logo

భయపెడుతున్న డెంగీ

రాష్ట్రంలో గతకొద్ది రోజులుగా ప్రబలుతున్న డెంగీ వ్యాధి ప్రజలను భయపెడుతోంది. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వ్యాధి మరింత విజృంభించే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Published : 03 Jul 2024 03:10 IST

24 జిల్లాల్లో తాజా కేసులు నమోదు
రాయగడ పట్టణం, న్యూస్‌టుడే

కాలువ లేకపోవడంతో ఇళ్ల పరిసరాల మధ్య నిలిచిన మురుగు నీరు

రాష్ట్రంలో గతకొద్ది రోజులుగా ప్రబలుతున్న డెంగీ వ్యాధి ప్రజలను భయపెడుతోంది. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వ్యాధి మరింత విజృంభించే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఇప్పటికే డెంగీ కేసులు 75 శాతం పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీనికితోడు 30 జిల్లాలున్న రాష్ట్రంలో ఆరు మినహా మిగతా 24 జిల్లాల్లో కేసులు నమోదు కావడం ఈ అనుమానాలను రెట్టింపు చేస్తోంది. పారిశుద్ధ్యం, దోమల నియంత్రణకు చర్యలు తీసుకోకపోవడం డెంగీ కేసులు పెరుగుదలకు ప్రధాన కారణాలన్న వాఖ్యలు వినిపిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో నిలుస్తున్న మురుగు నీరు, ఉద్యానవనాలు వంటి రద్దీ ప్రదేశాల్లో పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకోకపోవడం ఆయా ప్రాంతాలు డెంగీ కారక ఎడిస్‌ దోమల సంతతి పెరుగుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఆరోగ్యసేవల సంచాలకుడు బిజయ్‌ మహాపాత్ర్‌ మాట్లాడుతూ వ్యాధి నియంత్రణకు అవసరమైన చర్యలు అత్యవసరంగా అమలు చేయాలని పౌర సంస్థల అధికారులకు ఇప్పటికే సూచించామన్నారు.

మొదటిస్థానంలో ఖుర్దా

ఈ ఏడాదిలో జనవరి నుంచి జూన్‌ వరకు రాష్ట్రవ్యాప్తంగా 288 కేసులు వెలుగుచూసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది ఇదే సమయానికి 164 కేసులు మాత్రమే నమోదైనట్లు ఆరోగ్యశాఖ రికార్డులు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో రుతుపవనాలు తాకిడి మొదలైన నేపథ్యంలో కేవలం గడిచిన 5 రోజుల్లో దాదాపు 80 కేసులు నమోదు కావడం గమనార్హం. అనుగుల్, దేవగఢ్, గజపతి, కేంఝర్, నువాపడ, సంబల్‌పూర్‌ మినహా మిగతా 24 జిల్లాల్లో తాజా కేసులు నమోదైనట్లు వైద్యశాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 12,845 డెంగీ కేసులు నమోదు కాగా, భువనేశ్వర్, రవుర్కెలా, కటక్, రాయగడ పీడిత ప్రాంతాలుగా రికార్డులకెక్కాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అత్యధిక డెంగీ కేసులతో ఖుర్దా ప్రథమ స్థానంలో ఉండగా, సుందర్‌గడ్, రాయగడ, కటక్‌ తరువాత స్థానాల్లో నిలిచాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని