logo

గిరిజనుల గుండెల్లో గోస్తనీ గుబులు

వంతెన సౌకర్యం లేక గంట్యాడ మండలం దిగువ కొండపర్తి పంచాయతీ పరిధిలోని గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు.

Published : 28 Jun 2024 05:33 IST

దాసరితోట వంతెన పూర్తికాక నరకం

అసంపూర్తి వంతెన కింద గోస్తనీ నదీ ప్రవాహంలో చిక్కుకున్న ఆటోను ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్న స్థానికులు

వంతెన సౌకర్యం లేక గంట్యాడ మండలం దిగువ కొండపర్తి పంచాయతీ పరిధిలోని గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు. వీరంతా ఎస్‌.కోట మండలంతో పాటు అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా అనంతగిరి మండలంలోని దాసరితోట వద్ద గోస్తనీ నదిని దాటాల్సిందే. ఇక్కడ రెండేళ్ల కిందట రహదారి, వంతెన నిర్మాణానికి రూ.11 కోట్లు కేటాయించారు. వంతెన పనులు ప్రారంభించినప్పటికీ, నిధులు విడుదల కాక 20 శాతం పనులు వదిలేశారు. దీంతో వారధి ఉన్నప్పటికీ, నదిని దాటలేక నీటిలో దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాహనాలు ప్రమాదకరంగా నదిలో దిగి అవతలి ఒడ్డుకు చేరుకుంటున్నాయి. గురువారం వర్షం కారణంగా ఏటిలోకి దిగిన ఓ ఆటో మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో గిరిజనులు భయంతో నదిలో దిగి ఒడ్డుకు చేరుకున్నారు. తరువాత స్థానికులు అతికష్టం మీద వాహనాన్ని ఒడ్డుకు చేర్చారు. గతేడాది మన్యం జిల్లాకు చెందిన ముగ్గురు గిరిజనులు ఏరు దాటుతుండగా గల్లంతయ్యారు. వంతెన సౌకర్యం లేక అత్యవసర వైద్య సహాయం కూడా అందని పరిస్థితి నెలకొంది. పనులు పూర్తి చేసి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

న్యూస్‌టుడే, గంట్యాడ, గంట్యాడ గ్రామీణం

వంతెనల పూర్తికి వినతి 

పూర్తికాని సీతానగరం వారధి 

పార్వతీపురం పట్టణం, సీతానగరం: జిల్లాలో అసంపూర్తిగా ఉన్న వంతెనలను పూర్తి చేయాలని గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణికి వాసవీ లారీ ఓనర్ల సంఘాధ్యక్షుడు జి.రమణమూర్తి వినతిపత్రం అందజేశారు. ఒడిశా వెళ్లేందుకు పారాది, సీతానగరం, కోటిపాం ప్రాంతాల్లో ఉన్న వంతెనలు దాటాల్సి ఉందన్నారు. అప్పట్లో పది టన్నుల సామర్థ్యంతో వీటిని నిర్మించారని, ప్రస్తుతం 60 టన్నుల బరువుతో లారీలు నడుస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెప్పారు. పారాది వద్ద నిర్మించిన కాజ్‌వే నదిలో కొట్టుకుపోయినట్లు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఒడిశా వెళ్లేందుకు అదనంగా వంద కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని