logo

ఆర్భాటమే మిగులు.. ఆచరణ కానరాలేదు

వ్యవసాయంలో యాంత్రీకరణ విధానాన్ని తీసుకువచ్చి సాగు ఖర్చులు తగ్గిస్తామని, డ్రోన్ల విధానంతో రైతులకు ప్రయోజనం చేకూరుస్తామని గత వైకాపా ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది.

Published : 26 Jun 2024 04:08 IST

ప్రారంభం కాని కిసాన్‌ డ్రోన్‌ సేవ
అమలులో విఫలమైన వైకాపా

డ్రోన్ల వినియోగంపై యువతకు వ్యవసాయశాఖ అధికారులు శిక్షణ ఇస్తున్న దృశ్యం (పాతచిత్రం)

బొబ్బిలి, పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: వ్యవసాయంలో యాంత్రీకరణ విధానాన్ని తీసుకువచ్చి సాగు ఖర్చులు తగ్గిస్తామని, డ్రోన్ల విధానంతో రైతులకు ప్రయోజనం చేకూరుస్తామని గత వైకాపా ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. రెండు ఖరీఫ్‌ సీజన్లు పూర్తయినా ఇంతవరకు డ్రోన్ల జాడలేదు. ప్రయోగాత్మకంగా ప్రతి మండలంలోనూ వీటిని అందుబాటులో ఉంచుతామని చెప్పుకొచ్చింది. అర్హులైన వారిని ఎంపిక చేసి శిక్షణ కూడా ఇచ్చింది. మూడో ఖరీఫ్‌ ఆసన్నమైనా ఎక్కడా అమలు కాకపోవడంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

లక్ష్యం ఇది

ఉమ్మడి జిల్లాలో సుమారు 40 వరకు డ్రోన్లు అవసరమని గుర్తించారు. మండలాల వారీ సుమారు 40 మంది యువతను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. అక్కడితో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. పెరిగిన సాగు ఖర్చులు.. ఎరువులు, క్రిమిసంహారక మందులు పిచికారీ సమయంలో కూలీల కొరతను అధిగమించేందుకు డ్రోన్ల విధానం తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఎకరా పొలానికి క్రిమిసంహారక మందు పిచికారీ చేయాలంటే ఇద్దరు కూలీలు అవసరం. రోజంతా పనే. అదే డ్రోన్‌ సాయంతో అయితే 20 నుంచి 25 నిమిషాల్లో పిచికారీ పూర్తవుతుంది. అంతేకాదు సాధారణ స్ప్రేయరుతో అయితే.. తరచూ ట్యాంకు నింపాలి.. అదే మోతాదులో మందు కలపాలి.. అనుభవం ఉన్న కూలీలు అవసరం. కానీ డ్రోన్‌ టెక్నాలజీËతో సేద్యం సులభతరం. దీన్ని ఇప్పటికైనా అమలులోకి తేవాలని రైతులు కోరుతున్నారు.

అన్నీ అడ్డంకులే..

రైతులతో సంఘాలను ఏర్పాటు చేసి వారి ద్వారా ఈ సేవలను అమలు చేసేందుకు వైకాపా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంఘాలకు డ్రోన్లు  బ్యాంకు రుణంతో అందజేసి.. అద్దెకు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపకల్పన చేశారు. తద్వారా వచ్చే ఆదాయంతో కమిటీల నిర్వహణ, బలోపేతం చేయాలన్నది ఉద్దేశం. ఆరంభంలోనే అమలుకు కొన్ని సమస్యలు అడ్డంకిగా నిలిచాయి. సంఘాల్లో డ్రోన్‌ ఆపరేట్ చేసే పైలట్‌ ఒకరు సభ్యులుగా ఉండాలన్న నిబంధనతో వ్యవసాయశాఖ అధికారులు ఇరకాటంలో పడ్డారు. బీఎస్సీ (అగ్రికల్చర్‌), ఇంజినీరింగు పట్టభద్రులు, వ్యవసాయంలో డిప్లమా ఇంజినీరింగు చేసిన వారు పైలట్గా ఉండాలనడంతో అభ్యర్థుల వెతుకులాటలో పడి, ఎలాగో అర్హులను గుర్తించి వ్యవసాయశాఖ అధికారులు శిక్షణ ఇచ్చారు. అయితే ప్రభుత్వం సకాలంలో డ్రోన్లు ఇవ్వక, సంఘాలు మార్జిన్‌ మనీ చెల్లించక పరికరాలు అందుబాటులోకి రాలేదు. ప్రతి మండలానికి ఒక డ్రోన్‌ ఇవ్వాలన్నది ఆలోచన.

చర్యలు చేపడుతున్నాం

డ్రోన్‌తో క్రిమిసంహారక మందులు పిచికారీతో సమయం, డబ్బు ఆదా అవుతుంది. సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం. ప్రభుత్వమే రుణాన్ని సమకూర్చి డ్రోన్లు ఇచ్చే ఆలోచనలో ఉంది. కొత్త ప్రభుత్వం దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే కొంతమంది యువతకు అవగాహన కల్పించి శిక్షణ ఇచ్చాం. 

వీటీ రామారావు, రాబర్ట్‌ పాల్, ఉమ్మడి జిల్లా వ్యవసాయాధికారులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని