logo

వినిపించలేదు.. కనిపించలేదు

తోటపల్లి జలాశయం నుంచి ఈ ఏడాది ఖరీఫ్‌ సాగుకు సంబంధించి నీటి విడుదలకు అధికారులు సిద్ధమయ్యారు. చివరి ఆయకట్టు వరకు జలాలు వెళ్లేలా చూడాల్సిన బాధ్యత వారిపై ఉంది.

Published : 28 Jun 2024 05:51 IST

గత ప్రభుత్వంలో తోటపల్లి నిర్వహణ గాలికి
కనీసం లస్కర్లనూ నియమించలేదు 

తోటపల్లి జలాశయం నుంచి ఈ ఏడాది ఖరీఫ్‌ సాగుకు సంబంధించి నీటి విడుదలకు అధికారులు సిద్ధమయ్యారు. చివరి ఆయకట్టు వరకు జలాలు వెళ్లేలా చూడాల్సిన బాధ్యత వారిపై ఉంది. కొన్ని చోట్ల రైతులు అక్రమంగా ఇంజిన్లు పెట్టి తోడేయడం, మరికొన్ని చోట్ల కాలువలు దెబ్బతినడం లాంటి వాటిని పర్యవేక్షించేందుకు గతంలో లస్కర్లు ఉండేవారు. కానీ.. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ పట్టించుకోలేదు. దీంతో ఏటా శివారు ఆయకట్టుకు నీరు సక్రమంగా చేరని పరిస్థితి ఏర్పడింది. అక్కడ రైతులు వర్షాధారంపైనే పంటలు పండించుకునేవారు. లస్కర్ల అవసరాన్ని తెలియజేస్తూ జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపించినా వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ ఏడాదీ ఇబ్బందులు తప్పేలా లేవు. 

న్యూస్‌టుడే, పార్వతీపురం 

తోటపల్లి జలాశయం

తోటపల్లి నీటిని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చేతుల మీదుగా శుక్రవారం విడుదల చేయనున్నారు. ఇది ఎంత వరకు వెళ్తుంది.. ఎక్కడ గండి పడుతుందోనని అధికారులే ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఖరీఫ్‌ ప్రారంభానికి ముందే నీరు విడుదల చేసినా పంపిణీ సక్రమంగా చేయలేకపోయారు. ఉమ్మడి జిల్లాలో 2022 సీజన్‌ కంటే 8 వేల ఎకరాల తక్కువ విస్తీర్ణంలో గతేడాది నీరు సరఫరా అయ్యింది. రూ.120 కోట్లతో తోటపల్లి జలాశయంలో అసంపూర్తి పనులు చేపట్టగా బిల్లులు ఇవ్వక గుత్తేదారు మధ్యలో వదిలి వెళ్లిపోయారు. వీటిని పూర్తి చేయాలనే ఆలోచన కూడా గత ప్రభుత్వానికి రాకపోవడంతో రైతులు నష్టాల బారిన పడుతున్నారు.   

గతేడాది బొబ్బిలి మండలం అలజంగి వద్ద కుడి ప్రధాన కాలువకు పడిన గండి  

రూ.1.08 కోట్లతో ప్రతిపాదించినా.. 

తోటపల్లి జలాశయం నీటి పంపిణీ వ్యవస్థ మెరుగుపడాలంటే 120 మంది లస్కర్లు అవసరం. ఖరీఫ్‌ సీజన్‌లో నాలుగైదు నెలల పాటు వీరి సేవలు అవసరమవుతాయి. 118 కిలోమీటర్ల ప్రధాన కాలువతో పాటు పిల్ల, పంట కాలువలు వందల కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి. వాటిలో నీటి పారుదలలో ఎదురయ్యే సమస్యలు ఇంజినీరింగ్‌ అధికారులకు తెలియాలంటే లస్కర్లే కీలకం. విజయనగరం ప్రాంతంలో వీరి అవసరం తీర్చేందుకు ఏడాదికి రూ.80 లక్షలు, పార్వతీపురం డివిజన్‌లో రూ.28 లక్షలు అవసరమని రెండు మూడేళ్లుగా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేస్తున్నా ఎలాంటి స్పందన లేదు.  

స్పందించని గత ప్రభుత్వం 

ప్రధాన కాలువ 22 కిలోమీటర్ల వరకు దుర్భరంగా ఉందని ఇంజినీరింగ్‌ అధికారులు నివేదికలిచ్చారు. పూర్తిస్థాయిలో మెరుగుపర్చకపోతే నీరు విడుదల చేయడం కష్టమని నివేదికలో పేర్కొన్నారు. పూడిక తీసి, అవసరమైన చోట కాంక్రీటు పనులు చేసేందుకు రూ.99.25 కోట్లు అవసరమని గత వైకాపా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై ఎవరూ కనీసం స్పందించలేదని అధికారులు చెబుతున్నారు. కాలువల్లో పూడిక తీతకు రూ.10 కోట్లు తక్షణమే కావాలని కోరినా గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. 

గండ్లు పడుతూనే ఉన్నాయి

లస్కర్ల పర్యవేక్షణ కొరవడటంతో నీరు విడుదల చేసిన వారం, పది రోజుల్లోనే గండ్లు పడిన ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. బాలగుడబ, చినగుడబ సమీపంలో, అలజంగి, తెర్లాం ప్రాంతాల్లోనూ కాలువలకు గండ్లు పడి నీరు పొలాల్లోకి చొచ్చుకుపోయింది. దీంతో ఆయా ప్రాంతాల్లో పంటలు పాడవడంతో పాటు శివారు ప్రాంతాలకు నీరు చేరక ఇబ్బందులు ఎదురయ్యాయి. 

ప్రస్తుతం ఒక్కరూ లేరు 

తోటపల్లి జలాశయం పరిధిలో పని చేసేందుకు 120 మంది లస్కర్లు అవసరం. ప్రస్తుతం ఒక్కరు కూడా లేరు. కొత్తగా నియమించి వేతనాలు ఇచ్చేందుకు విజయనగరం డివిజన్‌కు సంబంధించి రూ.80 లక్షలు, పార్వతీపురం డివిజన్‌కు రూ.28 లక్షలతో ప్రతిపాదనలు పంపించినా మంజూరు కాలేదు. కాలువల్లో పూడిక తీసేందుకు ఉపాధి పథకంలో పనులు చేపట్టాలని మంత్రి సంధ్యారాణి సూచించారు. ఆ దిశగా చర్యలు చేపడతాం.  

రామచంద్రరావు, తోటపల్లి ఈఈ, పార్వతీపురం, విజయనగరం డివిజన్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని