logo

29 కిలోల గంజాయి స్వాధీనం

విజయనగరం రైల్వే స్టేషన్‌లో జీఆర్‌పీˆ పోలీసులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Published : 26 Jun 2024 04:58 IST

వివరాలు వెల్లడిస్తున్న రైల్వే జీఆర్‌పీ సీఐ వెంకటరావు 

విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: విజయనగరం రైల్వే స్టేషన్‌లో జీఆర్‌పీˆ పోలీసులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 29 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాగుల్లో పెట్టుకొని ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన అన్షు, శివ రైలు కోసం వేచి ఉండగా దొరికిపోయారు. వీరికి గంజాయి కొనుగోలు చేసి ఇచ్చి, జాగ్రత్తగా ఆగ్రా చేర్చాలని దిల్లీకి చెందిన ఒకరు బేరం కుదుర్చుకున్నట్లు సీఐ వెంకటరావు తెలిపారు. వీరు దొరికిపోవడంతో అతడు పరారయ్యాడని, ఆ వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. వీరిని రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ రవివర్మ తెలిపారు. రైళ్లల్లో గంజాయి రవాణా నియంత్రణకు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామన్నారు. 


పురుగు మందు తాగి ఉద్యోగి బలవన్మరణం

పూసపాటిరేగ, న్యూస్‌టుడే: మండలంలోని వెల్దూరు గ్రామానికి చెందిన బాకి అర్జున్‌ రెడ్డి(38) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ సన్యాసినాయుడు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్ సమీపంలో ఓ ప్రైవేటు కంపెనీలో అర్జున్‌ రెడ్డి పనిచేస్తున్నాడు. మద్యానికి బానిస కావడంతో కొంతకాలంగా కడుపులో నొప్పితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. గత రెండు రోజల నుంచి ఇంటికి రాకపోవడంతో అంతటా వెతికిన జాడ లేదు. గ్రామ సమీపంలో ఓ తోటలో పురుగు మందు తాగి మృతి చెంది ఉన్నట్లు మంగళవారం గుర్తించారు. ఘటన స్థలానికి ఎస్‌ఐ సన్యాసినాయుడు వెళ్లి పరిశీలించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం భోగాపురం సీహెచ్‌సీకి తరలించారు. మృతుని తల్లి సన్యాసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి ఇతనికి భార్య అరుణ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి యజమాని మృతి చెందడంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది.


దొంగతనం నేరంలో ఇద్దరి అరెస్టు

కొత్తవలస, న్యూస్‌టుడే: మండలంలోని గులివిందాడ సమీపంలో హరిత రహదారి  పనులు చేస్తున్న ఎన్‌కేసీ ప్రాజెక్టుకు చెందిన పొక్లెయిన్‌ సామగ్రిని అపహరించిన కేసులో ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి జ్యుడీషియల్‌ కస్టడీకి మంగళవారం తరలించినట్లు ఎస్సై సుదర్శన్‌ తెలిపారు. విశాఖ జిల్లా భీమన్నదొరపాలెం పంచాయతీ శివారు బంటుమెరకకి చెందిన రౌతు అప్పలరాజు, బంటు గోవిందరాజు, మరో ఇద్దరు కలసి 24న రాత్రి చోరీకి పాల్పడ్డారన్నారు. రూ.లక్ష విలువచేసే సొత్తును ఆటోలో తరలిస్తుండగా ఇద్దరిని పట్టుకుని స్వాధీనం చేసుకున్నామన్నారు. కొత్తవలస కోర్టులో నిందితుల్ని హాజరుపర్చగా.. న్యాయమూర్తి విజయచందర్‌ వారికి 15 రోజులు రిమాండు విధించినట్లు వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని