logo

కాల్వలకు మోక్షం.. కర్షకులకు సుభిక్షం

పంట కాలువలకు మోక్షం కలగనుంది. ప్రస్తుత ఖరీఫ్‌లోనే పనులు చేసేందుకు ప్రతిపాదనలు యుద్ధప్రాతిపదికన ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో ఇంజినీర్లు సమాయత్తమయ్యారు.

Published : 28 Jun 2024 05:46 IST

పూడిక తొలగింపునకు అంచనాల తయారీకి ఆదేశం

తుప్పలతో నిండిన వెంగళరాయ కుడి ఉప కాలువ  

బొబ్బిలి, న్యూస్‌టుడే: పంట కాలువలకు మోక్షం కలగనుంది. ప్రస్తుత ఖరీఫ్‌లోనే పనులు చేసేందుకు ప్రతిపాదనలు యుద్ధప్రాతిపదికన ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో ఇంజినీర్లు సమాయత్తమయ్యారు. అత్యవసర పనుల కింద కొంతమేర చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నారుమడులు జులై నెలాఖరుకు సిద్ధమయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఆగస్టు మొదటి వారంలో ఉభాలు సాగుతాయి. ఈ మధ్యలో ఉన్న నెల రోజుల వ్యవధిలో పనులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంతలో వర్షాలు ఎంత మేరకు సహకరిస్తాయన్నదే ప్రశ్న. ఇప్పటికే రుతుపవనాల ప్రభావంతో వారం రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. జేసీబీల సాయంతోనే పనులు జరగాల్సి ఉంది.

ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వ హయాంలో పంట కాలువల్లో పూడికతీత పూర్తిస్థాయిలో జరగలేదు. ఉపాధి హామీ పథకంలో అంతంతమాత్రంగా చేపట్టి చేతులు దులుపుకొన్నారు. జల వనరుల శాఖ వద్ద నిధులు లేక అధికారులు చేతులెత్తేశారు. దీంతో సగం ఆయకట్టుకు కూడా నీరందక ఏటా రైతులు అవస్థలు పడ్డారు. ప్రభుత్వం మారాక కాలువల్లో పూడికతీతపై ప్రత్యేక దృష్టి సారించారు. 

ప్రాజెక్టుల వారీ అంచనాలు

ప్రాజెక్టుల వారీగా కాలువల్లో పూడిక తొలగించేందుకు ఎంత మేర నిధులు అవసరమో అంచనాలు తయారు చేయాలని ఎస్‌ఈ రాజరాజేశ్వరి రెండు రోజుల కిందట సర్కిల్‌ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి వెంటనే సిద్ధం చేయాలని ఈఈ, డీఈఈ, ఏఈలను ఆదేశించారు. జంఝావతి, పెద్దగెడ్డ, వట్టిగెడ్డ, వెంగళరాయ, పెద్దగెడ్డ, పారాది, గొలుసుమెట్ట జలాశయాల గురించి చర్చించారు. అన్ని చోట్లా పూడిక తీయాలని ఇంజినీర్లకు సూచించారు. ఒక్కో జలాశయం పరిధిలో కుడి, ఎడమ ప్రధాన కాలువల్లో పూడిక తీయాలంటే సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని ఇంజినీర్లు ప్రాథమికంగా చెప్పారు. ఏది ఏమైనా అంచనాలు తయారు చేస్తే ఆ మేరకు ఉన్నతాధికారులకు నివేదించాలని ఎస్‌ఈ సూచించారు. ప్రస్తుతం అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పూడిక తొలగింపునకు ఎన్ని నిధులు అవసరమో అంచనాలు తయారు చేయాలని సూచించామని ఎస్‌ఈ రాజరాజేశ్వరి ‘న్యూస్‌టుడే’తో అన్నారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని