logo

కోరలు చాస్తూ.. ప్రాణాలు తీస్తున్నాయ్‌!!

గుర్ల మండలం గుజ్జంగివలసకు చెందిన లక్ష్మి(58) కిరాణా దుకాణం నడుపుతూ జీవనోపాధి పొందుతున్నారు.

Published : 29 Jun 2024 03:08 IST

పెరుగుతున్న పాముకాటు బాధితులు

  • గుర్ల మండలం గుజ్జంగివలసకు చెందిన లక్ష్మి(58) కిరాణా దుకాణం నడుపుతూ జీవనోపాధి పొందుతున్నారు. బుధవారం సంచిలోని సరకులు సర్దుతుండగా అప్పటికే అందులో ఉన్న పాము కాటేయడంతో   విజయనగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఇదే మండలంలో వారం కిందట మరో మహిళ సైతం సర్పానికి బలయ్యారు.
  • జామి గ్రామానికి చెందిన ఎ.వెంకటరమణ (48) వ్యవసాయదారు. సోమవారం తన పొలంలో కూరగాయల మొక్కలకు మందు  పిచికారీ చేస్తుండగా కాలితో పామును తొక్కడంతో కాటేసింది.  బాధితుడిని స్థానికులు ప్రాథమిక  ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
  • ఇటీవల గజపతినగరానికి చెందిన ఓ వ్యక్తి పొలానికి వెళ్లి గట్టుపై స్పృహతప్పి పడిపోయారు.  రక్తపోటు అనుకొని కుటుంబ సభ్యులు నగరంలోని  ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పాము కాటేసినట్లు వైద్యులు ఆలస్యంగా గుర్తించారు.  అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారు.

 న్యూస్‌టుడే,విజయనగరం వైద్యవిభాగం

ఉమ్మడి జిల్లాలో ఇటీవల పాము కాటు మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాతావరణంలో మార్పులు, వర్షాలు పడుతుండడం, రైతులు, వ్యవసాయ కూలీలంతా పొలాలకు వెళుతుండడంతో అక్కడ సర్పాలకు బలవుతున్నారు. ఏటా ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రిల్లో మందులు, ఇంజెక్షన్లు ఉన్నాయని చెబుతున్నా జిల్లా ఆసుపత్రులకు రిఫరల్‌ కేసులు వస్తూనే ఉన్నాయి. ఈక్రమంలో సకాలంలో వైద్యం అందక కొందరు మృత్యువాత పడుతున్నారు. విజయనగరం మహారాజ, పార్వతీపురంలోని జిల్లా ఆసుపత్రులకు వారంలో కనీసం ఆరు నుంచి ఏడుగురు బాధితులు వస్తున్నారు. వారంతా నిరుపేదలే కావడం గమనార్హం.

పెద్దఎత్తున కేసులు..

2014 నుంచి ఈ ఏడాది మే నెల వరకు 4,447 పాము కాటు కేసులు నమోదయ్యాయి. వీరిలో 30 శాతం మంది వరకు చనిపోయారు. సకాలంలో వైద్యం అందక కొందరు ప్రాణాలు వదిలేశారు. కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం, సకాలంలో స్పందించకపోవడం, ప్రథమ చికిత్స తెలియకపోవడం, ఆసుపత్రులకు వెళ్లడంలో జాప్యం, రిఫరల్‌ కేసులు.. తదితర కారణాలతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది.

ఇలా గుర్తించాలి..

కరిచిన చోట రెండు కోరల గుర్తులుంటే విష సర్పం అని గ్రహించాలి. అలా కాకుండా అనేక పళ్లగాట్లు కనిపిస్తే సాధారణ పాముగా భావించాలి. ఊపిరి అందకపోవడం, చెమటలు పట్టడం తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. నోటి నుంచి నురగ వచ్చినా.. కండరాలు సక్రమంగా పనిచేయకపోయినా, కళ్లు మూసుకుపోతున్నా, వాంతులవుతున్నా ముప్పు పొంచిఉన్నట్లే. నోరు, ముక్కు, మూత్రం ద్వారా రక్తమొస్తే ప్రాణాపాయం తప్పదని గ్రహించాలి.

ప్రథమ చికిత్స తప్పనిసరి..

సకాలంలో ప్రథమ చికిత్స అందించడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు. రోగిని ముందు పడుకోబెట్టాలి. కాటేసిన భాగాన్ని కదపకుండా ఉంచాలి. సబ్బు నీళ్లతో శుభ్రంగా ఒకటి, రెండు సార్లు ఒత్తిడి లేకుండా కడగాలి. బాధితుడు ఊపిరి తీసుకుంటే పర్వాలేదు. అలా కాకపోతే కృత్రిమ శ్వాస అందించాలి. ఈలోపు అంబులెన్సుకు సమాచారం ఇవ్వాలి. నాటు వైద్యానికి దూరంగా ఉండాలి. పసర మందులు తాగించకూడదు.

అప్రమత్తత అవసరం..

ఇళ్ల పరిసరాలను శుభ్రం చేసుకుంటే సర్పాలు రావు. పొలాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. రాత్రి వేళల్లో బయటకు వెళితే పొడవాటి బూట్లు తొడగడం మంచిది. అన్ని ఆసుపత్రుల్లోనూ మందులు ఉన్నాయి. స్థానికంగానే చికిత్స పొందవచ్చు. వైద్యం ఆలస్యం చేస్తూ.. రిఫరల్‌ చేస్తే సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవు. 

 డా.ఎస్‌.భాస్కరరావు, డీఎంహెచ్‌వో, విజయనగరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని