logo

అసభ్య సందేశాలు పంపిస్తున్నాడని..కిడ్నాప్‌ చేసి మూత్రం తాగించారు!

మహిళలకు అసభ్యకరమైన సందేశాలు ఫోన్‌ ద్వారా పంపుతున్నాడని కోపంతో నగరానికి చెందిన వ్యాపారవేత్తను కిడ్నాప్‌ చేసి అతడికి మూత్రం తాగించి..

Published : 26 Jun 2024 05:53 IST

నిందితులంతా రాజస్థాన్‌ వాసులు

వివరాలు వెల్లడిస్తున్న సీఐ బి.వెంకటరావు 

విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: మహిళలకు అసభ్యకరమైన సందేశాలు ఫోన్‌ ద్వారా పంపుతున్నాడని కోపంతో నగరానికి చెందిన వ్యాపారవేత్తను కిడ్నాప్‌ చేసి అతడికి మూత్రం తాగించి.. విడిచిపెట్టి.. ఆ దృశ్యాలను సోషల్‌ మీడియా పెట్టిన ఘటన ఇటీవల చోటు చేసుకుంది. నగరంలో సంచలనం సృష్టించిన ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరికొందరు పరారీలో ఉన్నారు. ఈ మేరకు వివరాలను ఒకటో పట్టణ సీఐ బి.వెంకటరావు మంగళవారం రాత్రి వెల్లడించారు. రాజస్థాన్‌ నుంచి వచ్చిన ఒక వ్యాపారి నగరంలో స్టీల్, స్టౌ మెటల్‌ వ్యాపారం చేస్తున్నారు. ఆ రాష్ట్రంలోని ఆయన స్వగ్రామానికి చెందిన బిజలా రాం, మరికొందరు ఈ నెల 14న విజయనగరం వచ్చారు. వ్యాపారితో మాట్లాడి కారులో ఎక్కించుకుని వై-కూడలి వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ కొద్దిసేపు మాట్లాడాక అందరూ కలిసి మద్యం తాగారు. తమ ఆడవారికి అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడనే నెపంతో వ్యాపారిని తీవ్రంగా కొట్టి బలవంతంగా కారులో బెంగుళూరు తీసుకువెళ్లేందుకు బయలుదేరారు. మార్గమధ్యలో కారు ఆపి, ఒక బాటిల్‌లో మూత్రం పట్టి వ్యాపారితో బలవంతంగా తాగించి, దాన్ని వీడియో తీశారు. అతడి స్నేహితుడికి ఫోన్‌ చేయించి, అతడి నుంచి బలవంతంగా రూ.35 వేలు తీసుకొని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి విడిచిపెట్టి పరారయ్యారు. వ్యాపారి ఇంటికి చేరుకొని ఎటువంటి ఫిర్యాదు చేయకుండా ఉండిపోయాడు. మూత్రం తాగించిన దృశ్యాలు రాజస్థాన్‌ సోషల్‌ మీడియాలో రావడంతో ఈ నెల 22న బాధితుడు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఒకరైన దేవాసీ నజీరాంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మిగిలిన నిందితులైన బిజలా రాం, దిలీప్‌లను త్వరలోనే అరెస్టు చేస్తామని సీఐ బి.వెంకటరావు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ఎస్సై తారకేశ్వరరావు ప్రతిభ చూపారని సీఐ అభినందించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని