logo

కక్షతో చంపేంత పనిచేశారు

శ్రీకాకుళం జిల్లా గుజరాతీపేటకు చెందిన గౌతమ్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 28 Jun 2024 05:27 IST

రాజాం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా గుజరాతీపేటకు చెందిన గౌతమ్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను ఎస్సై శంకర్‌తో కలిసి సీఐ శ్రీనివాస్‌ వెల్లడించారు. గురవాంకు చెందిన కె.నవీన్‌ బృందానికి గొల్లవీధికి చెందిన యువకులకు మధ్య ఈనెల 25న స్థానికంగా గొడవ జరిగింది. గొల్లవీధికి చెందిన యువకులు తప్పించుకుని ద్విచక్రవాహనాలపై వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. వీరిలో గౌతమ్, కార్తీక్‌ ఒకే బైక్‌పై ఉన్నారు. వెంటాడిన నవీన్‌.. గౌతమ్‌పై ఉమ్మేయడంతో అతడు ప్రశ్నించాడు. దీంతో తన స్నేహితులతో కలిసి కర్రలు, కత్తులతో దాడికి యత్నించాడు. బైక్‌తో సహా అతడ్ని పాలకొండ  రహదారిలోని మామిడి తోటల్లోకి తీసుకెళ్లారు. దుస్తులు విప్పి ప్లాస్టిక్‌ పైపులు, బెల్టుతో చావగొట్టారు. బెల్టును గొంతుకు బిగించి హత్యాయత్నానికి ఒడిగట్టారు. జనం అలికిడితో సమీపంలోని కొర్లవలస కూడలికి తీసుకెళ్లారు. ఈలోపు మిగిలిన బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు వెళ్లేసరికి.. రోడ్డుపై వదిలేసి నిందితులు పరారయ్యారు. బాధితుడ్ని రాజాంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో 14 మంది నిందితులున్నట్లు గుర్తించారు. వీరిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. 11 మందిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ తెలిపారు. నిందితులపై హత్యాయత్నంతో పాటు, ఇతర నేరాలకు సంబంధించి కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని