logo

ప్రక్షాళన ప్రారంభం

సహకార రంగంలో ప్రక్షాళనకు తొలి అడుగు పడింది. ప్రస్తుతమున్న కమిటీల స్థానంలో పర్సన్‌ ఇన్‌ఛార్జి వ్యవస్థను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది.

Published : 29 Jun 2024 03:11 IST

సహకార రంగంలోకి పర్సన్‌ ఇన్‌ఛార్జులు

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు

ఈనాడు, విజయనగరం, న్యూస్‌టుడే, విజయనగరం అర్బన్‌: సహకార రంగంలో ప్రక్షాళనకు తొలి అడుగు పడింది. ప్రస్తుతమున్న కమిటీల స్థానంలో పర్సన్‌ ఇన్‌ఛార్జి వ్యవస్థను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. దీంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్‌), డీసీఎంఎస్, డీసీసీబీలు అధికారుల నియంత్రణలోకి వెళ్లనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడినట్లు అధికారులు ధ్రువీకరించారు.

పీఐగా జేసీ బాధ్యతలు..

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ(డీసీఎంఎస్‌)లకు సంయుక్త కలెక్టర్‌ కొల్లాబత్తుల కార్తీక్‌ను పర్సన్‌ ఇన్‌ఛార్జిగా నియమించారు. గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో డీసీసీబీకి కలెక్టర్‌ పీఐగా ఉండేవారు. ఈసారి ఆ బాధ్యతలను జేసీలకు అప్పగించారు. శుక్రవారం ఆయన అదనపు బాధ్యతలు స్వీకరించినట్లు డీసీసీబీ సీఈవో కె.జనార్దన తెలిపారు. సహకారశాఖలో పనిచేసే సహాయ రిజిస్ట్రార్, సీనియర్, జూనియర్‌ ఇన్‌స్పెక్టర్లను సొసైటీలకు పీఐవోలుగా నియమించారు. శనివారం లోపు విధుల్లో చేరాలని వారిని ఆదేశించినట్లు జిల్లా సహకార అధికారి రమేష్‌ వెల్లడించారు.

ఐదేళ్లలో సేవలు శూన్యం..

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 108 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలున్నాయి. గతంలో తెదేపా ప్రభుత్వమే వీటికి ఎన్నికలు నిర్వహించింది. 2018లో కాలపరిమితి ముగియడంతో పాత పాలక వర్గాలనే కొనసాగించింది. ఆరు నెలల కాలానికి రెండు దఫాలుగా ఏడాది పాటు ఉండేలా ఉత్తర్వులిచ్చింది. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల కోసం నామినేటెడ్‌ కమిటీలను నియమించింది. పీఏసీఎస్‌లకు త్రిసభ్య కమిటీలు(ఇందులో ఒక ఛైర్మన్, ఇద్దరు సభ్యులు ఉంటారు), డీసీఎంఎస్, డీసీసీబీలకు ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీలు ఏర్పాటయ్యాయి. దీంతో సహకారశాఖ వైకాపా రంగులమయంగా మారింది. ప్రతి ఆరు నెలలకూ వారిని కొనసాగిస్తూ ఐదేళ్ల పాటు ఉంచారు. ఈ కాలంలో రైతులకు సేవలు అందలేదు. కొత్త ప్రభుత్వం రావడంతో వారందర్నీ రాజీనామాలు చేయించింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఎన్నికలు జరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

పదవులను వదల్లేదు..

మరోవైపు విజయనగరం జిల్లాలోని రెండు చోట్ల వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ ఛైర్మన్లుగా కొనసాగుతున్న వైకాపా నాయకులు తమ పదవులు వదులుకోమంటున్నారు. చీపురుపల్లి కమిటీ ఛైర్మన్‌ దన్నాన జనార్దనరావు, పూసపాటిరేగలో చిక్కాల సాంబశివరావు ఇంకా కొనసాగుతున్నారు. రెండు రోజుల్లో రాజీనామాలు చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని