logo

భార్యపై హత్యాయత్నం కేసులో నిందితుడికి జైలు, జరిమానా

మనస్ఫర్థలతో భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ బొబ్బిలి కోర్టు తీర్పునిచ్చింది.

Updated : 29 Jun 2024 04:02 IST

బాడంగి, న్యూస్‌టుడే: మనస్ఫర్థలతో భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ బొబ్బిలి కోర్టు తీర్పునిచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. బాడంగి మండలంలోని గజరాయునివలస గ్రామానికి చెందిన సూరిబాబు కొన్నేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన మహిళను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల తరువాత భార్యాభర్తల మధ్య మనస్ఫర్థలు వచ్చాయి. ఈక్రమంలో తరచూ గొడవలు జరిగేవి. దీంతో 2021, జులై నెలలో ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆ ఘటనపై అప్పటి బాడంగి ఎస్సై నరేష్‌ కేసు నమోదు చేసి, నిందితుడ్ని అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. నిందితుడు నేరం ఒప్పుకోవడంతో హింస, హత్యాయత్నం కేసులపై జైలు శిక్షలు, జరిమానా విధిస్తూ బొబ్బిలి కోర్టు తీర్పు ఇచ్చినట్లు పీపీ మజ్జి జగన్నాథరావు, ఏఎస్సై డి.కొండలరావు శుక్రవారం తెలిపారు. రెండు శిక్షలనూ ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


విద్యుదాఘాతంతో ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌ దుర్మరణం

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో ఉన్న ఎలక్ట్రీషియన్‌ విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన ఘటన మండలంలోని సారిపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ డి.రామగణేష్‌ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బోనుమహంతి విజయ్‌కుమార్‌(28) ఎలక్ట్రీషియన్‌గా ఉంటూ ఉపాధి పొందుతున్నాడు. ఉదయం గ్రామంలోని కిలారి విభీషణరావు ఇంటి మేడపైన ఉన్న పిట్ట గోడపై విద్యుత్తు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు అదుపు తప్పడంతో పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్తు తీగలకు తాకడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతన్ని వెంటనే ఆటోలో జిల్లా కేంద్రాసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని