logo

స్వామి సేవలు, భక్తుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యం

విశ్వప్రసిద్ధ పూరీ జగన్నాథుని రథయాత్రను ఎలాంటి అవాంతరాలు లేకుండా సేవాయత్‌లు నిర్ణీత వేళల్లో స్వామి సేవలు నిర్వహించాలని, అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌ మాఝి సూచించారు. రథయాత్ర నేపథ్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో ప్రభుత్వ సెలవులుగా ప్రకటించారు.

Published : 03 Jul 2024 03:16 IST

మోహన్‌చరణ్‌ అధ్యక్షతన సమన్వయ సంఘం భేటీ

ఉత్కళ ప్రమగ ఆవిష్కరిస్తున్న సీఎం, మంత్రులు, అధికారులు

గోపాలపూర్, న్యూస్‌టుడే: విశ్వప్రసిద్ధ పూరీ జగన్నాథుని రథయాత్రను ఎలాంటి అవాంతరాలు లేకుండా సేవాయత్‌లు నిర్ణీత వేళల్లో స్వామి సేవలు నిర్వహించాలని, అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌ మాఝి సూచించారు. రథయాత్ర నేపథ్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో ప్రభుత్వ సెలవులుగా ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం పూరీ టౌన్‌హాల్‌ సమావేశంలో రథయాత్ర చివరి సమన్వయ సంఘ సమావేశం జరిగింది. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రులు కనకవర్థన్‌ సింగ్‌దేవ్, ప్రభాతిపరిడ, మంత్రులు బిభూతి భూషణ్‌ జెనా (వాణిజ్య, రవాణా, ఉక్కు, గనులు) పృథ్వీరాజ్‌ హరిచందన్‌ (న్యాయ), ముఖేష్‌ మహాలింగ (ఆరోగ్యం), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్‌ అహుజా, డీజీపీ అరుణ్‌షడంగి, ఇతర ఉన్నతాధికారులు, వివిధ రంగాల ప్రముఖులు, 36 తెగల (ఛత్తీసా నియోగ్‌) సేవాయత్‌ ప్రతినిధులు, సేవాసంఘాల కార్యకర్తలు, పాత్రికేయులు, ఎన్‌సీసీ, స్కౌట్స్, గైడ్స్‌ పాల్గొన్నారు. కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ శ్రీక్షేత్రం కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ముడిపడి క్షేత్రమని, ఏడాదికోసారి జరిగే రథయాత్ర రాష్ట్ర ప్రతిష్ఠ, వైభవానికి అద్దం పడుతుందన్నారు. ఈసారి వేడుకలు తిలకించడానికి భక్తులు పెద్దసంఖ్యలో వస్తారన్న అంచనా ఉన్నందున అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. పారిశుద్ధ్యం, వైద్యసేవలు, మంచినీటి సరఫరా, వసతి, రాకపోకలు, భద్రతకు పెద్దపీట వేయాలన్నారు. రాష్ట్రపతి, కేంద్రమంత్రులు, వీవీఐపీలు పెద్దసంఖ్యలో వస్తున్నందున ఏర్పాట్లలో లోపాలు లేకుండా పర్యవేక్షించే బాధ్యత అధికారులు, పోలీసులు తీసుకోవాలన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న వివిధ రంగాల ప్రముఖులు, పాత్రికేయులు

నిష్ఠగా స్వామిసేవలు చేయాలి

జగన్నాథుని సేవలు నిష్ఠ, అంకితభావంతో చేపట్టాలని సీఎం సేవాయత్‌లను కోరారు. ఈసారి పురుషోత్తముని నవయవ్వన అవతారం, నేత్రోత్సవం రథయాత్ర ఒకరోజు నిర్వహించాల్సి ఉండగా సేవాయత్‌లపై అదనపు భారం ఉంటుందని, సమన్వయంతో సకాలంలో అన్నీ చేపట్టాలన్నారు. పురుషోత్తముని సేవలపైనే యాత్ర ఆధారపడినందున అపశృతులకు తావీయరాదన్నారు.

రథయాత్ర ప్రత్యేక సంచిక విడుదల

ఈ సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక సమాచార, పౌరసంబంధాలశాఖలు సంయుక్తంగా ముద్రించిన ‘ఉత్కళ ప్రమగ’ (రథయాత్ర ప్రత్యేక సంచిక) సీఎం, ఇతర మంత్రులు, అధికారులు వేదికపై విడుదల చేశారు. ప్రతులు రథయాత్ర నాడు పూరీలో చౌకధరలకు విక్రయిస్తారు.

గుండిచా మందిరం వద్ద ప్రదర్శన

సమావేశానంతరం మోహన్‌చరణ్‌ విలేకరులతో మాట్లాడుతూ రథయాత్ర జరిగే 7, 8 తేదీల్లో సెలవులు ప్రకటిస్తున్నామన్నారు. గుండిచా మందిరం వద్ద రథయాత్ర నుంచి తిరుగుయాత్ర వరకు సాంస్కృతిక శాఖ భక్తులు, యాత్రికుల కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రదర్శన చేడుతుందన్నారు. న్యాయశాఖ మంత్రి హరిచందన్‌ మాట్లాడుతూ... ఘోషయాత్రనను ప్రతిష్ఠగా తీసుకున్న ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని