logo

త్వరలో బిజద సంస్థాగత ఎన్నికలు

బిజదలో కొన్నేళ్లుగా సంస్థాగత ఎన్నికల ఊసేలేదు. అధినేతగా నవీన్‌ అన్నీ తానై నడిపించారు. మరోవైపు వి.కార్తికేయ పాండ్యన్, ప్రణవ ప్రకాష్‌ దాస్‌ (బొబి)లు చక్రం తిప్పారు. ఫలితంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంది.

Published : 03 Jul 2024 03:12 IST

సీనియర్‌ నేతలకు కీలక బాధ్యతలు

సోమవారం రాత్రి బిజద మహిళా శాఖ ప్రతినిధులతో నవీన్‌

భువనేశ్వర్, న్యూస్‌టుడే: బిజదలో కొన్నేళ్లుగా సంస్థాగత ఎన్నికల ఊసేలేదు. అధినేతగా నవీన్‌ అన్నీ తానై నడిపించారు. మరోవైపు వి.కార్తికేయ పాండ్యన్, ప్రణవ ప్రకాష్‌ దాస్‌ (బొబి)లు చక్రం తిప్పారు. ఫలితంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంది. లోక్‌సభలో ఖాతా తెరవలేకపోయిన బిజద శాసనసభలో విపక్షానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఈ అయిదేళ్లు గట్టి కసరత్తు చేసి పార్టీకి పూర్వ వైభవం కల్పించే దిశగా నాయకత్వం కసరత్తు ప్రారంభించింది.

అనుభవజ్ఞులకు ముఖ్య పోస్టులు

గతంలో నవీన్‌ వద్ద నెంబర్‌ టుగా చలామణి అయిన దివంగత ప్యారీమోహన్‌ మహాపాత్ర్‌ బిజదను కేడర్‌గల పార్టీగా తీర్చిదిద్దడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. ఇంతలో నవీన్‌ లండన్‌ వెళ్లిన సమయంలో సీఎం పదవి చేజిక్కించుకోవడానికి కొంతమంది ఎమ్మెల్యేలతో అర్థరాత్రి ఆపరేషన్‌ చేపట్టి భంగపాటుకు గురై తెరమరుగయ్యారు. తర్వాత పాండ్యన్, బొబి పార్టీలో నవీన్‌ తర్వాత పెద్ద దిక్కుగా మారారు. సీనియర్‌ నేతలు నామమాత్రమయ్యారు. గడిచిన అయిదేళ్లు నవీన్‌కు, నేతలకు మధ్య దూరం పెరిగింది. ఎన్నికల్లో ఆయాప్రాంతాల సీనియర్‌ నాయకులు సూచనలు పరిగణలోకి తీసుకోకుండా పాండ్యన్‌ తెరవెనుక ఉండి టిక్కెట్లు కేటాయించారు. ఇది పార్టీకి నష్టం మిగిల్చింది. ఈసారి అనుభవజ్ఞలకు కీలక బాధ్యతలు అప్పగించనున్నారు.

అధ్యక్షునిగా మళ్లీ నవీనే

బిజద పరాజయం పాలైన తర్వాత నవీన్‌ మేలుకున్నారు. ఆయన వద్దకు జిల్లాలవారీగా నిత్యం నేతలొచ్చి కలుస్తున్నారు. అందరితో స్వయంగా మాట్లాడుతున్న నవీన్‌ వారి సూచనలు పరిశీలిస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి ప్రజలతో మమేకం కావాలని సూచిస్తున్నారు. త్వరలో సంస్థాగత ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాలిచ్చారు. నవీన్‌ మళ్లీ అధ్యక్షునిగా కొనసాగుతారు. ఉత్తరకోస్తా, దక్షిణ, పశ్చిమ ఒడిశా జిల్లాలకు కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమితులయ్యే అవకాశం ఉంది.

పార్టీ బలోపేతం చేస్తాం

బిజద ఉపాధ్యక్షుడు దేవీప్రసాద్‌ మిశ్ర సోమవారం రాత్రి భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడతూ పార్టీని బలోపేతం చేయడానికి నవీన్‌ సంకల్పించారని, సంస్థాగత ఎన్నికల తర్వాత కేడర్‌ గల పార్టీగా అవతరిస్తుందని పేర్కొన్నారు. అనుభవజ్ఞ్ఞుల సూచనల మేరకు శ్రేణులు ప్రజలతో మమేకమవుతాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని