logo

పింఛను.. ఇంటికొస్తోంది!!

వచ్చే నెల నుంచి పింఛను నగదు లబ్ధిదారుల ఇంటికే చేరనుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. జులై 1న సోమవారం ఉదయమే పూర్తిస్థాయిలో పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 28 Jun 2024 05:37 IST

తొలిరోజే పంపిణీకి ఏర్పాట్లు
ఇతర రాష్ట్రాల్లో ఉంటే ఖాతాల్లో జమ

గతంలో ఇంటికి వెళ్లి లబ్ధిదారురాలికి పింఛన్‌ ఇస్తున్న సంక్షేమ కార్యదర్శి

విజయనగరం మయూరికూడలి, కొత్తవలస, న్యూస్‌టుడే: వచ్చే నెల నుంచి పింఛను నగదు లబ్ధిదారుల ఇంటికే చేరనుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. జులై 1న సోమవారం ఉదయమే పూర్తిస్థాయిలో పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైకాపా హయాంలో ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలామందికి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడంతో ఎండల్లో తిరగలేక అవస్థలు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం నిర్ణయంతో ఇక నుంచి వారి కష్టాలు తీరనున్నాయి.
పింఛన్ల పంపిణీ ప్రక్రియను కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఆధ్వర్యంలో నగదు పంపిణీ సాగనుంది. ఒక్కొక్కరికీ 50 చొప్పున పింఛనుదారులు ఉండేలా చూస్తున్నారు. ఒకేవేళ మించితే ఇతర విభాగాల వారిని అనుసంధానం చేయనున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 974 సచివాలయాలున్నాయి. వాటిల్లో 8,766 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,27,286 మంది(విజయనగరం- 2,82,194, మన్యం- 1,45,092) లబ్ధిదారులున్నారు. ఒక్కొక్క ఉద్యోగి 50 మందికి అందించాలి. అయితే కొన్నిచోట్ల తక్కువ మంది సిబ్బంది ఉన్నారు. అలాంటి చోట్ల అవసరం మేరకు ఒకరిద్దరిని కేటాయించనున్నారు. 

లబ్ధి ఇలా..

వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, హెచ్‌ఐవీ బాధితులు, హిజ్రాలకు మూడు నెలల ఎరియర్స్‌తో కలిపి రూ.7 వేలు అందనుంది. దివ్యాంగులకు రూ.15000, కుష్ఠుతో వైకల్యం వచ్చిన వారికి రూ.6000, కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్‌ దశకు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్థులకు రూ.10,000, మంచానికి పరిమితమైన వారికి రూ.15 వేలు ఇవ్వనున్నారు. ఈ మేరకు రెండు జిల్లాల్లో వచ్చే నెలలో అందించేందుకు రూ.278.03 కోట్లు కావాలని పీడీ వెల్లడించారు. ప్రభుత్వం నుంచి నగదు రాగానే.. మండలాలు, బ్యాంకుల వారీగా పంపించనున్నామన్నారు. ఇళ్ల వద్ద ఉండే వారికి ఉదయం 9 గంటల్లోపే ఇస్తారని, లబ్ధిదారులు ఇతర రాష్ట్రాల్లో ఉంటే ఖాతాల్లో వేయనున్నామని తెలిపారు.

అదనపు సేవలు వీరికే 

సచివాలయాల సిబ్బంది సరిపోకపోతే గ్రామస్థాయిలో ఉన్న ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు, వెలుగు వీవోఏ (గ్రామ సంఘ సహాయకులు), సీసీ (కమ్యూనిటీ కో-ఆర్డినేటర్‌)లు, వీఆర్‌ఏలు, ఆశాలు, అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరుల సేవలను వినియోగించుకోనున్నారు.  ఈ మేరకు ఆ రోజు అందుబాటులో ఉండాలని సంబంధిత విభాగాల అధికారుల ద్వారా ఆదేశాలు జారీ చేసినట్లు డీఆర్డీఏ పీడీ కల్యాణ్‌ చక్రవర్తి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని