logo

సహజ నీటి వనరుల సంరక్షణలో ఒడిశా భేష్‌

సహజ నీటి వనరుల సంరక్షణ, పునరుద్ధరణ చర్యల్లో రాష్ట్రం మంచి ఫలితాలు సాధిస్తోంది. ఈ కేటగిరిలో దేశవ్యాప్తంగా టాప్‌-7 రాష్ట్రాల జాబితాలో ఒడిశా నిలిచింది. నీటి వనరుల ఏర్పాటు, వాటి పునరుద్ధరణ పనుల్లోనూ రాష్ట్రం పురోగతి సాధిస్తుండడం శుభపరిణామం.

Published : 01 Jul 2024 05:53 IST

టాప్‌-7  రాష్ట్రాల జాబితాలో మనకు చోటు

అమృత్‌ సరోవర్‌ కింద చేపడుతున్నచెరువు పనులు 

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: సహజ నీటి వనరుల సంరక్షణ, పునరుద్ధరణ చర్యల్లో రాష్ట్రం మంచి ఫలితాలు సాధిస్తోంది. ఈ కేటగిరిలో దేశవ్యాప్తంగా టాప్‌-7 రాష్ట్రాల జాబితాలో ఒడిశా నిలిచింది. నీటి వనరుల ఏర్పాటు, వాటి పునరుద్ధరణ పనుల్లోనూ రాష్ట్రం పురోగతి సాధిస్తుండడం శుభపరిణామం. దిల్లీ ఆధారిత సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) అధ్యయనంలో ఈ అంశాలు వెలుగుచూశాయి. ఆ నివేదిక ప్రకారం... దేశవ్యాప్తంగా ఒక్కో జిల్లాలో 75కిపైగా చెరువుల నిర్మాణం, పునరుద్ధరణ పనులు చేపట్టాలనే లక్ష్యంతో 2022 ఏప్రిల్‌లో మిషన్‌ అమృత్‌ సరోవర్‌ ప్రోగ్రాంను ప్రవేశపెట్టారు. ఈ లక్ష్యాన్ని అందిపుచ్చుకున్న ఒడిశా అన్ని జిల్లాల్లోనూ వీటిని పూర్తిచేసింది. 30 జిల్లాలున్న రాష్ట్రంలో 2,250 నీటి వనరుల ఏర్పాటు లక్ష్యం కాగా, 2,367 చెరువులను అభివృద్ధి చేయడం గమనార్హం. అత్యధికంగా 16,909 చెరువులతో యూపీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. అమృత్‌ సరోవర్‌ లక్ష్యాలను పూర్తి చేసిన రాష్ట్రాల జాబితాలో యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఏపీ, ఒడిశా ఉన్నాయి. మన రాష్ట్ర లక్ష్యాన్ని అందిపుచ్చుకోవడంలో స్థానిక ‘మో పొఖరి’ (నా చెరువు) అనే పథకం కూడా ఓ కారణమని అధ్యయనం తేల్చింది. 

బొలంగీర్‌లో అత్యధికం

అమృత్‌ సరోవర్‌ పథకం కింద రాష్ట్రంలో బొలంగీర్‌ జిల్లా ప్రథమ స్థానం (91 చెరువులు)లో నిలిచినట్లు సీఎస్‌ ఈ నివేదికలో పేర్కొంది. దేశవ్యాప్తంగా అత్యధిక నీటి వనరులు కలిగి ఉన్న రాష్ట్రాల జాబితాలో మన రాష్ట్రం నాలుగో స్థానంలో ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. ఒడిశాలో 1,81,837 నీటి వనరులు ఉండగా, మనకంటే పశ్చిమ బెంగాల్‌ (7.47 లక్షలు), యూపీ (2.45 లక్షలు), ఏపీ (1.94 లక్షలు) ముందంజలో ఉన్నాయి. నీటి వనరుల కేటగిరిలో 16,804తో బాలేశ్వర్‌ ప్రథమ స్థానంలో ఉండగా, మయూర్‌భంజ్‌ - 15,986 కేంద్రపడ - 12,509, పూరీ- 9,808, నవరంగపూర్‌-9760, కేంఝర్‌- 8912, గంజాం- 8,632 తరువాతి స్థానాల్లో ఉన్నట్లు గణాంకాలు పేర్కొన్నాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని