logo

మరింత అందుబాటులోకి ఆధునిక వైద్య సేవలు

రాష్ట్రంలో సామాన్యవర్గ ప్రజలకు ఆధునిక వైద్యసేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సిటీస్కాన్, డయాలిసిస్, ఎంఆర్‌ఐ వంటి సేవలను అందించనున్నారు.

Updated : 03 Jul 2024 06:36 IST

రాష్ట్రవ్యాప్తంగా అన్ని సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో సీటీస్కాన్‌ సేవలు
పీపీపీ విధానం ద్వారా అమలుకు సర్కార్‌ నిర్ణయం

రోగికి సీటీ స్కాన్‌ పరీక్షలు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో సామాన్యవర్గ ప్రజలకు ఆధునిక వైద్యసేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సిటీస్కాన్, డయాలిసిస్, ఎంఆర్‌ఐ వంటి సేవలను అందించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ విధానం అమలుకు సర్కార్‌ నిర్ణయించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆధునిక వైద్యసేవలు మరింత చేరువకానున్నట్లు సర్కార్‌ భావిస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మీడియా ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం... సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో ఈ సేవలు అందించే ప్రోవైడర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నట్లు సమాచారం. ఒప్పందం ప్రకారం నియమితులైన వైద్యులు, నిపుణుల అర్హత, ఇతర అంశాలతోపాటు ఈ సేవలందించేందుకు సంబంధిత వ్యక్తులు పూర్తి అర్హులా కాదా అన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు.

వారంలోగా పంపించాలి

ఈ సేవలు సమకూర్చేందుకు నియమితులైనవారి పరిచయ, అర్హత పత్రాలను నిశితంగా పరిశీలించి వారం రోజుల్లోగా ఆరోగ్యశాఖకు పంపించాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. ఆ దిశగా అన్ని జిల్లాల ముఖ్య వైద్యం, ప్రజారోగ్య శాఖ అధికారులు, రాష్ట్ర సంచాలకులు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించినట్లు ఆ ప్రకటనలో వెల్లడించింది. వీటిని పరిశీలించే సమయంలో సంబంధిత వైద్యులు, నిపుణులు ప్రత్యక్షంగా సీడీఎంపీహెచ్‌వోల ముందు హాజరు కావాలని అందులో స్పష్టం చేసింది. రాష్ట్రంలో చాలా జిల్లా కేంద్రాసుపత్రుల్లో సీటీస్కాన్‌ సేవలు లేక రోగులు నానా అవస్థలు పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం శుభపరిణామంగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఆదివాసీ జిల్లాగా పేరొందిన రాయగడలో ఇవి ప్రజలకు మరింత దోహదపడనున్నాయి. తరచూ ఏదో ఒక అనారోగ్య సమస్యలతో వార్తల్లో నిలిచే కాశీపూర్, వెనుకబడిన సమితులుగా పేరొందిన చంద్రపూర్, మునిగుడకు ఈ విధానం అమలైతే ఎంతో ఉపయోగపడనున్నాయన్న వ్యాఖ్యలు అన్నిచోట్లా వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు