logo

ప్రతి ఎకరాకూ సాగునీరు

జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ద్వారా చివరి ఆయకట్టుకూ నీరందించే ప్రణాళికతో ముందుకెళ్లాలని జల నవరుల శాఖ అధికారులను కలెక్టర్‌ డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఆదేశించారు.

Published : 28 Jun 2024 05:40 IST

జల వనరుల శాఖ సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అంబేడ్కర్‌  

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ద్వారా చివరి ఆయకట్టుకూ నీరందించే ప్రణాళికతో ముందుకెళ్లాలని జల నవరుల శాఖ అధికారులను కలెక్టర్‌ డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఆదేశించారు. విజయనగరంలోని తన ఛాంబర్లో గురువారం సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి, ఖరీఫ్‌ సీజన్‌లో నీటి లభ్యత తదితర అంశాలపై ఇంజినీర్లతో సమీక్షించారు. కాలువల్లో పూడికతీత పనులు చేపట్టకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ముఖ్య ఇంజినీరు ఎస్‌.సుగుణాకరరావు వివరించారు. బాగుచేసేందుకు రూ.4.30 కోట్లు అవసరమని తెలిపారు. రాష్ట్రస్థాయి అధికారులతో సంప్రదించి మంజూరు చేయిస్తానని ఈ సందర్భంగా కలెక్టర్‌ భరోసానిచ్చారు. తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణలో పెండింగ్‌ అంశాలను సంబంధిత అధికారులతో సమీక్షిస్తానన్నారు. జులై ఒకటో తేదీ నుంచి తాటిపూడి, మడ్డువలస ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తామని చెప్పారు. 

4 దశల్లో రోడ్ల మరమ్మతులు 

రోడ్లు భవనాల శాఖ ఆధీనంలో ఉన్న 1505 కిలోమీటర్లలో గుంతలు పడిన వాటికి నాలుగు దశల్లో మరమ్మతులు చేసి, ప్రజల ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆ శాఖ పర్యవేక్షక ఇంజినీరు విజయరత్నానికి సూచించారు. పారాది వంతెన పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గుత్తేదారుకు నోటీసు జారీ చేసి, ఎప్పటి నుంచి పనులు మొదలు పెడతారో తెలుసుకోవాలని స్పష్టం చేశారు. రాజాంలో రోడ్ల విస్తరణ, అన్ని నియోజకవర్గాల్లో మరమ్మతులకు సంబంధించి నివేదిక అందజేయాలన్నారు.

చెత్త సేకరణ తప్పనిసరి..

అన్ని పంచాయతీల్లో చెత్తసేకరణ తప్పనిసరి అని కలెక్టర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం 200 పంచాయతీల్లోనే ప్రక్రియ సాగుతోందని డీపీవో శ్రీధర్‌రాజా తెలపగా, 15 రోజుల్లో అన్నిచోట్లా నిర్వహించాలని ఆయనను ఆదేశించారు. నిధుల లభ్యత, పెండింగ్‌ బిల్లుల వివరాలు తెలుసుకున్నారు. జల్‌జీవన్‌ మిషన్‌ లక్ష్యాలను వందశాతం చేరుకునేలా ప్రణాళిక రూపొందించాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ఉమాశంకర్‌కు చెప్పారు.

ఉపాధి.. అభివృద్ధి

ఎన్‌ఆర్‌జీఎస్‌ పథకాన్ని కేవలం కూలీల ఉపాధి కల్పనకే పరిమితం చేయకుండా.. అభివృద్ధికి ఉపయోగపడేలా చూడాలన్నారు. గ్రామాల అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని పేర్కొన్నారు. సాగుకు ఉపయోగపడే నీటి వనరులు, కాలువల బాగు, రహదారుల అభివృద్ధి, ఉద్యానవనాలు పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. 3 నుంచి 6 ఏళ్ల వయసు లోపుగల పిల్లలంతా అంగన్‌వాడీల్లో ఉండాలన్నారు. రక్తహీనత ఉన్న వారికి పోషకాహారం, మందులు అందించాలని, అనాథ పిల్లలను శిశుగృహాల్లో చేర్పించాలన్నారు. రెండు వారాల్లో టిడ్కో గృహాలను ప్రారంభించాలని ఆదేశించారు. అక్కడ మౌలిక వసతుల కల్పన పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని