logo

జగన్నాథునికి దశమూలిక గుళికల చికిత్స

పూరీ శ్రీక్షేత్రంలోని ఒనొసొనో (చీకటి) మందిరంలో జగన్నాథుడు కోలుకున్నాడు. ఆషాఢ బహుళ పక్షమి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం స్వామికి దైతాపతి సేవాయత్‌లు ప్రత్యేక సేవలు నిర్వహించారు.

Published : 03 Jul 2024 03:08 IST

కోలుకున్న స్వామి... రథాలకు ముస్తాబు

శ్రీక్షేత్రానికి తెచ్చిన దశమూలికా గుళికలు

గోపాలపూర్, న్యూస్‌టుడే: పూరీ శ్రీక్షేత్రంలోని ఒనొసొనో (చీకటి) మందిరంలో జగన్నాథుడు కోలుకున్నాడు. ఆషాఢ బహుళ పక్షమి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం స్వామికి దైతాపతి సేవాయత్‌లు ప్రత్యేక సేవలు నిర్వహించారు. 11 రోజులుగా అస్వస్థతకు గురైన పురుషోత్తమునికి వస్త్రాలు మార్చలేదు. తులసి, సుగంధ పుష్పాలతో అలంకరణ చేయించుకునే స్వామికి ఇంతవరకు తెలుపు నందివర్దనం పూలు మాత్రమే మాలకట్టి మెడలో వేశారు. స్వామి కోలుకున్న నేపథ్యంలో ధరింపజేసిన వస్త్రాలు మార్చారు. ఆనవాయితీ ప్రకారం ఏకాదశినాడు తులసిమాల ధరింపజేశారు. రాజవైద్యుల సూచనల మేరకు ఆయుర్వేద వైద్యులు తయారుచేసిన దశమూలికా గుళికలు అర్పించారు. పాలమీగడ, జున్ను, పంచామృతం, పళ్లు నైవేథ్యంగా పెట్టారు. దీంతో చతుర్థామూర్తులు జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనులు పూర్తిగా కోలుకున్నారు. బుధవారం నుంచి శ్రీక్షేత్రంలో సందడి ప్రారంభం కానుంది.

జగన్నాథుని నందిఘోష్‌ రథాలంకరణకు సిద్ధమవుతున్న చిలకల బొమ్మలు

ముమ్మరంగా పనులు

ఆదివారం విశ్వప్రసిద్ధ రథయాత్ర నిర్వహించనుండగా నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్‌ రథాల తయారీ పనులు చివరిదశకు చేరుకున్నాయి. అలంకరణ పనులు ముమ్మరమయ్యాయి. మహరణా, దర్జీ, చిత్రకార్, రూప్‌కార్‌ సేవాయత్‌లు రాత్రి వరకు స్వామిసేవ నిష్ఠగా నిర్వహిస్తారు. శుక్రవారం సాయంత్రంనాటికి మూడురథాలు సిద్ధమవుతాయని ప్రధాన విశ్వకర్మ సేవాయత్‌ బిజయ్‌ మహాపాత్ర్‌ మంగళవారం విలేకరులకు చెప్పారు.

శ్రీక్షేత్రం వద్ద సిద్ధమైన రథాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని