logo

ఎట్టకేలకు కదిలారు

విజయనగరం రాజీవ్‌నగర్‌ కాలనీ మొదటిలైన్‌లో ఉన్న మాన్సాస్‌ స్థలంలో వైకాపా నాయకులకు చెందిన అక్రమ నిర్మాణాన్ని పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు శుక్రవారం తొలగించారు.

Published : 29 Jun 2024 03:09 IST

 రాజీవ్‌నగర్‌లో అక్రమ నిర్మాణం కూల్చివేత

విజయనగరంలోని రాజీవ్‌నగర్‌ కాలనీ సమీపంలో ఉన్న
మాన్సాస్‌ స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని జేసీబీలతో
తొలగిస్తున్న పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: విజయనగరం రాజీవ్‌నగర్‌ కాలనీ మొదటిలైన్‌లో ఉన్న మాన్సాస్‌ స్థలంలో వైకాపా నాయకులకు చెందిన అక్రమ నిర్మాణాన్ని పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు శుక్రవారం తొలగించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన నాయకులు ఈ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా సర్వీసింగ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. మాన్సాస్‌ సంస్థకు చెందిన స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. ప్రధాన కాలువను మళ్లించారు. దీంతో మురుగు పెద్దఎత్తున నిలిచిపోయేది. ప్రశ్నిస్తే తమను బెదిరిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని అక్కడివారు నగరపాలక సంస్థ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అనుచరులు కావడంతో వదిలేశారు. గురువారం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు దృష్టికి స్థానికులు సమస్యను తీసుకెళ్లారు. దీంతో ఆమె పరిశీలించారు. ఈక్రమంలో మాన్సాస్‌ అధికారుల ఫిర్యాదుతో వాటిని కూల్చేశారు. దారి మళ్లించి ఏర్పాటు చేసిన కాలువను సైతం తొలగించినట్లు సహాయక సిటీ ప్లానర్‌ మధుసూదనరావు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. తమ స్థలం ఆక్రమించినవారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని మాన్సాస్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని