైగా వస్తుంటారు. అలాంటప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
  • బొబ్బిలి, ఎస్‌.కోట, చీపురుపల్లిలో సబ్‌ జైళ్లు ఉన్నప్పటికీ లాకప్‌ల సంఖ్య తక్కువ.
  • పార్వతీపురంలో 20 నుంచి 30 మంది మాత్రమే సరిపోతారు. సాలూరులోని జైలును ఇప్పటికే మూసేశారు.
  • రెండు జిల్లాల్లో మహిళా ఖైదీలను ఉంచేందుకు ప్రత్యేక లాకప్‌ లేదు. ఒకవేళ ఎవరైనా వస్తే వారిని విశాఖపట్నంలోని సెంట్రల్‌ జైల్‌కు తరలిస్తున్నారు.
  • తీవ్రమైన నేరాలు, కోర్టుల పరిధిలో ఉన్నవారు, ఎక్కువ కేసుల్లో ఉన్న ఖైదీలను సైతం అక్కడికే తీసుకెళ్తున్నారు. అయితే విచారణ నిమిత్తం కొన్నిసార్లు ఇక్కడి కోర్టుల్లో హాజరుపర్చాలి. అలాంటి సమయంలో తప్పించుకున్న ఘటనలు సైతం ఉన్నాయి.
  • విజయనగరంలోని నిర్మాణాలు పూర్తయితే కొంతమేరకు ఈ ఇబ్బందులు తొలగుతాయి.

ఉన్నతాధికారులకు నివేదించాం: కొండవెలగాడ వద్ద ఇప్పటికే కొంతమేర భవనాలు సిద్ధమయ్యాయి. దేనికి ఉపయోగిస్తారన్న దానిపై స్పష్టత లేదు.  ప్రస్తుత పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదించాం. త్వరలో దీనిపై సమీక్ష జరగనుంది. అనంతరం నిర్ణయం తీసుకుంటాం.                                      

 మధుబాబు, జైళ్ల అధికారి, విజయనగరం జిల్లా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని