logo

వికసిత్‌ ఒడిశా నిర్మాణమే ధ్యేయం

‘వికసిత్‌ ఒడిశా’ నిర్మాణం తమ ధ్యేయమని, ప్రజల ఆశయాలు వమ్ము చేయబోమని, స్వచ్ఛతకు పెద్దపీఠ వేస్తామని భాజపా పెద్దలన్నారు. గత ప్రభుత్వంలో కమీషన్లు వసూలు చేసినవారిని విడిచి పెట్టబోమని, అవినీతిపై ఉక్కుపాదం మోపుతామని, పూరీ జగన్నాథుని రత్నభాండాగారం త్వరలో తెరిపించి స్వామి సంపద లెక్కింపు చేయించి భద్రపరుస్తామని ప్రకటించారు.

Published : 01 Jul 2024 05:59 IST

భాజపా విజయోత్సవంలో నేతల స్పష్టీకరణ

వేదికపై సీఎంకు మొక్క బహూకరిస్తున్న మన్మోహన్‌ సామల్‌. చిత్రంలో కేంద్ర మంత్రులు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ‘వికసిత్‌ ఒడిశా’ నిర్మాణం తమ ధ్యేయమని, ప్రజల ఆశయాలు వమ్ము చేయబోమని, స్వచ్ఛతకు పెద్దపీఠ వేస్తామని భాజపా పెద్దలన్నారు. గత ప్రభుత్వంలో కమీషన్లు వసూలు చేసినవారిని విడిచి పెట్టబోమని, అవినీతిపై ఉక్కుపాదం మోపుతామని, పూరీ జగన్నాథుని రత్నభాండాగారం త్వరలో తెరిపించి స్వామి సంపద లెక్కింపు చేయించి భద్రపరుస్తామని ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నం భువనేశ్వర్‌ ప్రదర్శనా మైదానంలో ఆ పార్టీ విజయోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్‌చరణ మాఝి, ఉపముఖ్యమంత్రులు కనకవర్ధన్‌ సింగ్‌ దేవ్, ప్రభాతి పరిడ, మంత్రివర్గ సహచరులు, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌ (విద్య), అశ్వినీ వైష్ణవ్‌ (రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్, సమాచార), జోయల్‌ ఓరం (గిరిజన సంక్షేమం), పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మన్మోహన్‌ సామల్‌ తదితరులు పాల్గొన్నారు.  

వలసలు నివారిస్తాం

సీఎం మోహన్‌ మాట్లాడుతూ... అన్నదాతలు, యువత, మహిళలు ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తామని, నిర్మాణ రంగం పరుగులు తీయించి వలసలు నివారిస్తామన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ప్రజాభిప్రాయానికి అద్దం పడుతుందన్నారు. పూరీ జగన్నాథుని రత్నభాండాగారం సంపద లెక్కింపులో అక్రమాలు జరిగుంటే బాధ్యులు ఎంతటివారైనా వదిలిపెట్టబోమన్నారు.  

పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు

రైల్వే మంత్రి అశ్వినీ మాట్లాడుతూ... పూరీ, భువనేశ్వర్‌ స్టేషన్లకు ప్రపంచస్థాయి సౌకర్యాల కల్పన జరుగుతోందన్నారు. రానున్న అయిదేళ్లలో రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కింద రూ.లక్షకోట్లు పెట్టుబడులు వస్తాయన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ ఆధారిత నిర్మాణాలు, సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.

నిధులకు కొరత లేదు

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర మాట్లాడుతూ... నిధులకు కొరత ఉండదని, ప్రతి పనికి మోదీ గ్యారంటీ ఉందని, ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతని చెప్పారు. కేంద్రమంత్రి జోయల్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తదితరులు మాట్లాడారు. వేదికపై భాజపా నాయకత్వం సీఎంను గజమాలతో సత్కరించింది నేతలంతా పరస్పరం అభినందించుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని